సాక్షి,అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూలులో జోక్యం చేసుకోబోమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఫ్రంట్‌లైన్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్న దృష్ట్యా కొద్ది రోజులు ఎన్నికలు వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దీంతో నోటిఫికేషన్లోని షెడ్యూలు ప్రకారమే పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సవరిస్తూ... తొలిదశ ఎన్నికలను మాత్రం రీషెడ్యూలు చేశారు. మిగతా దశలన్నీ యథాతథంగా జరగనున్నాయి. ఫలితంగా... సోమవారం నుంచి నుంచి మొదలుకావాల్సిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ... ఈ నెల 29 నుంచి ఆరంభం కానుంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని... ఎన్నికల ప్రక్రియలో తామూ ముందుకెళతామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
నిజానికి ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ ఉద్యోగులు, సామాన్య ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యమిస్తోంది. కోవిడ్ కేసులు భారీగా వస్తున్న సమయంలో ఎన్నికలు సరికాదని పేర్కొంది. రోజుకు ఒకటీ రెండూ కేసులు వస్తున్నపుడు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్... కేసులు భారీగా వస్తున్నపుడు మాత్రం ఓకే అనటాన్ని ప్రశ్నిస్తూ వచ్చింది. పైపెచ్చు ఇటీవల వ్యాక్సినేషన్ మొదలైంది. కోవిడ్ విధుల్లో ఇప్పటికే చాలామంది ఫ్రంట్‌లైన్ వారియర్లు ప్రాణాలు కోల్పోయారు. ఫ్రంట్‌లైన్ సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవాలని... తీసుకున్నవారు ఒత్తిడికి, ఆందోళనకు గురికాకుండా చూడాలని కేంద్రం సైతంనిర్దేశిస్తోంది.
టీకా వేశాక వారిని అబ్జర్వేషన్లో ఉంచి... 4 వారాల తరవాత రెండో డోసు ఇవ్వాలి. తాజాగా ఒక ఆశా వర్కర్ వ్యాక్సిన్ తీసుకుని మరణిస్తే ప్రభుత్వం నష్టపరిహారం కూడా చెల్లించింది. అలాంటి ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఎన్నికల విధుల్లో పాల్గొంటే వారికి రిస్కు ఎక్కువే. అందుకే వారికి ఎన్నికల విధులు లేకుండా చూడటానికి ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీని కోరింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. చివరకు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు మేరకు ముందుకెళ్లాల్సి వస్తోంది.
సమన్వయంతో వెళ్లాలన్న సుప్రీం... పట్టించుకోని సీఈసీ
ఎన్నికల విషయంలో ప్రభుత్వం– ఎలక్షన్ కమిషన్ సమన్వయంతో ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు తన తాజా ఉత్తర్వుల్లో సూచించింది. కాకపోతే ఎన్నికల కమిషనర్ మొదటి నుంచీ దీనికి భిన్నంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సోమవారం సుప్రీంలో కేసు ఉన్నందున అప్పటిదాకా ఎన్నికల విషయంలో ముందుకెళ్లొద్దని శనివారం ఒక లేఖ ద్వారా ఈసీని చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ అభ్యర్ధించారు. ఈసీ అదేమీ పట్టించుకోకుండా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి... దానికి ఎవ్వరూ రాకపోవటంతో అసహనం వ్యక్తంచేశారు. చివరకు సోమవారంనాడు సుప్రీం తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే తొలిదశ ఎన్నికలను రీషెడ్యూలు చేసేశారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో చీఫ్ సెక్రటరీతో మాట్లాడటం కూడా చేయలేదు. ఏకపక్షంగా ఎన్నికల రీషెడ్యూలు ఉత్తర్వులివ్వటమే కాకుండా... రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల్లో పాల్గొనకపోతే కేంద్రం నుంచి సిబ్బందిని ఇవ్వాలంటూ లేఖ కూడా రాసేశారు. కోవిడ్ భయమనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాదని... కేంద్ర ఉద్యోగులక్కూడా ఉంటుందని కనీసం ఆలోచించకపోవటం... దానిపై ప్రభుత్వంతో మాటమాత్రం కూడా చర్చించకపోవటమే విచిత్రం. వీటన్నిటికీ తోడు పలువురు అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ బదిలీలు చేయాలనటం కూడా ఆయన వైఖరిని తెలియజెప్పేదే.
Comments
Please login to add a commentAdd a comment