సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సునీత రెడ్డి వేసిన పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. కేసును ఈ నెల 19కి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం.
సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ A.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాగా కేసులో తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా లాయర్ ను పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది.
సునీత : సీబీఐ దర్యాప్తునకు అవినాష్ ఏ మాత్రం సహకరించడం లేదు. ఏప్రిల్ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు రాలేదు
జస్టిస్ విక్రమ్ నాథ్ : ఈ కేసులో అంత అత్యవసరమైన పరిస్థితి ఏముంది? వెకేషన్ ముందున్న బెంచ్‌కు రావాల్సిన పరిస్థితి ఉందా?
జస్టిస్ A.అమానుల్లా : ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా? లేదా అన్నది దర్యాప్తు సంస్థ చూసుకుంటుంది. ఎవరిని ఎప్పుడు అరెస్టు చేయాలో, ఎవరిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలో CBIకి తెలుసు. ఈ కేసులో చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయి.
సునీత : ఇతర నిందితులతో కలిసి అవినాష్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది
సుప్రీంకోర్టు : అవినాష్ రెడ్డి CBI ముందు హాజరవుతున్నారు కదా, అలాగే దర్యాప్తుకు సహకరిస్తున్నప్పుడు CBIకి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం ఏముంది? ఈ కేసులో మీరు తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారు, మీరు (సునీతను ఉద్దేశించి) న్యాయశాస్త్రంలో నిష్ణాతులు కాకపోవచ్చు. మీ పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేస్తే.. తర్వాత వచ్చే లాయర్ కు సమస్య ఎదురవుతుంది. సెలవుల తర్వాత ఈ కేసును పరిశీలిద్దామా?
సీనియర్ లాయర్ లుథ్రా: ఈ నెలాఖరులోగా సిబిఐకి ఇచ్చిన దర్యాప్తు గడువు ముగుస్తుంది
సుప్రీంకోర్టు : మిస్టర్ లుథ్రా.. మీరు సమస్యలు సృష్టిస్తున్నారు. వాదనలు వద్దంటున్నా.. మీరు తలదూర్చాలనుకుంటున్నారు. ఈ కోర్టులోనే ఒక బెంచ్ విధించిన గడువుపై మేం మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాలా?
సునీత : ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సిబిఐని ఆదేశించండి
సుప్రీంకోర్టు : అలాంటి ఉత్తర్వులు మేమేలా ఇస్తాం? ఈ పిటిషన్ లో విచారణకు రావాలా లేదా అన్నది CBI ఇష్టం. జులై 3న రండి
సునీత : హైకోర్టు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సమీక్షించే తుది అధికారం సుప్రీంకోర్టుకు ఉందని గతంలో మీరు చెప్పారు కదా
జస్టిస్ A.అమానుల్లా : మీరు ఆరోపణలు చేస్తున్న నిందితుడు మీ కజినా?
సునీత : అవును, అవినాష్ రెడ్డి నాకు సెకండ్ కజిన్
సీనియర్ లాయర్ లుథ్రా: ఈ కేసును రేపు పరిశీలించండి. రేపు అడ్వొకేట్ ఆన్ రికార్డును కోర్టు ముందుంచుతాం. నేను వాదనలు వినిపిస్తాను
సుప్రీంకోర్టు : మీరు అడిగినట్టు CBIకి నోటీసులు ఇవ్వలేం. కేసును జూన్ 19వ తేదీకి (వచ్చే సోమవారం) వాయిదా వేస్తున్నాం
తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జారీ చేసిన బెయిల్‌ను సవాల్ చేస్తూ సునీతా రెడ్డి వేసిన పిటిషన్‌లో సిబిఐకి నోటీసులు జారీ చేయాలని కోరినా.. సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో సునీత తీరు పంతాలకు పోయి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. కేవలం అవినాష్ రెడ్డిని జైల్లో వేయించడమే లక్ష్యంగా సునీత తీరు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. కేసుకు సంబంధించి అదనపు పత్రాలు సమర్పించేందుకు సునీతకు అవకాశమిచ్చింది సుప్రీంకోర్టు. ఈ కేసును జూన్ 19న పరిశీలిస్తానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment