ఆర్థిక నేరాలకు మార్గదర్శితో ముగింపు!: ఉండవల్లి అరుణ్‌కుమార్‌ | Swarnandhra Vedika Conference Ramoji Rao Margadarsi Irregularities | Sakshi
Sakshi News home page

ఆర్థిక నేరాలకు మార్గదర్శితో ముగింపు!: ఉండవల్లి అరుణ్‌కుమార్‌

Published Sun, May 7 2023 6:16 PM | Last Updated on Mon, May 8 2023 7:17 AM

Swarnandhra Vedika Conference Ramoji Rao Margadarsi Irregularities - Sakshi

సదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌. చిత్రంలో వక్తలు

సాక్షి, విశాఖపట్నం: రిజిస్టర్‌ చేయకుండా చిట్‌ఫండ్‌ నిర్వహించిన కేసులో మార్గదర్శి చైర్మన్‌ చెరుకూరి రామోజీరావు గతంలో నాలుగు  రోజుల పాటు హైదరాబాద్‌ అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నారని, అప్పటి నుంచి ఆయన మోసాలు కొనసాగుతూనే ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. మార్గదర్శి కేసుతోనైనా దేశంలో ఆర్థిక నేరాలకు ఫుల్‌స్టాప్‌ పడాలని వ్యాఖ్యానించారు.

17 ఏళ్లుగా కొనసాగుతున్న మార్గదర్శి కేసు ఇక ముగిసిన అధ్యాయం అనుకున్న తరుణంలో డిపాజిట్‌­దారుల ప్రయోజనాలను కాపాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ వేసిన ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌తో కొత్త ఊపిరి వచ్చిందని, లక్షల మంది ఖాతాదారులకు ధైర్యం వచ్చిందని పలువురు వక్తలు అభిప్రాయ­పడ్డారు. విశాఖలోని ఓ హోటల్‌లో ఆదివారం సాయంత్రం స్వర్ణాంధ్రవేదిక ఆధ్వర్యంలో ‘రామోజీరావు మార్గదర్శి అక్రమాలు– నిజానిజాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పలువురు మాట్లాడారు.

ఎవరికి ఫిర్యాదు చేయాలి?: ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ
17 ఏళ్ల తరువాత డబ్బులు ఎవరికి ఇచ్చారో వెల్లడించాలని మార్గదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఘన విజయం సాధించామని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. జూలై 18కి కేసు వాయిదా వేశారు. చాలా ఏళ్లు న్యాయస్థానాల్లో కేసు ఏమిటనేది వినే పరిస్థితి రాలేదు. 2021లో హైకోర్టులో కేసు కొట్టివేసిన తర్వాత ఎస్‌ఎల్‌పీ (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌)దాఖలు చేశా. ఏడాది తర్వాత ఏపీ ప్రభుత్వం నేరుగా ఎస్‌ఎల్‌పీ వేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరైన టైమ్‌లో స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్‌ వేయడంతో నాకు నమ్మకం వచ్చింది. ఈ కేసు కథ ముగిసిపోతుందనుకున్న తరుణంలో వైఎస్‌ జగన్‌ వేసిన ఎస్‌ఎల్‌పీతో మళ్లీ మొదలైంది.

దివంగత వైఎస్సార్‌ అనుకున్నది రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి చేయలేకపోయారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎవరికి డబ్బులు చెల్లించారనే వివరాలు బయటకు వస్తే ఈ కేసు ఈడీకి వెళ్తుందా? మనీ ల్యాండరింగ్‌కు కిందకు వెళ్తుందా? చెల్లించిన డిపాజిటర్లు ఎవరు? అనే విషయాలు బయటకు వస్తాయి. మొత్తం 2.36 లక్షల మంది పేర్లు బయటికి వస్తాయి. దీన్ని వచ్చే ఎన్నికల్లో ఇష్యూ చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది. ఎవరూ కంప్‌లైంట్‌ ఇవ్వలేదని రామోజీ అంటున్నారు. చిట్‌ డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? పోలీస్‌ స్టేషన్‌లో ఇస్తే తీసుకుంటారా? కలెక్టరేట్‌లో తీసుకుంటారా?

అదే బాటలో ధనలక్ష్మి, కార్తికేయ...
రామోజీని చూసి మిగిలిన చిట్స్‌ కూడా మోసాల బాట పడుతున్నాయి. రామోజీ ఏం చేస్తున్నారో అందరూ అదే చేస్తున్నారు. మూడు నెలల క్రితం కాకినాడలో ధనలక్ష్మి సొసైటీ, నెల క్రితం కార్తికేయ సొసైటీ మూతపడ్డా పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఎర్రన్నాయుడి వియ్యంకుడైన ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడిని ఇదే మోసం కారణంగా అరెస్టు చేశారు. రామోజీని అరెస్ట్‌ చేయవద్దంటూ హైకోర్టు తీర్పు వచ్చింది. మరి అలాంటప్పుడు అప్పారావును ఎందుకు అరెస్టు చేశారని ఆయన్ను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు? ఇద్దరికీ చెరో నీతా? రామోజీని ఇంటికెళ్లి విచారిస్తారు.. అప్పారావును ఎందుకు అరెస్టు చేస్తారు? అని అడగాలి కదా! ఆదిరెడ్డి అప్పారావు ఏమైనా పర్వాలేదు కానీ రామోజీకి ఏమీ జరగకూడదని టీడీపీ స్టాండ్‌ తీసుకుంది. 

అబిడ్స్‌ స్టేషన్‌లో రామోజీ..
ఈనాడుకు మొట్టమొదటి ఎడిటర్‌ ఉన్న ఏబీకే ప్రసాద్‌కు ఫోన్‌ చేస్తే.. ఏ పర్మిషన్‌ లేకుండా చిట్‌ ఫండ్‌ కంపెనీ నడుపుతున్నారన్న ఆరోపణలపై రామోజీరావు నాలుగు రోజుల పాటు అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నారన్న కొత్త విషయాన్ని చెప్పారు. ఆ తర్వాతే మార్గదర్శిని రిజిస్టర్‌ చేశారట. జీవీ రెడ్డి మార్గదర్శిపై చర్చకు వస్తామని ప్రకటించారు. కానీ హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ని ఈ నెల 14న టీడీపీ అఫీషియల్‌ స్పోక్స్‌ పర్సన్‌ పేరుతో బుక్‌ చేసుకున్నారు. రామోజీ కోసం ఏమైనా చేస్తామని తద్వారా టీడీపీ నేరుగానే చెబుతోంది.

రెండు దశాబ్దాల నిరంకుశత్వం
రామోజీ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న మార్గదర్శితో ఈ వేదికపై ఉన్నవారెవరికీ వ్యక్తిగత ద్వేషాలు లేవు. ఈనాడైనా.. చిత్తు కాగితాలైనా.. పచ్చళ్‌లైనా.. పరిశ్రమలైనా.. చిట్స్‌ అయినా.. తానే చేయాలన్నదే రామోజీరావు కాన్సెప్ట్‌. చిన్నవాడెవడూ బతకకూడదు. ఆయనకి యాడ్స్‌ ఇవ్వకపోతే వ్యతిరేకంగా వార్తలు రాయడం నిత్యకృత్యమైంది. బలవంతుడైన రామోజీతో పోరాటం చేయడం చిన్నవిషయం కాదు. అధికార శక్తి, మీడియా శక్తి ఏకమైతే ఎంత భయంకరంగా ఉంటుందో గత రెండు దశాబ్దాలుగా రామోజీ రూపంలో చూస్తున్నాం. మార్గదర్శి అక్రమాలపై త్వరలో తిరుపతిలో సదస్సు నిర్వహిస్తాం.
– కేబీజీ తిలక్, స్వర్ణాంధ్ర దినపత్రిక ఎడిటర్‌
 

‘చంద్రమతి మాంగల్యం’.. మార్గదర్శి ఆస్తులు!
డిపాజిటర్లు మోసపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించి డిపాజిటర్లను కాపాడింది. కొత్త అప్పులు రెండు లక్షల మందికిపైగా డిపాజిటర్లకు గుదిబండగా మారనున్నాయి. అనుబంధ కంపెనీలకు నిధులు ఎలా బదలాయిస్తారు? ‘చంద్రమతి మాంగల్యం’ మాదిరిగా ఆస్తులు వారికి మినహా ఇతరులకు కనపడటం లేదు. అగ్రిగోల్డ్, సహారా మోసాలు జరిగిపోయాయి. మరిన్ని జరగకుండా నివారించడం మన బాధ్యత. నిజంగా డిపాజిటర్లకు చెల్లించి ఉంటే సుప్రీం ఆదేశాల ప్రకారం వివరాలను వెల్లడించాలి. డిపాజిట్‌ రసీదుపై రామోజీరావు సంతకం ఉంటుంది. డిశ్చార్జ్‌ రసీదుపై ప్రొప్రైటర్‌ సంతకం చేయడం నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తిగా లోతైన దర్యాప్తు చేపట్టాలి. 
– శర్మ, ప్రముఖ న్యాయవాది.

బ్రహ్మయ్య కంపెనీలో వందల ఫిర్యాదులు
మార్గదర్శి, డాల్ఫిన్, ప్రియా ఫుడ్స్, ఈనాడుతో 1979 నుంచి నాకు అనుబంధం ఉంది. ఉండవల్లి పోరాటం జరిగిన తర్వాత రామోజీ మోసాలు ప్రతి ఒక్కటీ గుర్తుకొచ్చాయి. 100 టన్నుల న్యూస్‌ ప్రింట్‌ పేపర్‌ దిగుమతి చేసుకుంటే 90 టన్నులు మాత్రమే వినియోగించేవారు. ఇలాంటి ఎన్నో మోసాలు నా కళ్లముందే జరిగాయి. మా మామయ్య కేఎస్‌ రెడ్డి అన్నదాత ఎడిటర్‌గా ఉండేవారు.

రామోజీ ప్రజల డబ్బులతో హోటల్స్‌.. ప్రింటింగ్‌ ప్రెస్‌లు, బిల్డింగ్‌లు కడుతున్నారని, చివరకు ఏమవుతుందోనని మామయ్య ఆందోళన చెందేవారు. చట్టాల్లో లొసుగులను అడ్డు పెట్టుకొని తప్పించుకోవడం రామోజీరావుకి వెన్నతో పెట్టిన విద్య. టీడీపీ నుంచి వచ్చిన జీవీ రెడ్డికి, మార్గదర్శికి ఏం సంబంధం? మా గ్రామంలో ఒక వ్యక్తికి చిట్‌ అయిపోయిన 9 ఏళ్ల తర్వాత డబ్బులిచ్చారు. నేను ఆడిట్‌ చేసిన సమయంలో బ్రహ్మయ్య అండ్‌ కంపెనీలో మార్గదర్శిపై కొన్ని వందల కంప్‌లైంట్స్‌ ఉన్నాయి. 
– నాగార్జునరెడ్డి, ప్రముఖ చార్టెడ్‌ అకౌంటెంట్‌
చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement