
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం వారికి ఉచితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. వీటి ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో అత్యున్నత ప్రమాణాలు సాధించేలా చర్యలు తీసుకుంది.
ఇందులో భాగంగా వరుసగా రెండో ఏడాదీ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన ట్యాబ్‌లను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.750 కోట్ల వ్యయంతో ఐదు లక్షల ట్యాబ్‌లను కొనుగోలు చేసేందుకు ఈ–టెండర్‌ను ఆహ్వానించింది. టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపించింది.
ప్రివ్యూ అనంతరం పారదర్శకంగా తక్కువ కోట్ చేసిన వారిని ఎంపిక చేసి మళ్లీ రివర్స్ టెండరింగ్‌ను నిర్వహించనుంది. ఇందులో తక్కువ కోట్ చేసిన వారికి ట్యాబ్‌ల సరఫరాను అప్పగించనుంది. గతేడాది ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో ప్రీలోడ్ చేయించి 8వ తరగతి విద్యార్థులకు అందించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా 8వ తరగతి విద్యార్థులకు ఐదు లక్షల ట్యాబ్‌లను ఉచితంగా అందించనుంది.
ఆఫ్‌లైన్‌లోనూ వీడియో పాఠ్యాంశాలు
8వ తరగతి విద్యార్థులు ఈ ట్యాబ్‌ల ద్వారా నిర్వహించే అభ్యసనాన్ని పర్యవేక్షించేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం విశేషం. ట్యాబ్‌కు ఒకసారి చార్జింగ్ పెడితే 10 గంటలపాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇంటర్‌నెట్‌తో సంబంధం లేకుండా ఆఫ్‌లైన్‌లో వీడియో పాఠ్యాంశాలను అభ్యసించేలా ప్రీలోడెడ్ కంటెంట్‌తో ఈ ట్యాబ్‌లను అందిస్తారు. 3 ఏళ్ల పాటు వీటికి వారెంటీ ఉంటుంది.
పదో తరగతి వరకు విద్యార్థులు ఈ ట్యాబ్‌ల ద్వారా పాఠాలు అందుకుంటారు. మధ్యలో ట్యాబ్‌ల్లో ఏదైనా సమస్య వచ్చినా సరఫరా చేసిన సంస్థ తిరిగి సరిచేసి ఇస్తుంది. పిల్లలను పక్కదారి పట్టించే ప్రమాదకర వెబ్‌సైట్‌లు ఓపెన్ కాకుండా ప్రత్యేకమైన లాకింగ్ వ్యవస్థను కూడా ట్యాబ్‌ల్లో ఏర్పాటు చేశారు.
సిమ్ స్లాట్‌ను లాక్ చేయడంతో ఓపెన్ కాదు. ఆఫ్‌లైన్‌లో మాత్రమే బైజూస్ యాప్ ఓపెన్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. గూగుల్ వంటివి ఓపెన్ అయినా వాటిలో కేవలం విద్యార్థులు అదనపు సబ్జెక్టు అంశాలను నేర్చుకోవడానికే అవకాశం ఉంటుంది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులకు అవకాశం..
విద్యార్థులకు అందించే ఒక్కో ట్యాబ్ 8.7 అంగుళాల టచ్ స్క్రీన్, కనీసం 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్ కలిగి ఉండాలని ప్రభుత్వం టెండర్ డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది. సరఫరా చేసిన 30 రోజుల్లోగా ట్యాబ్‌లో లోపాలుంటే దాని స్థానంలో కొత్త ట్యాబ్‌ను ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ట్యాబ్‌లో రిపేరు వస్తే ఏడు రోజుల్లోగా సరిచేసి ఇవ్వాలనే నిబంధన విధించింది. ట్యాబ్‌ల్లో లోపాలుంటే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
ఈ ఫిర్యాదుల ఆధారంగా ఏడు రోజుల్లోగా లోపాలను సరిచేసి ట్యాబ్‌లను అందించాలని టెండర్ డాక్యుమెంట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్యాబ్‌లన్నీ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉండాలని.. ఇందులో ఎక్కడా రాజీపడేది లేదని పేర్కొంది. నిర్ధారించిన ప్రమాణాల మేరకు సరఫరా చేయకపోతే బ్లాక్‌లిస్ట్‌లో కూడా ఉంచనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment