
2047 నాటికి రూ.199 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యం
పారిశ్రామికవేత్తలను కోరిన పరిశ్రమల శాఖ
సాక్షి, అమరావతి: పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని, ఇందులో భాగస్వాములు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చింది. వికసిత్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)ని రూ.199 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ.35,69,000కు పెంచాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని వెల్లడించింది. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి పారిశ్రామికవేత్తలు సూచనలు, సలహాలు ఇవ్వాలని పరిశ్రమల శాఖ కోరింది.
వికసిత్ ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని తెలిపింది. ప్రతి సూచన, సలహాను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా పారిశ్రామికవేత్తల చొరవను గుర్తిస్తూ ఈ–సర్టిఫికెట్‌ను కూడా ప్రదానం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ, ఏపీ ఎకనమిక్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) సామాజిక మాధ్యమాల ద్వారా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చాయి. సూచనలు, సలహాలను http:// swarnandhra.ap.gov.in/Suggestions ద్వారా తెలియజేయొచ్చు.