నవ దంపతులపై కార్యకర్తల దాడి.. సీఐ గదిలోంచి ప్రేమికుడిని లాక్కొచ్చి చితకబాదిన వైనం
అడ్డుకున్న పోలీసులపైనా తిరగబడి దాడికి యత్నం
కాల్పులు జరుపుతామంటూ సీఐ హెచ్చరించడంతో వెళ్లిపోయిన టీడీపీ శ్రేణులు
భయంతో పారిపోయిన ప్రేమికుడి బంధువులు, స్నేహితులు
ఆళ్లగడ్డ: అధికారం అండ చూసుకుని టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయి. పోలీసులు, పోలీస్స్టేషన్లన్నా లెక్కే లేకుండా పోయింది. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నవ దంపతులపై సాక్షాత్తు సీఐ ఎదురుగానే దాడికి దిగారు. ప్రేమికుడిని బయటకు లాక్కొచ్చి చితకబాదారు. పోలీసుల సమక్షంలోనే ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ ఘటన శనివారం రాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రం చాగలమర్రికి చెందిన సాయి అనే యువతి, వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
పెళ్లి చేసుకుంటామని కోరగా, యువతి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. ఈ క్రమంలో వారం క్రితం ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటకొచ్చి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యుల నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని రెండు రోజుల క్రితం యువతి చాగలమర్రి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. అక్కడి ఎస్‌ఐ.. ఇరు కుటుంబాల వారిని పిలిపించి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో సీఐ వద్దకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో శనివారం మధ్యాహ్నం నవ దంపతులు స్థానిక సర్కిల్ కార్యాలయం వద్దకు వచ్చారు.
యువతి కుటుంబ సభ్యులను పిలిపించి సీఐ మాట్లాడారు. కుటుంబ సభ్యుల వెంట వెళ్లనని, భర్త వెంటే ఉంటానని యువతి తెగేసి చెప్పింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఉందని, వారికి ఎటువంటి హాని తల పెట్టవద్దని సీఐ చెప్పారు. దీంతో యువతి సోదరుడు పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడున్న వారికి విషయం చెప్పాడు. రెండు కార్లలో మనుషులను వెంటబెట్టుకుని సర్కిల్ కార్యాలయం చేరుకున్నాడు.
వచ్చీ రాగానే టీడీపీ కార్యకర్తలంతా పోలీసులు చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దెబ్బలు తట్టుకోలేక యువకుడు సీఐ గదిలోకి వెళ్లి దాక్కున్నప్పటికీ, బయటకు ఈడ్చుకు వచ్చి కొట్టారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ లెక్క చేయలేదు. అక్కడి పరిస్థితి చూసి.. యువకుడికి తోడుగా వచ్చిన బంధువులు, స్నేహితులు రోడ్డుపైకి పరుగులు తీసి చీకట్లో దాక్కున్నారు.
ఫైర్ ఓపెన్ చేసేందుకు యత్నించిన సీఐ
ప్రేమికులపై దాడి చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు, సీఐ అడ్డుకుంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ఏమాత్రం లెక్క చేయలేదు. పోలీసులపై తిరగబడే పరిస్థితి రావడంతో సీఐ హనుమంత నాయక్ ఫైర్ ఓపెన్ చేస్తానని రివాల్వర్ గురిపెట్టి హెచ్చరించారు. దీంతో వెనక్కు తగ్గిన వారు అక్కడి నుంచి బయటకు వచ్చారు. వారు వచ్చిన కార్ల దగ్గర నిల్చొని ‘నువ్వు మా కార్యాలయం దగ్గరకు వస్తావు కదా.. అక్కడికి రా.. అప్పుడు నీ కథ ఉంటుంది’ అని బహిరంగంగా సీఐ వైపు వేలు చూపిస్తూ »ñబెదిరించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో నవ దంపతులను పోలీస్ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. మనస్తాపానికి గురైన సీఐ, ఇతర అధికారులు విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాల్లోని పుటేజీ తెప్పించుకుని పరిశీలించిన ఎస్పీ.. విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఐ మాట్లాడుతూ.. ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇస్తుండగా, ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో అందరినీ అరిచి అక్కడి నుంచి పంపించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment