
గురువారం గుడివాడలో జనం లేక వెలవెలబోతున్న చంద్రబాబు సభ
సాక్షి, అమరావతి: చంద్రబాబు సభలకు జనాన్ని రప్పించడం ఆ పార్టీ నేతలకు పెద్ద సవాల్‌గా మారింది. టీడీపీ తన అడ్డాగా చెప్పుకునే విజయవాడలో చంద్రబాబు పర్యటనకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి ఇదీ! టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం విజయవాడలోని రాణీగారితోట ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించగా కనీసం ఆ ప్రాంతలోని ప్రజలు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో కంగుతిన్న చంద్రబాబు హడావుడిగా నిష్క్రమించారు.
ఆ తర్వాత బందరు వెళుతూ కానూరు, పోరంకి ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు రోడ్‌షోలు ప్లాప్ కావడంతో బెజవాడ టీడీపీ నేతలు మొహాలు వేలాడేశారు. గేరు మార్చామంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా చేస్తున్న ప్రచారంలో పస లేదని విజయవాడ పర్యటనతో తేటతెల్లమైందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
బందరులో మాడిపోయిన బాబు మొహం
మచిలీపట్నంలో చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు మరో షాక్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో స్వాగతం పలికి నినాదాలు చేయడంతో మచిలీపట్నం సభ చంద్రబాబును ‘ఇదేం ఖర్మ’ అనుకునేలా చేసింది. సభకు జనం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో బాబు మొహం మాడిపోయింది.
నాయకులకు ఇండెంట్లు ఇచ్చి మరీ జన సమీకరణకు ప్రణాళిక రూపొందించినా స్పందన కరువవడంతో ఇరుకు సందులను ఎంచుకుంటున్నారు. టీడీపీ నేతలు ఫేక్ ప్రచారానికి ఎల్లో మీడియా, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. చంద్రబాబు పర్యటనలు, లోకేశ్ పాదయాత్రకు స్పందన కొరవడటంతో ప్రజలను నమ్మించేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
ఇన్‌చార్జ్‌లు కరువు
టీడీపీకి జనాదరణ లేదని గ్రహించడంతో చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇన్‌చార్జిలు లేకుండా పోయారు. సుమారు 52 నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌చార్జిలు లేరు. మరో 38 చోట్ల 3వ స్ధానానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఉంది. గన్నవరం, కైకలూరులో నాయకులు ఎవరో తెలియని దుస్థితి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నానిని ఇన్‌చార్జిగా ప్రకటించినా ఆయన్ను వ్యతిరేకించే నేతలు ఒప్పుకోవడం లేదు.
నూజివీడు, గుడివాడలో పార్టీ పరిస్థితి అంతా అయోమయం. గుంటూరు జిల్లాలో సత్తెనపల్లికి ఇన్‌చార్జి లేరు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని పూతలపట్టు, చిత్తూరు నియోజవర్గాల్లో పార్టీని నడిపించే నాథుడే లేడు. అనంతపురం జిల్లాలోని శింగనమల, మడకశిరలో టీడీపీకి అభ్యర్థులే దొరకలేదు.
Comments
Please login to add a commentAdd a comment