అర్హులపై వేటు.. అనర్హులకు చోటు! | TDP Leaders Conspiracy To Scrap Fishing Ban Allowance For Fishermen, Triggers Political Controversy Against Chandrababu | Sakshi
Sakshi News home page

అర్హులపై వేటు.. అనర్హులకు చోటు!

May 3 2026 4:46 AM | Updated on May 3 2026 12:09 PM

TDP leaders conspiracy to scrap fishing ban allowance for fishermen

జాలర్లకిచ్చే వేట నిషేధ భృతిని కొట్టేసేందుకు టీడీపీ నేతల కుట్ర

ఇసుక బోట్లు సైతం చేపల బోట్లుగా నమోదు

నేతల ఒత్తిళ్లతో మత్స్యకారులు కాని వారికి అర్హుల జాబితాలో చోటు

తొలి ఏడాది భృతి ఎగ్గొట్టిన బాబు సర్కారు

రెండో ఏడాది అరకొరగా జమ

ఈ ఏడాది పార్టీ కార్యకర్తలకు సమర్పణ

అనర్హులపై అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఫిర్యాదులు

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు గంగపుత్రుల నోట్లో మట్టికొడుతోంది. సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు దక్కాల్సిన సంక్షేమ ఫలాలను టీడీపీ కార్యకర్తలకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతోంది. అధికారంలోకి రాగానే చేపల వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి వేట విరామం వేళ ఏటా రూ.20 వేల చొప్పున నిషేధ భృతి చెల్లిస్తామన్న హామీని చంద్రబాబు సర్కారు తొలి ఏడాది తుంగలో తొక్కింది. రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. ఈ ఏడాది మాత్రం అడ్డగోలుగా పార్టీ కార్యకర్తలను వేటకు వెళ్లే మత్స్యకారులుగా నమోదు చేసి వేట నిషేధ భృతిని కాజేసేలా కుట్రలకు తెరతీశారు. మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అండదండలతోనే టీడీపీ నేతలు దోపిడీకి తెరతీసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అర్హుల సంఖ్యను భారీగా పెంచి 
రాష్ట్రంలోని 555 సముద్ర తీర మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మత్స్యకార కుటుంబాలుండగా.. 1.60 లక్షల కుటుంబాలు చేపల వేటపైనే ఆధారపడ్డాయి. 2023–24లో వేటకు వెళ్లే మత్స్యకార బోట్లు 23,209 ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 29,252కు చేరింది. వాస్తవంగా మెకనైజ్డ్‌ బోట్లకు 18 మీటర్లకు పైబడి పొడవు ఉంటే 10 మంది, 18 మీటర్ల కంటే తక్కువ ఉంటే 8 మంది, మోటార్‌ బోట్లపై ఆరుగురు, ఇంజిన్‌లేని సంప్రదాయ బోట్లపై ముగ్గురు చొప్పున సిబ్బందికి వేట నిషేధ భృతి ఇవ్వాల్సిఉంది. ఈ పథకం మెకనైజ్డ్‌ బోటు యజమానులకు వర్తించదు.

రిజిస్ట్రేషన్‌ కలిగిన బోట్లపై మార్చి 31 నాటికి 18–60 ఏళ్ల మధ్య వయసున్న వారికి వర్తిస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేట నిషేధ భృతిని పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి 1.29 లక్షల మంది అర్హత పొందగా..  వారి ఖాతాల్లో అరకొరగా జమ చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో అర్హుల జాబితాలో భారీగా అనర్హులను చేర్చి 29,252 బోట్లపై 1.57 లక్షల మంది ఆధారపడినట్టుగా లెక్కేశారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో 28,677 బోట్లపై 1.52 లక్షల మంది అర్హులున్నట్టుగా లెక్కతేల్చారు. అయితే, సోషల్‌ ఆడిట్‌ సందర్భంగా అనకాపల్లి, విశాఖ, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో జాబితాల్లోని పేర్లపై పెద్దఎత్తున ఫిర్యాదులొచ్చాయి. నిజమైన లబ్ధిదారులను కాదని మైదాన ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు కాని టీడీపీ అభిమానులు, కార్యకర్తలను జాలర్లుగా చిత్రీకరిస్తూ జాబితాల్లో నమోదు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

లేని బోట్లను ఉన్నట్టుగా చిత్రీకరించి..
ఫిషింగ్‌ బోటు రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పిడి, మరమ్మతుల అనుమతులు వంటి ప్రక్రియల్లో బ్రోకర్ల దందా సాగింది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల సిఫార్సుల మేరకు ఇసుక బోట్లను సైతం చేపల బోట్లుగా నమోదు చేయడమే కాకుండా మూలన పడిన, వినియోగంలో లేని బోట్లను మనుగడలో ఉన్నట్టు రిజిస్ట్రేషన్‌ చేయించారని చెబుతున్నారు. లేని బోట్లను సైతం ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ వాటిపై మత్స్యకారులు ఆధారపడినట్టుగా నమోదు చేయించారని చెబుతున్నారు.

ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వేట బోట్ల రిజిస్ట్రేషన్లలో భారీగా సొమ్ములు చేతులు మారినట్టుగా తెలుస్తోంది. ఈ ఒక్క ఏడాదిలోనే 3 వేలకు పైగా బోట్లను కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ బోట్లపై నిబంధనల మేరకు 6నుంచి 20 మంది వరకు నమోదు చేయాల్సి ఉండగా.. మైదాన ప్రాంతాలకు చెందిన టీడీపీ కార్యకర్తల పేర్లను ఈ జాబితాల్లో చేర్చి అర్హులుగా చిత్రీకరిస్తున్నారు.

రూ.60 వేల బోటుపై.. రూ.1.20 లక్షలు కొట్టేసేలా..
సంప్రదాయ బోట్ల పేరిట కూడా నిధులు కొట్టేసేందుకు సైతం టీడీపీ నేతలు కుట్ర పన్నినట్టు చెబుతున్నారు. వాస్తవానికి సంప్రదాయ బోటు తయారీకి రూ.60 వేలు ఖర్చవుతుందని అంచనా. ఆ బోటును ఇంజిన్‌ బోటుగా చిత్రీకరించి.. ఒక్కో బోటుపై ఆరుగురు చొప్పున చేపల వేటకు వెళ్తున్నట్టు లెక్కలు చూపి ఏకంగా ఒక్కో బోటుపై రూ.1.20 లక్షల నిషేధ భృతిని దోచేందుకు కుట్ర చేశారని చెబుతున్నారు.

‘మీకింత.. మాకింత’ అనే ఒప్పందాలతో స్థానిక మత్స్యశాఖ అధికారులతో టీడీపీ నేతలు బేరసారాలు సాగిస్తూ అనర్హులతో జాబితాలు తయారు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అర్హత పొందిన వారికి రూ.300 కోట్లకు పైగా జమ చేయనుండగా.. కనీసం రూ.50 నుంచి రూ.60 కోట్లు అనధికారిక బోట్లు, మత్స్యకారేతరుల పేరిట దారి మళ్లించేందుకు పథక రచన చేసినట్టు చెబుతున్నారు. ఈ భారీ కుంభకోణంపై ఇటీవల విశాఖలోని మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని మత్స్యకారులు చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.

విజిలెన్స్‌ విచారణ జరపాలి
అర్హుల జాబితాలో అవకతవకలు జరిగాయి. బోట్ల రిజిస్ట్రేషన్, యాజమాన్య మార్పిడి పేరుతో పెద్దఎత్తున అవినీతి జరుగుతోంది. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ పరిధిలోనే అనర్హులను పెద్దఎత్తున అర్హుల జాబితాల్లో చేర్చారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణ జరిపి.. వాస్తవంగా వేటకు వెళ్లే వారికి మాత్రమే నిషేధ భృతిని చెల్లించాలి.
– వంకా గురుమూర్తి, అధ్యక్షుడు, రాష్ట్ర మత్స్యకార కార్మిక సంఘం 

Advertisement
 
Advertisement
Advertisement