ప్యాకేజీ మింగేశారు.. 1.22 కోట్ల పేదల సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి!   | TDP Leaders Of Illegal Funds In Krishnapatnam Port At Nellore District | Sakshi
Sakshi News home page

ప్యాకేజీ మింగేశారు.. 1.22 కోట్ల పేదల సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి!  

Published Sat, Feb 4 2023 9:50 AM | Last Updated on Sat, Feb 4 2023 11:14 AM

TDP Leaders Of Illegal Funds In Krishnapatnam Port At Nellore District - Sakshi

పోర్టు నిర్మాణంతో బతుకుదెరువు కోల్పోయి నిరాశ్రయులైన పేదలకు అందాల్సిన నిధులను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన అనుచరులు స్వాహా చేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్లు ఇదిగో.. అదిగో అంటూ ఊరించి కాలయాపన చేసింది. ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలంలో ఓట్ల కోసం హడావుడిగా నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజీ నిధులను సోమిరెడ్డి మంజూరు చేయించారు. ఆ నిధులను ఆయన, అనుచరులే బొక్కేశారు. రికార్డుల్లో మాత్రం లబ్దిదారులకు అందినట్లు చూపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని అవినీతిగా ప్రచారం చేస్తూ నిత్యం ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ఉండే సోమిరెడ్డి తన అవినీతి నిర్వాకానికి మాత్రం సమాధానం చెప్పరు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  రాష్ట్రానికే తలమానికంగా కృష్ణపట్నం పోర్టును 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అప్పట్లో పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూ సేకరణ చేశారు. దీంతో ఉపాధి కోల్పోయిన నిర్వాసితుల కోసం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ప్రకటించారు. మత్స్యకార కుటుంబాల తరలింపునకు, కొంత కాలం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున రూ.32 కోట్లు అందించారు. వీరితో పాటు మత్స్యకారేతరులను గుర్తించి వారికి ప్యాకేజీ అందించాలని వైఎస్సార్‌ నిర్ణయించారు. 

అయితే, వైఎస్సార్‌ అకాల మరణం నాన్‌ ఫిషర్‌మెన్‌ కుటుంబాల పాలిట శాపంగా మారింది. ఆ తర్వాత పాలన కొనసాగించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్యాకేజీని బుట్టదాఖలు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.43 వేలకుపైగా ప్యాకేజీ అందిస్తామని కొంత కాలం మభ్యపెట్టింది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మూడు విడతల్లో ఇస్తానని చెప్పడంతో అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకమైన మత్స్యకారేతర కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాసంకల్పయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారేతర కుటుంబాల సమస్యను విన్నారు. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ విషయంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు వరకూ తెల్లరేషన్‌ కార్డు కలిగిన ప్రతి మత్స్యకారేతర కుటుంబానికి ప్యాకేజీ అందిస్తానని భరోసా ఇచ్చారు. 

ఎన్నికల ముందు హడావుడిగా.. 
టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు నాన్‌ ఫిషర్‌మెన్‌ ప్యాకేజీని పట్టించుకోని అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో వారి ఓట్ల కోసం కేవలం ఎస్సీ, ఎస్టీలకే అంటూ ప్రత్యేకంగా రూ.4.09కోట్లు మంజూరు చేయించారు. హడావుడి గా 3,550 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10,500 వంతున రూ.3.87 కోట్లు పంపిణీ చేయించారు. ఇంకా రూ.1.22 కోట్లు పంపిణీ చేయకుండా అప్పట్లో ఆ నగదు పంపిణీలో సోమిరెడ్డి, ఆయన అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. చెక్కుల రూపంలో పంపిణీ జరగడంతో రెవెన్యూ అధికారులు మాత్రం లబి్ధదారులకు పంపిణీ జరిగినట్లు చూపించారు. కానీ లబి్ధదారుల పేరుతో టీడీపీ నేతలే బ్యాంకు కెళ్లి డ్రా చేసుకుని ఆరగించారు. మండలంలోని పంటపాళెం, పైనాపురం, నేలటూరు, ముత్తుకూరు, దొరవులపాళెం గ్రామాల్లో దాదాపు 300 మందికి సంబంధించిన నగదును టీడీపీ నేతలే దిగమింగారు.  

నాకు ప్యాకేజీ ఇవ్వకుండానే.. 
నాకు నాన్‌ఫిషర్‌మెన్‌ ప్యాకేజీ కింద డబ్బులు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. నాకు మాత్రం అందలేదు. నా పేరు మీద చెక్కురాసి తీసేసుకున్నారు. టీడీపీ నేతలే ఈ పని చేశారు. మా కడుపులు కొట్టి ఇలా ప్రవర్తించడం వాళ్లకే చెల్లింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్యాకేజీ మంజూరు చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాత్రం ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చూశారు.  
– కర్లపూడి సుబ్రహ్మణ్యం, ముత్తుకూరు 

ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజీ 
కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి మా సమస్యను తీసుకెళ్లారు. అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారమే మాకు నిధులు పంపిణీ చేయించారు. టీడీపీ హయాంలో ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో మాకు నిధులు ఇస్తున్నట్లు చెప్పి మా పేర్లతో టీడీపీ నేతలు తినేశారు.   
– సుబ్బరాయుడు, దొరవులపాళెం 

కాకాణి చొరవతో 16,337 కుటుంబాలకు లబ్ధి 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా 16,337 కుటుంబాలను లబ్ధిదారులను గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున రూ.35.75 కోట్లు కేటాయించి, లబి్ధదారుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయించారు. టీడీపీ హయాంలో రూ.10,500 మాత్రమే లబ్ధి పొందిన వారికి సైతం మిగతా రూ.14,500 వంతున ప్యాకేజీ అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement