ప్రతీకాత్మక చిత్రం
చిత్తూరు అర్బన్ : చిత్తూరు పోలీసు శాఖను కుదిపేస్తున్న నకిలీ హోంగార్డుల కుంభకోణంలో వన్‌టౌన్ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఆర్. మణిగండన్, టి.యువరాజ్, బీఆర్ కిరణ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు హోంగార్డులు, ఓ కానిస్టేబుల్ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరిని మీడియా ఎదుట హాజరుపరిచే అవకాశముంది. 87 మంది నిరుద్యోగులను దొడ్డిదారిన పోలీసు శాఖలోకి చొప్పించిన బాగోతం తెలిసిందే.
ఇదే కేసుకు సంబంధించి కుట్రలో భాగమైన జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు ముందస్తు బెయిల్ పొందేందుకు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇక నకిలీ హోంగార్డుల వ్యవహారంలో అవకతవకలను గుర్తించిన చిత్తూరు ఏఆర్ ఆర్‌ఐ మురళీధర్, ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలతో వన్‌టౌన్ సీఐ నరసింహరాజు ఐపీసీ 420, 419, 409, 468, 471 రెడ్‌విత్ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
ఆ 87 మందికీ తొలగింపు ఉత్తర్వులు
మరోవైపు.. పోస్టులు పొందిన 87 మందినీ డీఐజీ ఆదివారం విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు వీళ్లను తొలగించకపోతే కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి హోంగార్డు కోటా చూపించి వీరంతా ఉద్యోగాల్లో చేరిపోయే ప్రమాదాన్ని పసిగట్టి ఈ నిర్ణయం హుటాహుటిన తీసుకున్నారు. ఈ 87 మందిలో 28 మంది టీటీడీలో, చిత్తూరు, తిరుపతి అగ్నిమాపక శాఖలో 22 మంది, కాణిపాకం ఆలయంలో 15 మంది, చిత్తూరు, తిరుపతి రవాణాశాఖలో 10 మంది, లా అండ్ ఆర్డర్‌లో ఐదుగురు, చిత్తూరు జిల్లా జైల్లో ముగ్గురు, తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్, చిత్తూరు స్త్రీ–శిశు సంక్షేమశాఖలో ఒకొక్కరు, ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న ఒకరితోపాటు సర్వీసు నుంచి తొలగించిన మరొకరు ఉన్నారు. మరోవైపు ఈ కుట్రపై చిత్తూరు ఎస్పీ వై. రిషాంత్‌రెడ్డి స్పందిస్తూ లోతుగా దర్యాప్తు జరుగుతుందని, బాధ్యులందరిపైనా చర్యలుంటాయని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment