తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు.. | Tdp Leaders Internal War Tirupati Tdp Politics | Sakshi
Sakshi News home page

తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు..

Published Mon, Aug 23 2021 8:17 PM | Last Updated on Mon, Aug 23 2021 9:11 PM

Tdp Leaders Internal War Tirupati Tdp Politics - Sakshi

తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. ఆ పార్టీ అనుబంధ కమిటీల నియామకం చిచ్చు రేపింది. స్థానిక టీడీపీ ఇన్‌చార్జుల తీరును ఎండగడుతూ అధినేతకు నాయకులు లేఖలు రాయడం మొదలుపెట్టారు. వలస నేతలకు పదవులు కట్టబెట్టడంతో ఆశావహులందరూ అసంతృప్తితో రగిలిపోతూ లేఖల యుద్ధానికి దిగారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలు కొందరు వైఎస్సార్‌ సీపీలో చేరిపో యిన వైనంపై స్థానిక నేతలు చంద్రబాబు దృష్టికి లేఖల ద్వారా తీసుకెళుతున్నారు.  

సాక్షి, తిరుపతి:  తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీల నియామకాలపై జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలా ఐతే మా వల్ల కాదు బాబు గారూ’ అంటూ అధినేత చంద్రబాబుకు లేఖలు రాస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కొట్టాలకు చెందిన రవినాయుడును తిరుపతి కోటాలో టీడీపీ తిరుపతి పార్లమెంట్‌ యువత అధ్యక్షుడిగా నియమించారు. రవి నాయుడు బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారంటూ, ఎస్వీ యూనివర్సిటీలో మాస్‌ కాపీయింగ్‌లో పట్టుబడిన వ్యక్తి అని తిరుపతికి చెందిన టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు బంధువునని, లోకేష్‌ బాబు బామ్మర్ది అని, తాను చెప్పిన వారికే పదవులు వస్తాయని చెప్పుకుంటూ.... జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపైన పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆయనపై టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు లేఖ రాశారు.  

పుంగనూరుకు చెందిన ఆనంద్‌ గౌడ్‌కి రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇతనికీ తిరుపతి కోటాలోనే పదవిని కట్టబెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరంలో టీడీపీ యువ నాయకులే లేరా అని లేఖలో నిలదీశారు. ఈ పరిణామం తిరుపతి నగర టీడీపీకే అవమానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు ఇన్‌చార్జ్‌ పదవిని దొరబాబు తిరస్కరించినట్లు తెలిసింది. చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పులివర్తి నాని చిత్తూరు ఇన్‌చార్జ్‌ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం మొదలైంది.   

వాళ్లదే పెత్తనం 
పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లెలో నియోజకవర్గ ఇన్‌చార్జులు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, దొమ్మల పాటి రమేష్, శంకర్‌యాదవ్‌ తీరుపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు వారి అనుచరులను మాత్రం పిలిపించుకుంటున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కనపెట్టి, వలస నేతలను ప్రోత్సహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కుప్పంలో టీడీపీ శ్రేణుల్లో ముఖ్యనేతలందరూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఇన్‌చార్జ్‌ భరత్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరిపోవడంతో టీడీపీ డీలాపడిపోయింది. ఈ పరిస్థితుల్లో టీడీపీని బతికించుకునేందుకు ఉన్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు, లోకేష్‌ వద్దంటూ, జూనియర్‌ ఎన్టీఆర్‌కి జై కొడుతూ జెండాలు ఎగురవేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులను ఆయా నియోజకవర్గ నాయకులు చంద్రబాబుకు ఎవరికి వారు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. 

అక్కడ కుమ్ములాటలు 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులకూ అన్ని ప్రభుత్వ పథకాలు అందుతుండడంతో సామాన్య కార్యకర్తలు ఎక్కువమంది వైఎస్సార్‌సీపీకి జై కొడుతున్నారు. నగరి నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ గాలి భానుప్రకాష్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో లేరనే విమర్శలున్నాయి. అధికార పార్టీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, వరుస విజ యాలతో దూసుకుపోతుండగా, టీడీపీ ఇన్‌చార్జ్‌ కేడర్‌ను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులైన టీడీపీ శ్రేణులు అనేక మంది ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో పార్టీలో చేరిపోతున్నారు. దీంతో ఉన్న కొద్ది మంది టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయారు. సత్యవేడులో మాజీ ఎమ్మె ల్యే హేమలత, జేడీ రాజశేఖర్‌ ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమ నార్హం. అధికారం కోల్పోయాక మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య నియోజకవర్గానికి రావడమే మానేశారు. దీనిపైనా టీడీపీ శ్రేణులు అధిష్టానానికి లేఖల ద్వారా మొరపెట్టుకుంటున్నారు.

చదవండి: పోలీసుల మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement