సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి చెందిన ఆమోద పబ్లికేషన్స్ లిమిటెడ్‌కు గత తెలుగుదేశం ప్రభుత్వం విలువైన భూమిని కారుచౌకగా కేటాయించింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన దరిమిలా తమ పత్రిక ప్రచురణ కేంద్రానికి స్థలం కేటాయించాలని ఆమోద పబ్లికేషన్స్ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. అంతే.. అడిగిందే తడవుగా ఆగమేఘాల మీద కేబినెట్ సమావేశం పెట్టి భూమి ఇవ్వాలని తీర్మానించింది. ఆ మేరకు 2015 నవంబర్ 13న ప్రత్యేకంగా జీఓ 433ని విడుదల చేసింది. రేణిగుంట మండలం తూకివాకం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 717బి–5లో ఎకరా ధర రూ.80లక్షలు చొప్పున ఎకరన్నర కేటాయించింది.
సరిగ్గా ఇక్కడే వివాదం రాజుకుంది. జాతీయ రహదారికి పక్కనే ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టడంపై అప్పుడే గ్రామంలోని యువత వ్యతిరేకించింది. అప్పట్లోనే మార్కెట్ ధర ఎకరా రూ.7కోట్లు ఉండగా.. మొత్తం రూ.10కోట్ల విలువైన భూమిని కేవలం కోటి 20లక్షలకే ధారాదత్తం చేయడంపై నిరసన వ్యక్తమైంది. గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళనలు చేయగా పోలీసులను రంగంలోకి దించారు. భయభ్రాంతులకు గురిచేసి హుటాహుటిన భవన నిర్మాణాలు పూర్తి చేసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ గ్రామస్తులు నాటి అడ్డగోలు భూ సంతర్పణపై ప్రస్తుత అధికారులు దృష్టిసారించాలని డిమాండ్ చేస్తున్నారు.
విశాఖలో వెనక్కి తీసుకున్నట్టు..
ఆమోదా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖçపట్నంలోనూ నాటి టీడీపీ హయాంలో భూ పందేరం జరిగింది. విశాఖ నగర శివారు పరదేశి పాళెంంలో దాదాపు రూ.15కోట్ల విలువైన భూమిని కేవలం రూ.50లక్షలకే ధారాదత్తం చేస్తూ 2017 జూన్‌లో నాటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎంతో విలువైన భూమిని అంత తక్కువ ధరకు అప్పగించడంపై వివాదం రేగింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అక్టోబర్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో నాటి కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ భూములను అర్హులైన పేదలకు కేటాయించాలని తీర్మానించారు. సరిగ్గా ఇక్కడ కూడా ఇప్పుడు అదే డిమాండ్ తెరపైకి వస్తోంది.
ఆ ఒక్క సంస్థకే ఎలా ఇచ్చారు?
ప్రభుత్వం భూములు కేటాయించాల్సి వస్తే ఆయా వర్గాలను బట్టి పారిశ్రామికవాడలను, నివాసిత ప్రాంతాలను పరిశీలిస్తుంది. కానీ నాటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రజ్యోతికి ఇచ్చిన స్థలం పూర్తిగా రైతులకు సంబంధించినది. హైవేకి ఆనుకుని ఉన్న విలువైన స్థలం. పైగా ఆ ఒక్క సంస్థకే కట్టబెట్టింది.
– సీహెచ్ హరిశ్చంద్ర,
పంచాయతీ తీర్మానం లేకుండానే భూకేటాయింపు
తూకివాకం పంచాయతీ తీర్మానం లేకుండానే భూ కేటాయింపులు జరిపారు. వాస్తవానికి ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఆ భూమిని గతంలో పన్నీర్‌కాలువ గ్రామ బీసీలకు కేటాయించారు. ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు. తూకివాకం రైతులకు, పన్నీర్‌కాలువ రైతులకు మధ్య వివాదం రేగడంతో సమస్య కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే నాటి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఆంధ్రజ్యోతికి కట్టబెట్టేసింది. ఆ తర్వాత కోర్టు పన్నీర్‌కాలువ రైతులకు ఆ భూమిని అప్పగించాలని, లేదంటే ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించింది. ఇవేమీ పట్టించుకోకుండానే ఆమోద పబ్లికేషన్స్ భవన నిర్మాణాలు చేపట్టేసింది. నేటికీ ఆ నిర్మాణాలకు సంబంధించి పంచాయతీ తీర్మానం లేదు.
– భాస్కర్ యాదవ్, మాజీ సర్పంచ్, తూకివాకం
ఆ భూమి వెనక్కి తీసుకోవాలి
నాటి టీడీపీ ప్రభుత్వం అతితక్కువ ధరకు ఆమోద పబ్లికేషన్స్‌కు కట్టబెట్టిన రూ.కోట్ల విలువైన భూమిని అధికార యంత్రాంగం వెనక్కి తీసుకోవాలి. ఆ మేరకు వాస్తవాలను సర్కారుకు నివేదించాలి. విశాఖలో కట్టబెట్టిన భూములను వెనక్కి తీసుకుని పేదలకు పంచినట్టే ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతికిచ్చిన భూములపై నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో తూకివాకం, పన్నీర్‌కాలువ గ్రామాల రైతులతో కలిసి ఆందోళనలు చేస్తాం.
– నాగ సుబ్రహ్మణ్యరెడ్డి, మాజీ ఎంపీటీసీ, తూకివాకం
Comments
Please login to add a commentAdd a comment