వలస వచ్చి కర్నూల్లో పాగా
మంచినీళ్లు తాగినంత సులువుగా స్వాహా.. అవకతవకల్లో ఆరితేరిన తండ్రీ కొడుకులు
కేసీ కెనాల్ భూములు హాంఫట్
60 ఏళ్లుగా గోశాల భూముల లీజు పేరుతో దగా.. సినిమా థియేటర్లు, హోటల్, షాపింగ్ మాల్స్
తుంగభద్ర ఒడ్డున ఫ్యాక్టరీ కాలుష్యం.. ప్రజలకు శాపం
రూ.వందల కోట్లకు పడగలెత్తిన టీడీపీ అభ్యర్థి బాగోతం
ఆ ఉమ్మడి కుటుంబంలో తండ్రి జాతీయ పార్టీలో ఉంటే.. కొడుకు ప్రాంతీయ పార్టీలో ఉన్నారు. తండ్రి ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసి అక్రమాలతో రూ.వందల కోట్లకు పడగలెత్తారు. కొడుకూ తక్కువేమీ తినలేదు. ఈ కుటుంబం దౌర్జన్యానికి కర్నూలు ప్రజలు దశాబ్దాలుగా పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో వారు ఏనాడూ అభివృద్ధి, ప్రజాసమస్యలను పట్టించుకోలేదు. ఫలితంగా ఆ కుటుంబంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆ కుటుంబం పేరు చెబితే వెంటనే వారు చేసిన ఆకృత్యాలే ప్రజలకు గుర్తుకొస్తాయి. తరచూ పార్టీలు మారే తండ్రికి ఓ రాజకీయ సిద్ధాంతం, పద్ధతి లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఓ జాతీయ పార్టీలో ఉంటే కొడుకు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తరఫున అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ కుటుంబం బినామీ పేర్లతో వక్ఫ్ భూములు, దేవదాయ శాఖ మాన్యాలను తమ అ«దీనంలో పెట్టుకుని సర్కారు ఖజానాకు గండి కొడుతోంది.
గోశాల పేరుతో పెద్ద దందా!
కర్నూలు సిటీ నడిరోడ్డున దేవదాయశాఖ పరిధిలోని 1.31ఎకరాల గోశాల స్థలాన్ని 60 ఏళ్ల కిందట వి.రామచంద్రమ్మ అనే బినామీ పేరుతో లీజుకు తీసుకున్న ఈ కుటుంబం థియేటర్లు నిర్మించింది. జ్యూవెలరీ, బ్యాంకు, షోరూంతో పాటు 20 వరకు కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించింది. తొలుత 30 ఏళ్లకు తీసుకున్న లీజు గడువు 1994 జూలై 1న ముగిసింది. అప్పట్లో నెలకు రూ.63,730 అద్దె ఉండేది. దానిని రూ.98,794కి పెంచి మరో 30 ఏళ్లు లీజుకు తీసుకున్నారు.
రాబోయే జూలైతో ఆ గడువు ముగియనుంది. షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలు, గ్రూపు థియే టర్లకు కలిపి నెలకు రూ.25 లక్షల వరకూ ఈ కుటుంబం అద్దె వసూలు చేస్తోందని చెబుతున్నారు. నిజానికి ఇంత కంటే ఎక్కువే అద్దె వస్తున్నట్లు సమాచారం. మళ్లీ ఇప్పుడు లీజును పొడిగించుకునేందుకు తండ్రీకొడుకులు యత్నిస్తున్నారు.
కేసీ కెనాల్ భూములు స్వాహా!
కర్నూలు మండల పరిధిలోని మునగాలపాడు పరిధిలో 46ఏ, 46బీ, 79బీ సర్వే నంబర్లలో 123.82 ఎకరాల భూమి ఉంది. జలవనరుల శాఖ పరిధిలో కేసీ కెనాల్(కర్నూలు–కడప కాల్వ) బండ్ భూమిగా 1908 ఆర్‌ఎస్‌ఆర్ రికార్డులు చెబుతున్నాయి. ఇవి హైదరాబాద్, బెంగళూరు నేషనల్ హైవే పక్కనే ఉన్నాయి. ఈ భూములపై ఆ కుటుంబం కన్ను పడింది. తమకు అనుకూలమైన ముగ్గురు వ్యక్తులను ఎంచుకుని 1998లోనే ఆ భూమి వారి పరిధిలో ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించినట్లు తెలుస్తోంది.
ఆపై మరో ఇద్దరు ఆ భూములను కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్లు సృష్టించారు. ఆ తర్వాత 2003లో వీటిలో 5.43 ఎకరాలను వారసుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇది కాకుండా నలుగురు వ్యక్తులు ఇతరుల వద్ద తాకట్టుపెట్టిన సర్వే నంబర్ 46/1 మరో 1.5 ఎకరాల భూమిపై పంచాయితీని 2015లో ఆ కుటుంబం సెటిల్ చేసి వారసుల పేరుతో రాయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భూమి విలువ రూ.100 కోట్లపైనే ఉంటుంది.
కర్నూలు అభివృద్ధిపై మాటలే.. చేతలేవీ?
► కర్నూలు సిటీలో జొహరాపురంలో డంపింగ్ యార్డు ఉంది. దీన్ని తీసేస్తానని 2009, 2014లో ఆ కుటుంబ పెద్ద మాట ఇచ్చారు. 2009లో గెలిచి మంత్రి అయ్యారు. 2014లో ఆయన ఓడిపోయినా ఆయన పార్టీ ప్రభుత్వమే ఉంది. కానీ దీని గురించి ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.8 కోట్లు కేటాయించి 23 ఎకరాల్లోని డంపింగ్ యార్డును తీసేస్తున్నారు. 95శాతం డంప్ తీసేశారు. దీంతో చుట్టపక్కల 50 వేల మందికి ఉపశమనం లభించింది.
► కర్నూలు నగర ప్రజలకు తాగు నీటి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపుతానని గతంలో ఆ కుటుంబ పెద్ద హామీ ఇచ్చారు. చేయలేకపోయారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.82 కోట్లతో సుంకేసుల రిజర్వాయర్ నుంచి ఎస్‌ఎస్ ట్యాంకు వరకూ పైపులైన్ నిర్మించారు. దీంతో సిటీకి నీటి కష్టాలు తప్పాయి.
► 2007లో కర్నూలుకు వరదలు వచ్చాయి.దీంతో వైఎస్సార్ రూ.244 కోట్లు మంజూరు చేసి కేసీ కెనాల్, హంద్రికి రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. ఆ కుటుంబం దీన్ని నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా 2009లో ప్రకృతి విలయంతో కర్నూలు కకావికలమైంది.
► కార్పొరేషన్ నూతన భవనానికి 2010లో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఆ కుటుంబ పెద్ద శిలాఫలకం ఆవిష్కరించారు. రూ.9 కోట్ల అంచనాలతో చేపట్టాల్సిన ఈ పనులు చేయలేకపోయారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రూ.26 కోట్లు వెచ్చించి భవనం నిర్మిస్తోంది. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి..
రైతులకు వేదన.. ఆల్కలీస్ ఫ్యాక్టరీ!
తుంగభద్ర నదీ తీరంలో రాయలసీమ ఆల్కలీస్ ఫ్యాక్టరీ ఉంది. ఇది ఆ కుటుంబానికి చెందినదే. దీని కాలుష్యంతో ఇ.తాండ్రపాడు, గొందిపర్ల, ఇందిరమ్మకాలనీ, వసంతనగర్, దొడ్డిపాడు, పూలతోట, దేవమడ గ్రామాలలో వందల ఎకరాల వ్యవసాయ భూములు పంటలు పండక బీళ్లుగా మిగిలిపోయాయి. ప్రజలు అనారోగ్యానికి గురికావడంతో పాటు పశువులు చనిపోయిన ఘటనలు కోకొల్లలు. ఈ ప్రాంతంలో ఏదైనా ఘటన జరిగినా బయటకు రానివ్వరు. పరాయి వ్యక్తులను అక్కడికి వెళ్లనివ్వరు. తుంగభద్రకు ఇటువైపు కర్నూలు రాఘవేంద్ర మఠం అటువైపు ఫ్యాక్టరీ ఉంది.
వీటి మధ్య వంతెన నిర్మించాలని దాంతో గ్రామాలకు, సిటీకి రాకపోకలు పెరగడంతోపాటు జోగులాంబ ఆలయానికి దగ్గరవుతుందని 25 ఏళ్లకుపైబడి ప్రతిపాదనలు పంపుతున్నా, ఆ కుటుంబం అడ్డుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం వంతెన నిర్మిస్తే ఫ్యాక్టరీ విషయాలు అందరికీ తెలియడంతోపాటు ఏ చిన్న ఘటన జరిగినా ఆందోళనలు చేస్తారనే భయమేనని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment