తూర్పు గోదావరి జిల్లా రాజానగరం హైవే పక్కన టీ టైమ్ (ఇన్‌సెట్‌లో) తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి. రాజమహేంద్రవరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఓ పల్లెటూరు. ప్రపంచ నర్సరీ రంగంలో ప్రత్యేక స్థానం పొందిన ఆ ఊరి పేరు కడియం. అలాంటి పూలవనంలో విరబూసిన ఓ యువకుడు టీకొట్టు బడ్డీలకు బ్రాండింగ్ చేసి మరోసారి ఆ గ్రామ పేరు ప్రఖ్యాతలను దేశం నలుమూలలా విస్తరింపజేస్తున్నాడు. మూడు పదుల వయసులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విదేశాల్లో రూ.లక్షల వేతనంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి.. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ముందడుగు వేశాడు.
చదవండి: ఆ ‘వెలుగు’ దేశానికే ఆదర్శం
రూ.10 వేలతో ప్రారంభించి.. రూ.10 కోట్లకు
2017లో రాజమహేంద్రవరంలో హైటెక్ హంగులతో ‘టీ టైమ్’ పేరిట బడ్డీని ప్రారంభించిన తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ (బాలు) దానికి బ్రాండింగ్ చేశారు. అదే పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. తాజాగా వారణాసిలో ప్రారంభించిన ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 1,500 ‘టీ టైమ్’ ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా 25 వేల మందికి బాలు ఉపాధి చూపుతున్నాడు. మొదట్లో రూ.10 వేలతో ప్రారంభించిన ‘టీ టైమ్’ బ్రాండ్ ఐదేళ్లలో రూ.10 కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది. రాష్ట్రంలో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు జాతీయ రహదారి వెంబడి పలుచోట్ల టీ టైమ్ అవుట్‌లెట్‌లే కనిపిస్తాయి. ప్రాథమిక విద్య కడియం, కరైకల్, పాండిచ్చేరిలో ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్ చేసిన బాలు తండ్రి దివంగత వీరభోగవసంతరావు దక్షిణాది రాష్ట్రాల్లో క్లాస్–1 కాంట్రాక్టర్. ఈ క్రమంలో బాలు దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగుతూ పలు భాషలపై పట్టు సాధించారు.
చదవండి: కోటిస్తే.. బడికి మీరు చెప్పిన పేరు
బ్రాండ్‌కే మోజు
బీటెక్ తరువాత దుబాయ్‌లో డాలర్లు కురిపించే ఉద్యోగం చేస్తున్నప్పుడు స్నేహితులతో కలిసి కాఫీ షాపునకు వెళ్లారు బాలు. అక్కడ టీ, కాఫీ ఖరీదు రూ.500 కంటే ఎక్కువ ఉండటం చూసి ఆశ్చర్యపోయానని బాలు చెప్పారు. టీ కప్పు లో ఉన్న ఇంగ్రిడియెంట్స్ (పదార్థాలు) విలువ రూ.30 కూడా ఉండవు. టీ విలువ రూ.30 పోను మిగిలిన విలువ అంతా బ్రాండ్‌కే అనే వాస్తవాన్ని గుర్తించి ‘టీ టైమ్’ను ప్రారంభించారు. టీ టైమ్ వ్యాపారాన్ని చేయాలన్నది వేరెవరో ప్రేరేపించింది కాదంటారాయన. సామాన్యుడికి నాణ్యత కలిగిన టీ అందించాలనే తపన నుంచే ‘టీ టైమ్’ ఆవిష్కరణ జరిగిందని బాలు చెప్పారు. సామాన్యులతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో సంపన్నులతో సమానంగా వారిని చూడాలనుకున్నానని.. దానిని నెరవేర్చుకుంటూ ముందుకెళుతున్నానని బాలు వెల్లడించారు.
చదవండి: ప్రపంచాన్ని మెప్పించిన పాతికేళ్ల కుర్రాడు.. కడప బాహుబలి
ప్రణాళిక ముఖ్యం..
వచ్చే మూడేళ్లలో కనీసం మరో 10 వేల అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు బాలు చెప్పారు. దేశవ్యాప్తంగా 2 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనేది జీవితాశయమని వెల్లడించారు. ఇప్పటివరకు తాను నిర్దేశించుకున్న లక్ష్యంలో 10% మాత్రమే విజయం సాధించానన్నారు. నేటి వ్యాపార సరళిపై మాట్లాడుతూ.. ఎవరికైనా ఆలోచన వస్తే దానిని కాగితంపై రాసుకుని తగిన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు పరితపించాలని.. పటిష్టమైన వ్యూహం, క్షేత్ర స్థాయిలో అవగాహన, లావాదేవీల్లో గణాంకాలపై పట్టు సాధించడం ద్వారానే ఏ రంగంలో అయినా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రణాళిక బలంగా ఉన్నప్పుడు ఫలితాలు వాటంతటవే వస్తాయంటున్నారు బాలు.
Comments
Please login to add a commentAdd a comment