రాజమహేంద్రవరం క్రైం: ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందాడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు గ్రామానికి చెందిన బిక్కవోలు శ్రీనివాస్(20) శుక్రవారం తెల్లవారు జామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన దమయంతి అనే యువతితో వివాహమయ్యింది. ఆమె గర్భిణి కావడంతో పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ చాగల్లు గ్రామానికి చెందిన మరో యువతి బొల్లెపు స్వప్న గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 3న ఇద్దరూ కలసి చాగల్లు నుంచి విజయవాడ వెళ్లిపోయి, కనక దుర్గమ్మ గుడిలో వివాహం చేసుకున్నారు.
అక్కడ నుంచి శ్రీనివాస్, స్వప్న రాజమహేంద్రవరం చేరుకున్నారు. కొన్ని రోజులు లాడ్జిలో గడిపారు. రాజమహేంద్రవరానికి చెందిన ముప్పిడి రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో అతని ద్వారా శుక్రవారం జాంపేట గాంధీబొమ్మ ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లోని నాల్గో అంతస్తులో ఇద్దరూ కలసి రూమ్ అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో రూమ్ శుభ్రం చేసుకొని 9 గంటలకు ఆ గదిలోకి దిగారు. రాత్రి చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అతడు నిద్రలో దమయంతి అని కలవరించడంతో ముందు భార్య గుర్తుకు వచ్చిందా? అంటూ స్వప్న అతడితో గొడవకు దిగడంతో ఇరువురూ ఘర్షణ పడ్డారు.
దీంతో బయటకు వచ్చేసిన శ్రీనివాస్ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంట్లోని ఫ్యాన్ కొక్కానికి చీరతో ఉరి వేసుకొని మృతి చెందాడు. తనతో గొడవపడి వెళ్లిన శ్రీనివాస్ ఎంతకీ రాకపోవంతో బయటకు వచ్చి చూసే సరికి ఫ్యాన్ కొక్కేనికి వేలాడుతూ కనిపించాడని స్వప్న పోలీసులకు తెలిపింది. కింద పోర్షన్‌లోని వారి సాయంతో చాకుతో చీరను కోసి కిందకు దింపామని అప్పటికే మృతి చెందాడని ఆమె చెప్పింది.
మొదటి భార్యకు అన్యాయం చేశాననే ఆత్మహత్య చేసుకున్నాడా?
మొదటి భార్య దమయంతికి అన్యాయం చేసి, మరో వివాహం చేసుకున్నానన్నే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే ఇతర కారణమైనా ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని త్రీటౌన్ సీఐ మారుతిరావు, ఎస్సై రాములు సందర్శించారు. ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment