కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఏపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ సరిహద్దు వద్ద ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భూభాగం గుండా టీఎస్ పోలీసులు అనుమతించకపోవటంతో కృష్ణా జిల్లా ముత్యాల నుండి గుంటూరు జిల్లా మాదిపాడుకు కృష్ణా నదిలో పడవ ద్వారా పులిచింతల ప్రాజెక్టు వద్దకు సామినేని చేరుకున్నారు.
అడ్డుకోవడం దారుణం...
పులిచింతల వద్ద తెలంగాణ అక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని.. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన మమ్మల్ని అడ్డుకోవడం దారుణమని ఉదయభాను ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ మొదలవకుండా విద్యుదుత్పత్తి వల్ల నీరు వృథా అవుతోందన్నారు. విభజన హామీలను తెలంగాణ తుంగలో తొక్కుతోందని.. బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారం నీటిని వాడుకోవాలని ఉదయభాను అన్నారు.
‘‘వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జలయజ్ఞంలో భాగంగా పులిచింతల నిర్మించారు. తెలంగాణలోనే వైఎస్ ఎక్కువ ప్రాజెక్టులు కట్టారు. తెలంగాణ మంత్రులు నేతలు వైఎస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. వైఎస్ గురించి మాట్లాడిన మాటలు సబబు కాదు. కేసీఆర్ కూడా ఈ అంశంపై పునరాలోచించాలి. శనివారం ఒక్కరోజే ఒక టీఎంసీ వృధా చేశారు. ఒక టీఎంసీ పదివేల సాగుకు ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు 75 టీఎంసీలు వృధా చేశారు. ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉండాలని సీఎం జగన్ చెప్పారు. దేవుడు చెప్పినా వినం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని’’ సామినేని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment