సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు | Telugu Jop AspirantsTops In Civils Exams Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు

Published Wed, May 24 2023 5:17 AM | Last Updated on Wed, May 24 2023 8:38 AM

Telugu Jop AspirantsTops In Civils Exams Andhra Pradesh - Sakshi

ఇషితా కిశోర్‌ (1వ ర్యాంకు), ఉమా హారతి (3వ ర్యాంకు)

సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్‌–2022 పరీక్షల తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో పాటు 50 వరకు ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారు. సివిల్స్‌–2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, తదితర సర్వీసుల పోస్టులకు సంబంధించి మొత్తం 933 మందిని ఎంపికి చేసినట్లు తెలిపింది. జనరల్‌ – 345, ఈడబ్ల్యూఎస్‌ – 99, ఓబీసీ – 263, ఎస్సీ – 154, ఎస్టీ – 72 మంది ఎంపికయ్యారు.

వీరితో పాటు కన్సాలిడేటెడ్‌ రిజర్వు లిస్టులో ఆయా కేటగిరీల నుంచి 178 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. మొత్తంగా 1,022 మందిని ఆయా పోస్టులకు ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరిలో ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 38 మంది, ఐపీఎస్‌కు 200 మందిని కేటాయించారు. ఇతర కేంద్ర సర్వీసెస్‌లకు సంబంధించి గ్రూప్‌–ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్‌–బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ పేర్కొంది. 

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అధిక ర్యాంకులు
సివిల్స్‌ ఫలితాల్లో టాప్‌ ర్యాంకుల్లో తొలి 4 ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకును ఇషితా కిషోర్‌ సాధించగా గరిమ లోహియా, నూకల ఉమా హారతి, స్మృతి మిశ్రాలు వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి దాదాపు 50 మందికి ర్యాంకులు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 22, 33, 40, 200, 217, 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు.

జీవీఎస్‌ పవన్‌ దత్తా 22, తరుణ్‌ పట్నాయక్‌ 33, అజ్మీరా సంకేత్‌ 35, శ్రీసాయి ఆశ్రిత్‌ శాఖమూరి 40, హెచ్‌ఎస్‌ భావన 55, సాయి ప్రణవ్‌ 60, ఆవుల సాయికృష్ణకు 94వ ర్యాంకు దక్కాయి. వీరితోపాటు నిధిపాయ్‌ 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి సంపత్‌కుమార్‌ 157, కమతం మహేశ్‌కుమార్‌ 200, రావుల జయసింహారెడ్డి 217, సాహిత్య 243, అంకుర్‌ కుమార్‌ 257, బొల్లం మహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కళ్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, సాయికృష్ణకు 293వ ర్యాంకు వచ్చాయి.

11.35 లక్షల మంది దరఖాస్తు 
సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు 11.35 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 5.73 లక్షల మంది (50.51 శాతం) మంది మాత్రమే గతేడాది జూన్‌ 5న జరిగిన ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరయ్యారు. వారిలో 130,90 మంది మెయిన్స్‌ పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి సెప్టెంబర్‌ 16 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించారు.

వీరిలో 2,529 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా చివరకు 933 మంది ఎంపికయ్యారు. కాగా సివిల్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 80,707 మంది హాజరయ్యారు. వారిలో 500 మంది వరకు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇంటర్వ్యూలకు 100 మంది వరకు ఎంపికవ్వగా వారిలో 50 మంది వరకు ర్యాంకులు సాధించగలిగారని ఆయా కోచింగ్‌ సంస్థల నిర్వాహకులు తెలిపారు.   
 
ర్యాంకుల వారీగా తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు
3    ఎన్‌. ఉమా హారతి
22    జీవీఎస్‌ పవన్‌ దత్తా
33    తరుణ్‌ పట్నాయక్‌ మాదల
40    సాయి ఆశ్రిత్‌ శాఖమూరి
54    రిచా కులకర్ణి
60    మలియె శ్రీ ప్రణవ్‌
78    ఉత్కర్‌‡్షకుమార్‌
87    అయాన్‌ జైన్‌
94    ఆవుల సాయి కృష్ణ
110    నిధి పాయ్‌
132    అనుగు శివమూర్తిరెడ్డి
157    రాళ్లపల్లి వసంతకుమార్‌
189    షేక్‌ హబీబుల్లా
217    రావ్ల జయసింహారెడ్డి
243    కాసిరాజు పవన సాయి సాహిత్య
270    బొల్లం ఉమామహేశ్వరరెడ్డి
285    చల్లా కల్యాణి
292    పలువాయి విష్ణువర్థన్‌రెడ్డి
293    గ్రంధి సాయికృష్ణ
297    షివిన్‌ చౌదరి
311    వీరగంధం లక్ష్మీ సునీత
313    కె.ఎన్‌.చందన్‌ జాహ్నవి
346    ఎన్‌.చేతన్‌రెడ్డి
384    తెప్పలపల్లి సుశ్మిత
409    ఇషాన్‌ అగర్వాల్‌
410    డొంగ్రె రేవయ్య
414    చంద్రశేఖర్‌ శంకల
426    సీహెచ్‌. శ్రవణ్‌కుమార్‌రెడ్డి
459    చాణక్య ఉదయగిరి
464    సి.సమీరారాజా
469    బొడ్డు హేమంత్‌
480    గోపీకృష్ణ. బి
510    భువన ప్రణీత్‌ పప్పుల
548    దామెర్ల హిమవంశీ
558    రుత్విక్‌ సాయి కొట్టే
559    డి.మనోజ్‌
583    యర్రంశెట్టి ఉషారమణి
630    ఎస్‌.దీప్తి చౌహాన్‌
640    తుమ్మల సాయికృష్ణారెడ్డి
742    రామ్‌దేని సాయినాధ్‌
759    జి.అక్షయ్‌ దీపక్‌
805    మన్నం సుజిత్‌ సంపత్‌
817    సాహిల్‌ మీనా
846    బెండుకూరి మౌర్యతేజ్‌
866    నాగుల కృపాకర్‌

సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు
సివిల్స్‌ పరీక్షల్లో 200లోపు ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 933 మందితో కూడిన తుది జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు అభ్యర్థులందరికీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. వారు కెరీర్‌లో ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. 

ర్యాంకర్ల అభిప్రాయాలు
దత్తా.. సత్తా 
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన డాక్టర్‌ పవన్‌ దత్తా సివిల్స్‌లో 22వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటాడు. దత్తా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. ఎంబీబీఎస్‌ చదివిన పవన్‌ దత్తా హైదరాబాద్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా పవన్‌ దత్తా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉన్నత ఆరోగ్య సేవలు, పేద విద్యార్థులకు సాంకేతిక సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని తెలిపాడు.

అంబికా జైన్‌కు 25వ ర్యాంక్‌
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లలిత్‌కుమార్‌ అంబికా జైన్‌ (25) సివిల్స్‌లో 69వ ర్యాంక్‌ సాధించారు. పట్టణానికి చెందిన జైన్‌ ఎలక్ట్రికల్‌ షాపు యజమాని లలిత్‌కుమార్, అనితల కుమార్తె అంబికా జైన్‌ అత్యుత్తమ ర్యాంకుతో మెరిసింది. అంబిక.. ఢిల్లీ సౌత్‌ ఏషియన్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో ఎంఏ చేశారు. గతేడాది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయినా ఐఏఎస్‌ కావాలనే పట్టుదలతో ఈ ఏడాది మళ్లీ ప్రయత్నించి 69వ ర్యాంక్‌తో లక్ష్యాన్ని చేరుకున్నారు. 

33వ ర్యాంకుతో మెరిసిన తరుణ్‌ 
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోడల్‌ కాలనీకి చెందిన తరుణ్‌ పట్నాయక్‌ 33వ ర్యాంకుతో సత్తా చాటాడు. ఐఐటీ గౌహతిలో బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన తరుణ్‌ సివిల్స్‌కు సొంతంగా సిద్ధమయ్యాడు. తరుణ్‌ తండ్రి రవికుమార్‌ ఎల్‌ఐసీ రూరల్‌ బ్రాంచ్‌లో క్లరికల్‌ స్టాఫ్‌గా పనిచేస్తుండగా తల్లి శారదా రాజ్యలక్ష్మి గృహిణి. తరుణ్‌ గౌహతి ఐఐటిలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. సివిల్స్‌కు సొంతంగానే ప్రిపేరయ్యారు. గతేడాది 99వ ర్యాంకు సాధించిన అతడు ఈసారి 33వ ర్యాంకుతో మెరిశాడు. ఐఏఎస్‌ కావాలన్నదే తన లక్ష్యమని తరుణ్‌ తెలిపాడు.

వసంత్‌కు 157వ ర్యాంకు
ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన రాళ్లపల్లి వసంతకుమార్‌ 157వ ర్యాంకుతో మెరిశాడు. సివిల్స్‌ 2021 పరీక్షల్లో 170వ ర్యాంకు సాధించిన వసంతకుమార్‌ అప్పట్లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్‌ సాధించాలన్న సంకల్పంతో మరోసారి ప్రయత్నం చేయగా 157వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. వసంత్‌ అన్న జగన్‌సాయి ప్రస్తుతం ఐఏఎస్‌కు ఎంపికై శిక్షణలో ఉన్నారు. వసంతకుమార్‌ తండ్రి రాళ్లపల్లి భీమేశ్వరరావు విద్యుత్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి అనసూయ గృహిణి. 

సిక్కోలు బిడ్డకు 285వ ర్యాంకు 
శ్రీకాకుళం జిల్లా రూరల్‌ మండల పరిధిలోని వప్పంగి గ్రామానికి చెందిన చల్లా కళ్యాణి 285వ ర్యాంకుతో సత్తా చాటింది. ఇప్పటికే గ్రూప్‌–1 పరీక్షల్లో విజయం సాధించిన ఆమె ప్రస్తుతం విశాఖపట్నంలోని ట్రెజరీ విభాగంలో శిక్షణ తీసుకుంటోంది. 

పల్నాడు యువకుడికి సివిల్స్‌లో 292వ ర్యాంక్‌ 
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన పాల్వాయి విష్ణువర్ధన్‌రెడ్డి 292వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటాడు. గోవాలోని బిట్స్‌ పిలానీలో బీటెక్‌ ఈఈఈ పూర్తిచేశాక ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (ఐఎఫ్‌ఎస్‌)– 2020లో 3వ ర్యాంక్‌ సాధించాడు. అయితే ఐఏఎస్‌ సాధించాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. తన ఐదో ప్రయత్నంలో 292వ ర్యాంక్‌ సాధించి విజయకేతనం ఎగురవేశాడు. విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తదితరులు అభినందించారు. విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి విజయవాడలో ఒక ప్రైవేటు కోచింగ్‌ అకాడమీ డైరెక్టర్‌గా, తల్లి పద్మావతి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. 

లక్ష్మీ సుజితకు 311వ ర్యాంకు
బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన వీరగంధం లక్ష్మీసుజిత 311వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఆమె తండ్రి స్థానికంగా విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. ఒక ప్రైవేట్‌ యూనివర్సిటీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన సుజిత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమైంది. కాగా ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యంగా వచ్చే ఏడాది మళ్లీ సివిల్స్‌ రాస్తానని సుజిత తెలిపింది. 

ఐదో ప్రయత్నంలో విజయకేతనం
పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బొల్లిపల్లి వినూత్న. ఆమె ఐదో ప్రయత్నంలో 462వ ర్యాంకు సాధించింది. వినూత్న తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వినూత్న కాగ్నిజెంట్‌ కంపెనీలో పనిచేస్తూ ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంది.

తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్, రెండో ప్రయత్నంలో మెయిన్స్, మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో విఫలమైంది. నాలుగో ప్రయత్నమూ నిరాశపరిచింది. అయితే పట్టు వదలకుండా ఐదోసారి విజయకేతనం ఎగురవేసింది. ఐఏఎస్‌ రాసే క్రమంలో గ్రూప్‌–1 రాసి ఇంటర్వ్యూకు ఎంపికయ్యానని.. అయితే దానికి హాజరుకానని వినూత్న వెల్లడించింది. తన లక్ష్యం ఐఏఎస్‌ అని స్పష్టం చేసింది.  

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి కుమారుడికి 469 ర్యాంకు
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ట్రాఫిక్‌ విభాగం ఉద్యోగి బొడ్డు సత్తిబాబు కుమారుడు హేమంత్‌ 469వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఈ ర్యాంకు ద్వారా ఐఆర్‌ఎస్‌ వస్తుందని.. మళ్లీ సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ సాధించడమే తన లక్ష్యమని హేమంత్‌ తెలిపారు. 

నవీన్‌ చక్రవర్తికి 550వ ర్యాంకు
పల్నాడు జిల్లా తాళ్లచెరువు గ్రామానికి చెందిన రేపూడి నవీన్‌ చక్రవర్తి 550వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ,లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన నవీన్‌ సివిల్స్‌పై ఆసక్తితో అటు మళ్లాడు. తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయిన ఆయన రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌లలో ఏది వచ్చినా స్వీకరిస్తానని తెలిపాడు.

కోనసీమ జిల్లా యువతికి 583వ ర్యాంక్‌
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన యర్రంశెట్టి ఉమా శ్రీలక్ష్మీరమణి 583వ ర్యాంకుతో సత్తా చాటింది. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ చదివిన ఆమె క్యాంపస్‌ సెలక్షన్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించింది. శ్రీలక్ష్మీరమణి తండ్రి యర్రంశెట్టి కాశీవిశ్వేశ్వరరావు కొబ్బరికాయల వ్యాపారి. కాగా యానాం మున్సిపల్‌ కమిషనర్‌ ద్విజ్‌ గోయల్‌ 71వ ర్యాంకు సాధించారు. గోయల్‌ సొంత పట్టణం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌. 

సంతోష్‌కు 607వ ర్యాంకు
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఖండ్యాం గ్రామానికి చెందిన భవిరి సంతోష్‌కుమార్‌ 607వ ర్యాంకు సాధించారు. ఈయన స్వగ్రామం ఖండ్యాం అయినప్పటికీ మండలంలోని అలుదు గ్రామంలో తాతయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు గతేడాది సివిల్స్‌లోనూ 607వ ర్యాంకే ఈసారి కూడా అదే ర్యాంక్‌ వచ్చింది. సంతోష్‌ తండ్రి రాజారావు విశ్రాంతి ఉపాధ్యాయుడు, తల్లి ఉమాకుమారి గృహిణి. విశాఖ ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్, హైదరాబాద్‌లోని రైల్వే కళాశాలలో డెర్మటాలజీలో పీజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ డెర్మటాలజిస్టుగా పనిచేస్తున్నాడు. సివిల్స్‌ సాధించాలని ఇప్పటికే ఐదుసార్లు పరీక్ష రాయగా ఆరో ప్రయత్నంలో 607వ ర్యాంకు సాధించారు. 

రవికిరణ్‌కు 694వ ర్యాంకు 
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందిన పుసులూరి రవికిరణ్‌ 694వ ర్యాంకు సాధించాడు. గతంలో ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్‌ (ఐసీఎల్‌ఎస్‌)కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర కార్పొరేట్‌ ఎఫైర్స్‌ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యంగా మరోసారి ప్రయత్నిస్తానని రవికిరణ్‌ తెలిపాడు.  

ఎన్టీఆర్‌ జిల్లా యువకుడికి 805వ ర్యాంక్‌
సివిల్స్‌ తుది ఫలితాల్లో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామకు చెందిన మన్నం సుజిత్‌ సంపత్‌కు 805వ ర్యాంక్‌ లభించింది. ఈ సందర్భంగా సుజిత్‌ మాట్లాడుతూ ఐఏఎస్‌ అవ్వాలన్నదే తన కోరికన్నారు. నాలుగేళ్ల శ్రమ ఫలితంగా మంచి ర్యాంక్‌ వచ్చిందని తెలిపారు. ఐఏఎస్‌ అయ్యేంతవరకు శ్రమిస్తూనే ఉంటానన్నారు. సుజిత్‌ను నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణ్‌ కుమార్‌ తదితరులు అభినందనలు తెలిపారు.

కడప కుర్రాడికి 866వ ర్యాంకు
కడప ప్రకాష్‌నగర్‌కు చెందిన నాగుల కృపాకర్‌ 866వ ర్యాంకు సాధించాడు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో బీటెక్‌ ఈఈఈ పూర్తి చేశాక సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. వరుసగా ఐదుసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో 866వ ర్యాంకు సాధించాడు. తనకు ఐపీఎస్‌ లేదా ఐఆర్‌ఎస్‌ వచ్చే అవకాశం ఉందని కృపాకర్‌ తెలిపాడు. రానున్న రోజుల్లో మరింత మంచి ర్యాంకు సాధించేందుకు ప్రిపరేషన్‌ కొనసాగిస్తానని తెలిపాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement