
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, రోడ్ మార్జిన్‌లలో సభలు, రోడ్‌షోలను నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 1 అమలును హైకోర్టు తాత్కాలికంగా ఈ నెల 23వ తేదీ వరకు నిలిపివేసింది. ఈ జీవో పోలీసు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
జీవో 1ని సవాలు చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కాకు రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై గురువారం మధ్యాహ్నం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జీవో పోలీసు చట్ట నిబంధనలకు విరుద్ధమని రామకృష్ణ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ చెప్పారు. తరువాత అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. 10 రోజుల కిందట ఇచ్చిన జీవోపై ఇప్పుడు ఈ వెకేషన్ బెంచ్ విచారణ జరిపేందుకు వీలుగా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని తెలిపారు.
ప్రభుత్వ విధాన నిర్ణయాలపై విచారణ జరిపే పరిధి వెకేషన్ కోర్టుకు లేదన్నారు. సభలు, రోడ్‌షోల కోసం ఏ పార్టీ దరఖాస్తు చేయడం గానీ, తాము అనుమతులు నిరాకరించడం గానీ జరగలేదన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ స్పందిస్తూ.. ‘పోలీసు చట్టం 1861 అమల్లోకి తెచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇలాంటి జీవో తెచ్చి ఉంటే స్వాతంత్య్రోద్యమం జరిగేదా? స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి జీవో రాలేదు.
ఈ వ్యాజ్యం విచారణకు రాకుండా చేసేందుకు తెర వెనుక ఏం జరిగిందో మాకు తెలుసు. హైకోర్టు వ్యవహారాలను థర్డ్‌పార్టీ నడిపిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఏజీ వాదనలను కొనసాగిస్తూ.. జీవోలో నిషేధం అన్న పదమే లేదని తెలిపారు. నెల్లూరు, గుంటూరుల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే పోలీసులకు పలు సూచనలు చేస్తూ జీవో 1 జారీ చేశామన్నారు. సభలు, రోడ్‌షోల నిషేధానికి కాదని చెప్పారు.