AP 10th Class Exams 2021 Updates Today News: ఏపీలో టెన్త్‌ పరీక్షలు వాయిదా - Sakshi
Sakshi News home page

ఏపీలో టెన్త్‌ పరీక్షలు వాయిదా

Published Thu, May 27 2021 1:18 PM | Last Updated on Fri, May 28 2021 7:51 AM

Tenth Class Exams Postponed In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం పాఠశాల విద్యా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల అంశం చర్చకు రాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాటిని వాయిదా వేయాలని సీఎం ఆదేశించారు.

సమావేశానంతరం మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జూన్‌ 7 నుంచి జరగాల్సిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూలైలో కరోనా పరిస్థితులను బట్టి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తర్వాత షెడ్యూల్‌ విడుదల చేస్తామని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు స్కూళ్లకు రాలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతోపాటు 1–9 తరగతుల పరీక్షలను రద్దు చేశామని గుర్తు చేశారు.

పదో తరగతి పరీక్షలను జూన్‌ 7 నుంచి నిర్వహించేందుకు గతంలోనే షెడ్యూల్‌ ఇచ్చినా.. కరోనా పరిస్థితులు ఇంకా పూర్తిగా సద్దుమణగనందునే వాయిదా వేశామన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్‌ పరీక్షలు చాలా అవసరమని చెప్పారు. పరీక్షలు రద్దు చేయొద్దని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు కోరారన్నారు. పరీక్షల వాయిదాపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా క్లాసులు ఉంటాయని చెప్పారు. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయులకు ఆయన సంతాపం తెలిపారు.

పరీక్షలపై రాజకీయం సరికాదు
పరీక్షలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సురేష్‌ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజకీయ విమర్శలకు అంశాలు కావాలంటే.. విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఎలా పాఠశాలలకు చేరుస్తున్నారో అడగండి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇన్ని విద్యా పథకాలను ఎలా అమలు చేస్తున్నారని అడగండి. నాడు నేడు పనులు మొదటి విడత ముగిశాయి.. రెండో విడత ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించండి.

అంతేకానీ పిల్లల భవిష్యత్తును కాలరాయాలనే ఉద్దేశంతో పరీక్షలు రద్దు చేయాలని కోరవద్దు. విద్యార్థులు పరీక్షలు రాసి ప్రతిభావంతులైతే టీడీపీకి ఓట్లు వేయరని లోకేష్‌ భయపడుతున్నారు. పరీక్షలు రాయకుండా అడ్డుకుంటే భవిష్యత్తులో ఓట్లు వేస్తారని ఆయన అనుకుంటున్నారేమో. పరీక్షల నిర్వహణ రాజకీయ అంశం కాదు.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన అంశం’ అని మంత్రి దుయ్యబట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. 
  

చదవండి: ఏపీలో టెన్త్‌ పరీక్షలపై హైకోర్టు విచారణ
ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయం ఏంటో?: ఏపీ హైకోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement