
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయనుంది. ఇందుకు గాను ప్రస్తుతం అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదుతో పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్ 5వ తేదీ వరకు పేర్ల నమోదు ప్రక్రియ ఉంటుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45 –60 ఏళ్ల మధ్య వయస్సు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు అందజేస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఇప్పటికే ఈ పథకం ద్వారా 2020 ఆగస్టు 12వ తేదీ తొలి విడతలో 24,00,111 మందికి రూ.4,500.21 కోట్లు.. 2022 జూన్ 22న రెండో విడతగా 24,95,714 మందికి రూ.4,679.49 కోట్లు పంపిణీ చేసింది. రెండు విడతల్లో కలిపి రూ.9179.67 కోట్లను ఆయా సామాజిక వర్గాల్లోని మహిళలకు అందజేసింది. తిరిగి ఇప్పుడు సెప్టెంబర్‌లో మూడో విడతగా ఈ పథకం లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున లబ్ధి చేకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వలంటీర్ల ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్తగా అర్హత పొందిన వారి పేర్ల నమోదుతో పాటు ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల తాజా స్థితిగతులను అధికారులు పరిశీలిస్తున్నారు.
సెప్టెంబర్ 5వ తేదీ వరకు కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదు చేసుకొని.. అనంతరం ఆయా దరఖాస్తులపై 8వ తేదీ లోగా సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు. ఇదిలా ఉండగా, కొత్తగా పేర్ల నమోదు ప్రక్రియకు కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు.