ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి ‘స్మార్ట్’ సిటీ వైపు శరవేగంగా దూసుకుపోతోంది. ఒక్కొక్కటిగా పూర్తవుతున్న అభివృద్ధి పనులతో చూడముచ్చటగా తయారవుతోంది. ‘గరుడ’ వేగంతో దూసుకుపోతున్న ‘వారధి’ నగరానికే తలమానికంగా నిలవనుంది. ఇప్పటికే 48 శాతం పూర్తయిన ఈ వారధిని మరో ఏడాదిలో ప్రారంభించేలా ముఖ్యమంత్రి చొరవ చూపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
సాక్షి, తిరుపతి తుడా: స్మార్ట్‌సిటీలో భాగంగా చేపట్టిన గరుడ వారధి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2019లో ప్రారంభమైన ఈ పనులు రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారయంత్రాంగం భావించింది. కరోనా కారణంగా ఏడాదిన్నరగా నిర్మాణ పనుల్లో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి టీటీడీ నిధుల విడుదలకు చొరవ తీసుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రగతికి దారిది!
గరుడ వారధి నిర్మాణ పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ఇప్పటికే నిర్ణయించిన 171 పిల్లర్లు నిర్మించారు. కరకంబాడి రోడ్డు నుంచి నంది సర్కిల్‌కు వెళ్లే రెండో అంతస్తు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికాచ్చాయి. ప్రకాశం పార్కు నుంచి శ్రీనివాసం వరకు వారధిపై సెగ్మెంట్లను పూర్తిగా ఏర్పాటు చేశారు. పిల్లర్లకు ప్రయోగాత్మకంగా కలంకారీ చిత్రాలు, అన్నమయ్య పెయింటింగ్స్, దశావతారాల విగ్రహాలతో రంగులు అద్దుతున్నారు.
ప్రకాశం పార్కు సమీపంలో డివైడర్ మధ్యలో మొక్కల పెంపకాన్ని ప్రారంభించారు. ఇదే ప్రాంతంలో విశాలమైన ఫుట్‌పాత్‌ను నిర్మిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రామానుజ సర్కిల్ ప్రాంతాల్లో పిల్లర్ల ఏర్పాటు పూర్తిచేశారు. సెగ్మెంట్ల ఏర్పాటు శరవేగంగా చేపడుతున్నారు. ఫ్లై ఓవర్ కింద భాగం పూర్తిగా రంగులు వేసేలా చర్యలు చేపట్టారు. అలిపిరి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే వాహనాలను శ్రీనివాసం వద్ద ఫ్రీలెఫ్ట్ చేస్తున్నారు. బస్టాండ్ నుంచి అలిపిరికి వెళ్లే వాహనాలను కొర్లగుంట సమీపంలో ఫ్లై ఓవర్‌లో కలిసేలా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment