సాక్షి, తిరుపతి: రానున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి రంగంలో ఎన్‌డీఆర్‌ఎస్, ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉంటాయని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. రానున్న రోజుల్లో అల్పపీడనం కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పాడనున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు. అదే విధంగా అత్యవసరం వచ్చినప్పడు ఎదుర్కోవలసిన పరిస్థితులపై సూచనలు, సలహాలు ఇచ్చారు.
సూచనలు, సలహాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు అతి భారీగా వర్షాలు పడనున్నాయని సమాచారం ఉందని ఈ నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరం అయితేనే ప్రజలుగానీ, వాహనదారులుగానీ బయటకు రావాలన్నారు. ప్రజలు ప్రమాదాల భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ పోల్స్, పాత భవనాలు, చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఈ సమయంలో ప్రస్తుతం నిండిన చెరువులు పొంగే అవకాశం ఉందని, నదులు కాలువలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించవచ్చు అని తెలిపారు. పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు.
సోషల్ మీడియాలో భయాందోళనలు కలిగించవద్దని, అపోహాలను నమ్మొద్దని.. ఏ విషయమైనా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా, వాట్సప్‌లో వచ్చు కొన్ని వార్తలను అతిగా నమ్మవద్దని, మెసేజులు వచ్చిన వెంటనే ఇతరులకు పంపవద్దని.. ఒక్కసారి నిజమేంటో తెలుసుకోవాలని సూచించారు.ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్త పడాలని, అలసత్వం పనికిరాదన్నారు. అనుక్షణం ప్రజల రక్షణ కొరకే తాము ఉన్నామని, ప్రజలను కాపాడే విషయంలో అనునిత్యం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు జరిగినప్పుడు అధిక ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు, ఎదుటి వాహనదారులకు వెళ్లడానికి అవకాశం ఇస్తేనే మీరు(ప్రజలు) వెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కావున లైన్ పద్దతిని తప్పకుండా పాటించి సహకరించాలని కోరారు. అత్యవసర వాహనాలకు ఆటంకం కలిగించరాదని సూచించారు.
మరికొన్ని జాగ్రత్తలు, సూచనలు:
► లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు, వరద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివాసముంటున్నవారు తమ ఇళ్లలోని విలువైన వస్తువులు నగదు, నగలు, ఇంటి పత్రాలు వంటి వాటిని సురక్షిత ప్రాంతంలో భద్రపరచుకోవాలి.
► రోడ్లపై ప్రయాణించేటప్పుడు తెలియని ప్రాంతాల్లో నీటి క్రింద మ్యాన్‌హోల్ ఉండవచ్చు, కావున నడిచి వెళ్లేవారు, వాహనదారులు రోడ్డు పరిస్థితిని అంచనా వేస్తూ జాగ్రత్తపడి వెళ్లాలి.
► వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్నవాళ్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కి గానీ దగ్గరలో ఉన్న పోలీస్ వారికీ తమ యొక్క ప్రాంత పరిస్థితిని ఫోన్ ద్వారా అందించండి.
► ఇళ్లలో వృద్ధులు చిన్న పిల్లలు ఉంటే, వారిపట్ల జాగ్రత్తలు తీసుకోండి. సురక్షిత ప్రాంతంలో ఉన్న బంధువుల వద్దకు పంపండి. వరద ముంపు వలన ప్రమాదం ఏర్పడే వరకు అవకాశం ఇవ్వకండి.
►ఈ దఫా పడనున్న భారీ వర్షాల కారణంగా చెరువులకు గండి పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి, రిజర్వాయర్లలో నీరు అధికంగా చేరే ప్రమాదం ఉంది, భారీ గాలులతో కూడిన వర్షం వలన చెట్లు విరిగి పడే ప్రమాదం ఉంది, కరెంటు స్తంభాలు ఒరిగి లైను తెగిపడే ప్రమాదం ఉంది, చాలాకాలం క్రితం కట్టిన పాత భవనాలు నేలకొరిగే ప్రమాదముంది.
► ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టినప్పటికీ, ప్రజలు కూడా తమపైన ఉన్న బాధ్యతను గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలి.
►జిల్లాలోని పలు ప్రాంతాలలో చెరువులన్నీ నిండి ఇప్పటికే పొర్లుతున్నాయి, 27వ తేదీ నుంచి రెండవ తేదీ వరకు కురిసే అతి భారీ వర్షాల కారణంగా చెరువులు తెగిపోయే ప్రమాదం కూడా ఉంది.
►గ్రామాలలో ఉన్న వారు, పట్టణాలలో నగరాలలో లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేందుకు, వరద ముంపుకు గురి కాకుండా ఉండేందుకు ముందస్తు ఆలోచనలు చేసుకోవాలి.
►అత్యవసర పరిస్థితులలో సహాయం కోరదలచినవారు డయల్ 100, 8099999977, 63099 13960 నెంబర్లకు సమాచారం అందిస్తే వెంటనే సంబంధిత రేస్క్యు ఆపరేషన్ పోలీసు సిబ్బంది సహాయం అందించడానికి అందుబాటులోకి వస్తారు.
►ఇప్పటికే పలు బృందాలను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రేస్క్యు ఆపరేషన్ పోలీస్ బృందాలు సిద్ధంగా ఉంచాము. ప్రజల రక్షణ కొరకే పోలీస్‌వారు అనునిత్యం అప్రమత్తంగా ఉండి ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇది గమనించి సహాయక చర్యల్లో భాగంగా మీవంతు సహకారం అవసరమైన సమయంలో పోలీస్‌వారికి అందించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment