
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల శనివారం ప్రకాశం బ్యారేజీ నుంచి ఒక టీఎంసీకిపైగా జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి. ఓవైపు శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోగా మరోవైపు తెలంగాణ సర్కార్ చర్యల వల్ల భారీ ఎత్తున జలాలు వృథాగా కడలిలో కలుస్తుండటంపై ఇరు రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పూర్తిగా ఆగిపోయినా తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ 6,357 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దీంతో శ్రీశైలంలో నీటిమట్టం 810.33 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 34.45 టీఎంసీలకు పడిపోయింది.
నాగార్జునసాగర్‌లోనూ తెలంగాణ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తుండటంతో నీటిమట్టం 530.81 అడుగులకు తగ్గింది. నీటి నిల్వ 166.59 టీఎంసీలకు పడిపోయింది. సాగర్ నుంచి విడుదల చేస్తున్న ప్రవాహానికి, స్థానికంగా వర్షాల వల్ల వచ్చే ప్రవాహం తోడవడంతో పులిచింతలలో నీటి నిల్వ 39.93 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల్లో తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తిని పెంచేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 14,024 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 11,952 క్యూసెక్కులను 20 గేట్ల అర్ధ అడుగు మేర ఎత్తి వృథాగా సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. తెలంగాణ సర్కార్ చర్యలు పంటల సాగుకు ఇబ్బందిగా మారుతుందని ఇరు రాష్ట్రాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment