ఆర్‌కే బీచ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న కియోస్క్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ వెళ్లే పర్యాటకులను ‘హాయ్ వెల్‌కం టు వైజాగ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ’.. ‘ఇన్ వైజాగ్ యూ కెన్ సీ ఆర్‌కే బీచ్, రుషికొండ, భీమిలి, కైలాసగిరి, సింహాచలం టెంపుల్. ఇఫ్ యూ హేవ్ ఎనీ ప్రాబ్లమ్. ప్లీజ్ కాంటాక్ట్ అజ్’ అంటూ ప్రేమగా పలకరించేందుకు ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసులు అందుబాటులోకి రానున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులకు సమస్త సమాచారాన్ని అందిచడంతో పాటు ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించేలా టూరిస్ట్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
మొదటగా విశాఖలోని ఆర్‌కే బీచ్ వద్ద ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ కియోస్క్ ఏర్పాటు చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పర్యాటక ప్రదేశాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఉమ్మడి విశాఖలో చూడదగిన పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని బ్రోచర్ల రూపంలో అందుబాటులో ఉంచనున్నారు. పర్యాటకులు ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా.. ఎవరైనా తప్పిపోయినా వీరికి ఫిర్యాదు చేస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.
పర్యాటకుల నుంచి ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే కూడా వీరికి సమాచారం ఇస్తే చర్యలు తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి ప్రయాణం సాఫీగా సాగేలా చూడటంతోపాటు మరోసారి వచ్చే విధంగా ఆకర్షించేందుకు టూరిస్ట్ పోలీసింగ్ తోడ్పడుతుందనేది ప్రభుత్వ వర్గాల భావన.
జీ–20 సమావేశాల నేపథ్యంలో..
విశాఖలో వరుసగా వివిధ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 28, 29 తేదీల్లో జీ–20 దేశాల సమావేశాలకు కూడా విశాఖ వేదిక కాబోతోంది. దీనికి విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం ప్రతినిధులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీసింగ్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 55 ప్రాంతాల్లో 200 వరకూ జీ–20 గ్రూప్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.
2016 నుంచీ చేయాలనుకున్నా..
వాస్తవానికి దేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీసింగ్ అభివృద్ధి చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది. ఇందుకు అనుగుణంగా 2016లోనే ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఈ విధానం అమలుకు నోచుకోలేదు. 2019లో 25 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే, కోవిడ్ నేపథ్యంలో అమలుకు నోచుకోలేదు. తాజాగా జీ–20 సమావేశాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ విశాఖలో ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
కియోస్క్ ఏర్పాటు చేస్తున్నాం
విశాఖ నగరంలో టూరిస్ట్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ఆర్‌కే బీచ్ ప్రాంతంలో మొదటగా ఒక కియోస్క్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా పర్యాటకులకు సేవలందించేందుకు పోలీసులు అందుబాటులో ఉంటారు. తర్వాత మిగిలిన పర్యాటక ప్రదేశాలైన భీమిలి, రుషికొండ, తెన్నేటి పార్కు, కైలాసగిరి, యారాడ వంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
– శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment