పుష్కరుడికి స్వాగతం | Traditional Start To Tungabhadra Pushkaralu In AP | Sakshi
Sakshi News home page

పుష్కరుడికి స్వాగతం

Published Sat, Nov 21 2020 2:51 AM | Last Updated on Sat, Nov 21 2020 8:20 AM

Traditional Start To Tungabhadra Pushkaralu In AP - Sakshi

తుంగభద్రమ్మకు పసుపు, కుంకుమలతో పూజ చేసి పట్టువస్త్రాలను సమరి్పస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కోవిడ్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య భక్తుల మనోభావాలకు అనుగుణంగా తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానమాచరించే ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలు లేకుండా, శాస్త్రోక్తంగా ప్రారంభించింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. వేదమంత్రోచ్ఛారణతో పుష్కర ఘాట్‌లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కర్నూలులోని ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు వచ్చారు. పట్టుపంచె, తెల్లచొక్కా ధరించి సంప్రదాయ వస్త్రధారణలో సంకల్‌భాగ్‌ పుష్కరఘాట్‌కు చేరుకున్నారు.

ప్రభుత్వం తరఫున తుంగభద్రమ్మకు సమర్పించేందుకు పట్టు వస్త్రాలను చేతుల్లో పెట్టుకుని ముందుకు కదలగా, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రిని నది వరకు తీసుకొచ్చారు. నది ఒడ్డున ఉన్న తుంగభద్రమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. దేవగురువు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించగానే సరిగ్గా మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు తుంగభద్రలోకి ప్రవేశించాడు. పుష్కరుడిని నదిలోకి ఆహ్వానిస్తూ పండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రి ‘స్వాగత పూజ’ చేశారు. పుష్కరుడి ప్రవేశానంతరం నదీ జలాలకు పండితులు విశేషమైన ఉపచార పూజలు చేశారు. అనంతరం సీఎం పట్టువస్త్రాలను సమర్పించారు. వేద పండితులు పంచహారతులిచ్చారు. ముఖ్యమంత్రి కూడా తుంగభద్రమ్మకు హారతినిచ్చి పూజలు చేశారు. పుష్కరుడి రాక తర్వాత అపూర్వ, విశేషమైన శక్తిని సంతరించుకున్న పుష్కర జలాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ శిరస్సుపై ప్రోక్షించుకున్నారు. 
పుష్కరాల ప్రారంభం సందర్భంగా నదికి హారతి ఇస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

యాగశాలకు పూర్ణాహుతి
– ముఖ్యమంత్రి నది నుంచి నేరుగా యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో నాలుగు మూలల్లో ఉన్న వాస్తుమండపం, సర్వతోభద్ర మండపం, యోగిని మండపం, నవగ్రహ మండపం వద్ద అప్పటికే వేదపండితులు పూజలు చేసి, ఆవాహన చేసిన యాగశాలకు ముఖ్యమంత్రి పుష్పాలు సమర్పించారు. 
– పండితుల ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్న ఆయుష్షు హోమంలో పాల్గొని, పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రికి తిలకం దిద్ది వేదాశీర్వచనం చేశారు. 
– సంప్రదాయ వస్త్రాలతో, పాదరక్షలు లేకుండా పుష్కర పూజల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. పుష్కరుడికి పూజలు చేసి హారతి సమర్పించారు. సుగంధ ద్రవ్యాలను సమర్పించారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, రాష్ట్రం, ప్రజలు సిరిసంపదలతో విరాజిల్లాలని ప్రార్థించారు. 
యాగశాలలో హోమం అనంతరం పూర్ణాహుతి సమర్పిస్తున్న సీఎం 

కోవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
– 12 ఏళ్లకోసారి అంగరంగ వైభవంగా జరిగే తుంగభద్ర పుష్కరాలు ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం పుష్కర స్నానాలకు అనుమతి నిరాకరించింది. తలపై నీళ్లు చల్లుకుని, సంప్రదాయ పద్ధతిలో పుష్కర పూజలు చేసుకోవాలని భక్తులకు సూచించింది. 
– దీంతో మొదటిరోజు ఘాట్ల వద్ద రద్దీ కన్పించలేదు. ఎక్కువగా ప్రభుత్వ అధికారులు, వీఐపీలు మాత్రమే ఘాట్లకు చేరుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి పుష్కర పూజల్లో పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది భక్తుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి, శానిటైజ్‌ చేశాకే ఘాట్లలోకి అనుమతిస్తున్నారు.
– ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సంకల్‌భాగ్‌ పుష్కరఘాట్‌లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజాప్రతినిధులు, వీఐపీలకు అనుమతి ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్, శంకర్‌నారాయణ, గుమ్మనూరు జయరాం, కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా పుష్కరాలు ప్రారంభం 
– కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది వెంబడి 23 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. అన్ని ఘాట్లలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. 
– మంత్రాలయంలో మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థులు నదిలోకి వెళ్లి పుష్కరస్నానం ఆచరించారు. పుష్కరాల కోసం సప్తనదులైన గంగ, యమున, సరస్వతి, కావేరి, నర్మద, సింధూ, గోదావరి నుంచి తీసుకొచ్చిన జలాలను తుంగభద్రలో కలిపారు. తుంగభద్రమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement