విద్యార్థుల తరలింపునకు సహకరించిన వివిధ సంఘాల ప్రతినిధులతో ఏపీఎన్‌ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, ప్రజలను రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తయింది. తాజాగా వచ్చిన 89 మంది విద్యార్థులతో ఇప్పటివరకు 689 మందిని రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా ఇళ్లకు చేర్చింది. ఈ విషయాన్ని ఏపీఎన్‌ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి ‘సాక్షి’కి తెలిపారు. వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌లో సుమారు 770 మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చిక్కుకున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చెందిన విద్యార్థులను ఢిల్లీ, ముంబైలకు తీసుకొచ్చి అక్కడి నుంచి వారి స్వస్థలాలకు రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది.
విదేశాల్లో వసతి ఏర్పాట్లతోపాటు సొంత ఖర్చులతో స్వస్థలాలకు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.70 కోట్లు విడుదల చేసింది. ఉక్రెయిన్ నుంచి హంగేరీ చేరుకున్న విద్యార్థుల తరలింపు దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయ అధికారి తుహిన్‌కుమార్, వెంకట్ మేడపాటి .. ఇందుకు సహకరించిన స్థానిక భారత అసోసియేషన్ల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, తెలుగు అసోసియేషన్ల ప్రతినిధులతో బుడాపెస్ట్‌లోని టెక్నికుం, సెయింట్ ఇస్టివన్‌లో సమావేశమై వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇంకా ఎవరైనా విద్యార్థులు ఉంటే వారిని స్థానిక ఎంబసీ సహకారంతో వెనక్కి తీసుకొస్తామని వెంకట్ చెప్పారు. కొంతమంది విద్యార్థులు సొంతంగా స్వరాష్ట్రానికి చేరుకున్నారని, మరికొందరు రష్యా, ఆస్ట్రేలియాల్లోని వారి బంధువుల ఇళ్లకు చేరుకున్నారని సమాచారం వచ్చిందన్నారు. ఇంకా ఎవరైనా ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులుంటే ఆ వివరాలను తెలిపితే క్షేమంగా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment