
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలు ప్రారంభమయ్యాయి. బదిలీ ఉత్తర్వులు బుధవారం ఆన్‌లైన్‌లో జారీ చేశారు. వైద్య విద్యా సంచాలకులు పరిధిలోని వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రుల్లో పనిచేసే 216 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 596 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 41 మంది ట్యూటర్లు బదిలీ అయ్యారు. 206 మంది ప్రొఫెసర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎ కేటగిరీకి చెందిన విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరుల్లోని వైద్య కళాశాలలు, బోధన ఆసుపత్రులు, విజయవాడ, వైఎస్సార్ కడపలోని డెంటల్, అన్ని నర్సింగ్ కళాశాలల్లోని వైద్యులను వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
అదే విధంగా బి కేటగిరీలోని నెల్లూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, ఒంగోలు కళాశాలలకు కొత్తగా కేటాయించిన వైద్యులు వచ్చి చేరేంత వరకూ ఇక్కడ పనిచేసే వారిని రిలీవ్ చేయవద్దని సూచించారు. రిలీవ్ అయిన ఏడు రోజుల్లో కొత్తగా కేటాయించిన చోట విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఎ కేటగిరి సంస్థల్లో బుధవారం బదిలీ అయిన వారిని ప్రిన్సిపాళ్లు రిలీవ్ చేశారు. రిలీవ్ అయిన వైద్యులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో గురువారం నుంచి జాయిన్ అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment