
సాక్షి, తిరుమల: తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతిచెందిన బాలిక ఘటనపై టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్‌ను ప్రకటించింది. భక్తులకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది టీటీడీ.
తిరమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమాతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. భక్తులకు ముందువైపు, వెనుకవైపు రోప్‌లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు పైలట్‌గా సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు.
మరోవైపు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని అన్నారు. అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నడకమార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. టీటీడీ నుంచి రూ.5లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక, బాలికపై చిరుత దాడి ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. నడకదారి భక్తులకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. చిరుత కోసం అటవీశాఖ అధికారులు నడకదారిలో మూడు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ అధికారులు గుర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అయ్యా పవనూ.. ఊహించలే.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా?