అందుకే తొక్కిసలాట జరిగిందంటున్న పోలీసులు.. పోలీసుల వైఫల్యమేనన్న టీటీడీ చైర్మన్
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టని టీటీడీ
టీటీడీ చరిత్రలో ఇటువంటి దుర్ఘటన జరగలేదు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పకడ్బందీ చర్యలు
పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రస్తుత పాలక మండలి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల పట్ల టీటీడీ పాలక మండలి నిర్లక్ష్య వైఖరిని తిరుపతి దుర్ఘటన తేటతెల్లం చేసింది. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నప్పటికీ, క్యూ లైన్ల నిర్వహణ, భక్తులను క్రమపద్ధతిలో పంపడంలో పాలక మండలి పూర్తిగా విఫలమైంది.
టీటీడీ చరిత్రలో ఇటువంటి దుర్ఘటన జరిగిన దాఖలాలు లేవు. భక్తులను సినిమా టిక్కెట్ల కోసం విడిచిపెట్టినట్లుగా ఒక్కసారిగా వదిలేశారని ప్రత్యక్షంగా చూసిన పోలీసులే చెబుతున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం ఇది పోలీసుల వైఫల్యమేనని ప్రకటించటం గమనార్హం.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలివస్తుంటారు. ఈ విషయాన్ని గ్రహించే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పాలక మండలి వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులపాటు కొనసాగించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లూ చేసింది. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది.
అయితే ఈ ఏడు కూటమి ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి వైకుంఠ ద్వార దర్శనంపై ప్రత్యేక చర్యలు తీసుకోలేదని, భారీగా భక్తులు వస్తారని తెలిసినా అందుకు తగ్గట్లు పక్కా ప్రణాళికలు రూపొందించలేదని ఈ దుర్ఘటన తేటతెల్లం చేసింది.
టీటీడీకి చైర్మన్, పెద్ద సంఖ్యలో సభ్యులు, ఓ ఈవో, ఓ జేఈవో, అనేక మంది ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. మీడియాలో ప్రచారం కోసం ఒకటి రెండు చోట్ల వచ్చి చూసి, మాట్లాడి వెళ్లిపోయారే తప్ప, భక్తుల రద్దీ, తదనుగుణ చర్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసి ఉంటే..
వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారనే విషయం టీటీడీకి తెలియనిది కాదు. అందుకు తగ్గట్టు ఈ టోకెన్లు అన్ని జిల్లాల్లో పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదని భక్తులు చెబుతున్నారు. ఒక్కో జిల్లాకు కొన్ని టోకెన్లు కేటాయించి, స్థానికంగానే ఇచ్చి ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
తొక్కిసలాటలో ఆరుగురు మృతి
40 మందికి గాయాలయ్యాయి: తిరుపతి కలెక్టర్
తిరుపతి అర్బన్: వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు తీసుకునే క్రమంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారని, 40 మందికి గాయాలయ్యాయని తిరుపతి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ బుధవారం రాత్రి వెల్లడించారు. స్విమ్స్ అస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిలో ఇద్దరు, రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 28 మందిలో నలుగురు మృతి చెందారని తెలిపారు.
మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు ఇద్దరు మృతుల వివరాలను మాత్రమే తెలుసుకున్నామని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.
టోకెన్ల జారీ ఇలా జరగాలి..!
సాక్షి, అమరావతి: తిరుమలలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. టోకెన్ల జారీకేంద్రాల వద్ద భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులతో కూడిన ఓ ప్రత్యేక బృందాన్ని కూడా నియమిస్తుంది. తిరుమలలో దర్శనాలు, టోకెన్ల జారీ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. ఏటా వైకుంఠ ద్వార దర్శనానికి దాదాపు 7 లక్షల టిక్కెట్లు జారీ చేస్తారు.
వీటిలో రోజుకి 20 వేల చొప్పున 10 రోజుల పాటు 2 లక్షల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఇస్తారు. మరో 5 లక్షల టిక్కెట్లు పది రోజుల పాటు రోజుకు 50 వేలు చొప్పున తిరుపతిలో భక్తులకు జారీ చేస్తారు. ఇందుకోసం తిరుపతిలో 9 ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఒక్కో కేంద్రంలో 10 కౌంటర్లు ఉంటాయి. వైకుంఠ ద్వార దర్శనంలో తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల వరకు వీఐపీలకు కేటాయిస్తారు. ఉదయం 5 నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. దీనికి 24 గంటల ముందే తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలి.
సాధారణంగా ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ మొదలవుతుంది. అంతకు 15 – 20 గంటల ముందే భక్తులు క్యూలోకి ప్రవేశిస్తారు. వచ్చిన వారిని వచి్చనట్లు క్యూ లైన్లలోకి అనుమతించాలి. క్యూలైన్ నిండిన తర్వాత వెలుపల కొంత దూరం రోప్ లైన్ ఉంటుంది. అది కూడా నిండి జనం రద్దీ పెరిగి, నియంత్రణ కష్టమని భావిస్తే ఉదయం 5 గంటలకంటే ముందే కౌంటర్లు తెరిచి టోకెన్లు జారీ చేస్తూ క్యూలైన్ల మీద ఒత్తిడి తగ్గించాలి.
భక్తుల రద్దీ, ఒత్తిడిని టీటీడీ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల బృందం నిరంతరం పర్యవేక్షించాలి. ఈ బృందంలో ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు, ఆర్డీవో స్థాయి అధికారి ఒకరు, తహశీల్దారు స్థాయి అధికారులు ఇద్దరు తప్పనిసరిగా ఉండాలి. నిరంతరం రద్దీని అంచనా వేస్తూ ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని, టోకెన్ల పంపిణీ చేపట్టాలి.
తొక్కిసలాట దురదృష్టకరం
కాగా తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ కౌంటర్ల వద్ద తొక్కిసలాట చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసినా భక్తులు ఒక్కసారిగా 2 వేల మందికి పైగా కౌంటర్ల వద్దకు దూసుకురావడంతోనే జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment