తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళభరిత అగరబత్తీలు తయారు చేసి భక్తులకు విక్రయానికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శ్రీవారి ఏడు కొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అగరబత్తీల విక్రయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ ఆలయాల్లో పూజలు, అలంకరణలకు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. పర్వదినాలు, ఉత్సవాల సమయంలో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉపయోగించిన పుష్పాలన్నీ మరుసటిరోజు ఉదయం తొలగిస్తారు.
స్వామి సేవకు ఉపయోగించిన పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగించే విషయంపై టీటీడీ ఆలోచన చేసింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ టీటీడీ ఆలయాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాలను అందిస్తే లాభం లేకుండా అగరబత్తీలు తయారు చేసి అందిస్తామని ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థతో టీటీడీ అవగాహన కుదుర్చుకుని ఎస్వీ గోశాలలో అగరబత్తీల తయారీకి అవసరమైన స్థలం కేటాయించింది. దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ తన సొంత ఖర్చులతో యంత్రాలు, సిబ్బందిని నియమించుకుని కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా అగరబత్తీల ఉత్పత్తిని ప్రారంభించింది.
తయారీ ఇలా..
టీటీడీ స్థానిక ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఉద్యానవన విభాగం సిబ్బంది ఎస్వీ గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రానికి తరలిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వీటిని రకాల వారీగా పుష్పాలను వేరు చేసి వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. ఆ పిండికి నీరు కలిపి కొన్ని పదార్థాలతో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని మరో యంత్రంలో వేసి అగరబత్తీలు తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక యంత్రంలో 15 నుంచి 16 గంటల పాటు ఆరబెట్టిన తరువాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావకంలో ముంచుతారు. చివరగా వీటిని మరోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తీలు తయారుచేసేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment