AP Assembly Session 2023: AP Assembly Passes Two Important Resolutions, Details Inside - Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలు.. కేంద్రానికి పంపుతున్నట్లు ప్రకటించిన సీఎం జగన్‌

Published Fri, Mar 24 2023 3:37 PM | Last Updated on Sat, Mar 25 2023 2:42 AM

Two important resolutions in AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. 70 ఏళ్లుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతున్న ఆ రెండు కులాలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. జోనల్‌ వ్యవస్థ వారికి రక్షణగా ఉంటుందని, చదువులు, ఉద్యోగాల విషయంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపారు. 

బోయ, వాల్మీకి సామాజిక వర్గం అధికంగా నివసించే రాయలసీమ ప్రాంతం ఇతర జోన్‌లో ఉంటుందని వివరించారు. ఇక దళిత క్రైస్తవులకు ఆర్థిక, సామాజిక న్యాయం చేసేందుకు వారికి ఎస్సీ హోదా నిరాకరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మతం మారినంత మాత్రాన దళిత క్రైస్తవుల సామాజిక, ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదని చెప్పారు. అందుకే దళిత క్రైస్తవు­లకు ఎస్సీ హోదా నిరాకరించకూడదనే తీర్మా­నం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు. ఈ మేరకు శాసనసభ శుక్రవారం విడివిడిగా రెండు తీర్మానాలను ఆమోదించింది.

ఈ సందర్భంగా చర్చలో ముఖ్యమంత్రి జగన్‌ ఏమన్నారంటే.. మాట మేరకు వాల్మీకి, బోయలకు న్యాయం నా సుదీర్ఘ పాదయాత్ర సమయంలో బోయ, వాల్మీకి సామాజిక వర్గాల వారు నన్ను కలిసి 70 ఏళ్లుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతున్నట్లు వాపోయారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో తమవారికి ఎస్టీ హోదా ఉందని, పక్కనే ఉన్న బళ్లారి జిల్లాలోనూ తమ కులస్తులకు ఎస్టీ హోదా ఉందని  చెప్పారు. కానీ రాయలసీమ జిల్లాల్లో ఉన్న తమకు ఎస్టీ హోదా ఇవ్వకపోవడంతో దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎస్టీలలో చేర్చాలని బోయ, వాల్మీకి కులాల వారు కోరడంతో అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చా. 

అయితే ఎస్టీ హోదా ఇవ్వడం రాష్ట్ర పరిధిలోని అంశం కాదు. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. కానీ చేతనైనంత సాయం చేయాల్సిన బాధ్యత, మానవత్వం మనలో ఉండాలి. ఆ మానవత్వంతోనే వారికి ఎస్టీ హోదా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బోయ, వాల్మీకి కులాల సామాజిక, ఆర్థిక  పరిస్థితులు, వారి చరిత్ర, స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించాం. 

ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే రాయలసీమ జిల్లాల్లో కమిషన్‌ విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేసింది. వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, గత  చరిత్రను క్షుణ్నంగా పరిశీలించి నివేదిక సమర్పించింది. బోయ, వాల్మీకి సహా అనుబంధ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కమిషన్‌ సిఫార్సు చేసింది. ఏకసభ్య కమిషన్‌ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపుతున్నాం.  

ఏజెన్సీలో ఎస్టీలకు అన్యాయం జరగదు.. 
బోయ, వాల్మీకి కులాలకు ఎస్టీ హోదా కల్పించాల­న్న సిఫారసులపై కొందరు షెడ్యూల్‌(ఏజెన్సీ) ప్రాం­తాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని న­మ్మొ­ద్దు. ఈ విషయంపై కమిషన్‌ కూడా ఒక నివే­దిక ఇచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్టీలకు భరో­సా కలిగిస్తూ వారికి కొన్ని విషయాలు చెప్పాల్సిన బాధ్య­త ఈ సభ మీద ఉంది. కమిషన్‌ నివేదికలో కూ­డా ఈ విషయాలు పొందుపరిచారు. కమిషన్‌ చెప్పి­న­ట్లుగా మన రాష్ట్రంలో సిక్స్‌ పాయింట్‌ ఫార్ము­లా, జోనల్‌ వ్యవస్థ ఉన్నాయి. దీంతో చదువులు, ఉద్యోగాల విషయంలో ఏజెన్సీ ప్రాంతా­ల్లో­ని ఎస్టీలపై ఎటువంటి ప్రభావం ఉండదు. కారణం.. ఏజెన్సీ ప్రాంతాలన్నీ వేరే జోన్‌లోకి వస్తాయి కాబట్టి. రాయలసీమ ప్రాంతం వేరే జోన్‌లో ఉంటుంది. 

బోయ, వాల్మీకిలను ఎస్టీలలో చేర్చడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీల చదువులు, ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. వారి ఉద్యోగాలు వారికే ఉంటాయి. నాన్‌ జోనింగ్‌ ఉద్యోగాల మీదే అంతో ఇంతో ప్రభావం ఉంటుంది. కేవలం గ్రూప్‌–1 ఉద్యోగాలే నాన్‌ జోనింగ్‌ పరిధిలోకి వస్తాయి. గత పదేళ్లలో రాష్ట్రంలో కేవలం 386 గ్రూప్‌–1 ఉద్యోగా>లకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు. వాటిలో ఆరు శాతం ఎస్టీ రిజర్వేషన్‌ అంటే కేవలం 22 ఉద్యోగాల మీదే పోటీ ఉంటుంది. మిగిలినవి అన్నీ జిల్లాలకు సంబంధించిన ఉద్యోగా­లు. అవన్నీ జోన్‌లకు సంబంధించినవే. మొత్తం ఉద్యోగాల్లో ఇవే 99 శాతం వరకూ ఉంటాయి. కాబట్టి ఏజన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగదు. 

ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్టీ సోదర సోదరీ మణులకు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. గిట్టనివారు ఓట్ల కోసం చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నా. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, ఆదివాసీల హక్కులు, ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని మీ జగనన్నగా మాట ఇస్తున్నా. ఒకరికి న్యాయం చేస్తున్నామంటే.. మరొకరికి అన్యాయం చేస్తున్నట్టు కాదు. అన్యాయం  చేయాలనే అభిప్రాయంగానీ, ఉద్దేశంగానీ వైఎస్సార్‌సీపీకి మరీ ముఖ్యంగా మీ జగనన్నకు ఏమాత్రం లేదు. నా రాజకీయ ప్ర­యాణం మొదలైన తరువాత ఎస్టీలు నన్ను గుండె­ల్లో పెట్టుకున్నారు. నా జీవితం చివరి వరకు కూడా వారిని అలానే గుండెల్లో పెట్టుకుంటా. వారి­కి ఇసు­మంతైనా అన్యాయం చేయనని హామీ ఇస్తు­న్నా.  

వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌లెస్‌.. 
ఈ రెండు తీర్మానాలతో ఆ సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం సరిదిద్దినట్లు అవుతుంది. మనమంతా పాలకులం. మనం వాయిస్‌ ఆఫ్‌ ద వాయిస్‌లెస్‌ (గొంతులేని వారికి గొంతుకగా) ఉండాల్సిన అవసరం ఉంది. అలా చేయనప్పుడు మనం ఈ స్థానాల్లో ఉండటం కూడా వృథా అని నేను నమ్ముతున్నా. ఈ రెండు విషయాల్లో ఇంతకంటే మనం చేయగలిగేదేమీ లేదని కూడా నాకు తెలుసు. అయినప్పటికీ అన్యాయానికి గురైన వారికి సాధ్యమైనంతవరకు మంచి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే వాల్మీకి, బోయ కులాలు, దళిత క్రైస్తవులకు న్యాయం చేసేందుకు ఈ చట్ట సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నాం.   

దళిత క్రైస్తవుల సామాజిక, ఆర్థిక న్యాయం కోసమే ఎస్సీ హోదా 
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా నిరాకరించకూడదని రెండో తీర్మానం చేశాం. నాన్న (వైఎస్సార్‌) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలా తీర్మానం చేశారు. మళ్లీ ఈ రోజు చట్టసభలో ఇదే తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం. ఈ విషయంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఇందులో ఏపీ తరఫున ఇంప్లీడ్‌ అయ్యి మన వాదన వినిపిస్తున్నాం. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే దళితులు ఇంతకు ముందు ఆచరిస్తున్న మతాన్ని విడిచి మరో మతంలోకి వెళ్లినంత మాత్రాన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అందరికీ తెలుసు. మతం అన్నది నాలుగు గోడల మధ్య ఆ మనిషికి, దేవుడికి మధ్య ఉన్న సంబంధం. ఒక మనిషి మరో మతంలోకి వెళ్తే ఎవరికీ అన్యాయం జరగదు. కేవలం మత మార్పిడి వల్లే వీరికి రావాల్సిన ఎస్సీ హక్కులు రాకుండా పోవడం అన్యాయమని కచ్చితంగా నమ్ముతూ సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement