హైదరాబాద్ వెళ్లి వైఎస్సార్ బీమా పథకం ఈకేవైసీ చేయిస్తున్న వలంటీర్ దుర్గారావు
కొనకనమిట్ల/తెర్లాం(బొబ్బిలి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ బీమా పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేసేందుకు గ్రామ వలంటీర్లు కృషి చేస్తున్నారు. పనుల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్న వారి వద్దకు కూడా వెళ్లి ఈ పథకంలో చేర్పిస్తున్నారు. వివరాలు.. ప్రకాశం జిల్లా ఎదురాళ్లపాడు గ్రామ వలంటీరు పులుకూరి వెంకట్రావు తన పరిధిలోని 15 కుటుంబాలకు చెందిన వారు హైదరాబాద్ పరిసరాల్లోని పటాన్‌చెరు, శంషాబాద్, కరీంనగర్‌లలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. వారు స్వగ్రామానికి రావాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించిన వెంకట్రావు.. తానే వారి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకొన్నాడు. రెండు రోజుల కిందట వారి వద్దకు వెళ్లి.. పథకం గురించి తెలియజేశాడు.
అర్హుల నుంచి వేలిముద్రలు తీసుకొని వైఎస్సార్ బీమాలో నమోదు చేయించాడు. అలాగే విజయనగరం జిల్లా తెర్లాం మండలం కాలంరాజుపేటకు చెందిన కొన్ని కుటుంబాలు హైదరాబాద్‌లో ఉంటున్నాయి. గ్రామ వలంటీర్ దుర్గారావు హైదరాబాద్ వెళ్లి ఈ కుటుంబాల్లోని అర్హులకు వైఎస్సార్ బీమాకు సంబంధించిన ఈకేవైసీ చేయించారు. కూలి పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటున్న తమను వెతుక్కుంటూ వచ్చి ప్రభుత్వ పథకాన్ని వర్తింపజేసిన వలంటీర్లు వెంకట్రావు, దుర్గారావులకు వీరు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment