మూడు రోజులకే బొగ్గు నిల్వలు
అడుగంటిన ఇనుప ఖనిజం
ఇదే కొనసాగితే నిలిచిపోనున్న ఉక్కు ఉత్పత్తి
ముడిపదార్థాల సరఫరాలపై అమలు కాని కేంద్ర మంత్రి హామీ
ఉక్కునగరం (విశాఖ జిల్లా): విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ప్లాంట్‌లో ముడి పదార్థాల నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయం అందకపోతే స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోతుంది. సీఎం చంద్రబాబు కల్పించుకొని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు.
స్టీల్‌ప్లాంట్ గత కొన్ని నెలలుగా ముడి పదార్థాల కొరతతో సతమతమవుతోంది. మూడు బ్లాస్ట్‌ఫర్నేసుల్లో ఒక దానిని నిలిపివేసి అంతంత మాత్రం హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తున్నారు. గత నెలలో స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన కేంద్ర ఉక్కు మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్లాంట్‌కు అవసరమైన ముడి పదార్థాలు సెయిల్, ఎన్‌ఎండీసీ ద్వారా సమకూరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి నెల దాటినా ఇంతవరకు ముడి పదార్థాలు రాలేదు. ముఖ్యంగా బొగ్గు నిల్వలు తరిగిపోయాయి.
ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం లేని విధంగా నిల్వలు చేరుకున్నాయి. ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ (ఐసీసీ) మూడు రోజులకు మాత్రమే సరిపోయేలా ఉంది. దీంతో కోక్ ఓవెన్స్ బ్యాటరీల పుషింగ్స్ 300 నుంచి 200కు తగ్గించారు. విశాఖ ఉక్కు కొనుగోలు చేసిన ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ గంగవరం పోర్టులో 1.40 లక్షల టన్నులు ఉంది. దానిపై కోర్టు అటాచ్‌మెంట్ ఆర్డర్ ఉండటంతో పోర్టులోనే నిలిచిపోయింది.
ఉక్కు మంత్రి పర్యటనలో మూడు షిప్‌మెంట్ల కోల్ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు మూడు రేక్‌లు మాత్రమే సెయిల్ నుంచి అందాయి. అవి దాదాపు వినియోగించారు. మరోవైపు ఐరన్ ఓర్ లంప్స్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి. సైజ్డ్ ఓర్, ఐరన్ ఓర్ ఫైన్స్ నిల్వలు ఐదు రోజులకు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా బాయిలర్ కోల్ నిల్వలు కూడా జీరో స్ధాయికు చేరుకున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోతుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హామీని విస్మరించిన కూటమి నాయకులు
స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా నేతలంతా ఆ హామీలను పూర్తిగా విస్మరించారు. తక్షణం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉక్కు ఉద్యోగ కార్మిక నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు శనివారం ప్రధానితో భేటీ కానున్నారు.
ఈ భేటీలో విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై స్పష్టమైన హామీను కోరాలని, ప్లాంట్‌కు కావాల్సిన ముడి పదార్థాలు, ఆర్థిక ప్యాకేజీలపై చర్చించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం సెక్రటేరియట్‌కు మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment