తిరుచానూరు(తిరుపతి జిల్లా): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీవరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున సహస్రనామార్చన, నిత్యార్చన, మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీపద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించిన ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు.
విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అషో్టత్తర శత నామావళి నిర్వహించారు. అమ్మవారిని తొమ్మిది గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హారతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.
సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి రథాన్ని లాగేందుకు మహిళలు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి దంపతులు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, తిరుపతి మున్సిపల్ కమిషనర్ హరిత, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment