
మృతదేహం వద్ద రోదిస్తున్న సుబ్రహ్యణ్యం తల్లి అనంతలక్ష్మీ, బంధువులు
నరసరావుపేట: ‘పిచ్చి కన్నా.... సుబ్బూ... లేవరా... ఎలా వెళ్లిన వాడివి ఎలా తిరిగి వచ్చావురా’అంటూ వృద్ధురాలైన మాతృమూర్తి అనంతలక్ష్మి విలపించిన తీరు చూపరులను, బంధువర్గాలను కదిలించింది. మాదిపాడు వద్ద కృష్ణా నదిలో మునిగి మృతి చెందిన వేద పాఠశాల ఉపాధ్యాయుడు కేతేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం (26) మృతదేహం శనివారం బరంపేటలోని అతని స్వగృహానికి చేరింది. ఆరు నెలల క్రితమే భర్త పాపయ్య శాస్త్రిని కోల్పోయిన ఆ మాతృమూర్తి రెండవ కుమారుడు కూడా విగతజీవుడై కళ్లముందు కనిపించే సరికి గుండెలవిశేలా రొదించింది.
శుక్రవారం రాత్రి విషయం తెలుసుకున్న బంధువర్గం శనివారం ఉదయానికి నరసరావు పేటకు చేరుకున్నారు. సత్తెనపల్లిలో పోస్టుమార్టం అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహం ప్రత్యేక అంబులెన్స్‌లో నరసరావుపేటకు చేరింది. దీంతో ఒక్కసారిగా బంధువర్గం రోదనలు మిన్నంటాయి. సుబ్రహ్మణ్యం పదవ తరగతి వరకు పట్టణంలోని శ్రీరామకృష్ణ ఓరియంటల్ హైస్కూల్లో చదువుకున్నాడు.
అనంతరం జిల్లెళ్లమూడిలోని మాతృశ్రీ వేదపాఠశాలలో ఐదేళ్ల పాటు చదివి సంస్కృతంలో పట్టా అందుకుని మూడు సంవత్సరాల క్రితం మాదిపాడులోని వేదపాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టాడు. మరో ఆరునెలలో వివాహం చేద్దామని కుటుంబ సభ్యులు ఆలోచిస్తుండగా ఇంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment