కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతల సంబరాలు
సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు అఖండ విజయం సాధించడంతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాత్రి సంబరాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి నృత్యాలు చేశారు. ‘వైఎస్ జగన్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జగన్’ నినాదాలు మిన్నంటగా తాడేపల్లి ప్రాంతమంతా మార్మోగింది. ఆనందోత్సాహాల మధ్య ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ జెండాలను రెపరెపలాడిస్తూ ‘వైఎస్సార్‌సీపీ’ జిందాబాద్ అంటూ నినదించారు. సంతోషంతో పూలు జల్లుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బాణసంచా మోతలతో తాడేపల్లి ప్రాంతం దద్ధరిల్లింది.
పురపాలక ఎన్నికల్లోనూ ఇదే ప్రభంజనం: మంత్రి బొత్స
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తిన విజయ ప్రభంజనమే త్వరలో జరిగే పురపాలక ఎన్నికల్లోనూ కొనసాగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో నూరు శాతం స్థానాల్లో విజయ సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం, మూడో విడత ఎన్నికల్లో 90 శాతం వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయం సాధించడం ఆనంద దాయకమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వల్లే ప్రజలు ఈ ఫలితాలు ఇస్తున్నారన్నారు. కుప్పంలో ఎవరికి ఎక్కువ స్థానాలొచ్చాయో చంద్రబాబుకు తెలియదా అని బొత్స ప్రశ్నించారు.
ముందే ఊహించాం: కన్నబాబు
మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కుప్పంలో వచ్చిన ఫలితాలు తమకేమీ ఆశ్చర్యం అనిపించలేదన్నారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలుతుందని ముందే ఊహించామని చెప్పారు. కుప్పం అయినా ఇచ్ఛాపురం అయినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ అని, ఏపీలో కాకపోయినా.. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో పోటీచేసే అవకాశం చంద్రబాబుకు ఉంటుందన్నారు. చంద్రబాబు ఇక పక్క రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి పోటీ చేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.
చదవండి: చంద్రబాబుకు భారీ షాక్: కుప్పంలో టీడీపీ ఢమాల్
కుప్పం కూడా చెప్పింది.. గుడ్ బై బాబూ
Comments
Please login to add a commentAdd a comment