ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్రం విఫలం.. తిరుమల వెంకన్నపైనా జీఎస్టీ | Vijaya Sai Reddy Comments On Central Govt At Rajya Sabha | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్రం విఫలం.. తిరుమల వెంకన్నపైనా జీఎస్టీ

Published Wed, Aug 3 2022 4:25 AM | Last Updated on Wed, Aug 3 2022 3:01 PM

Vijaya Sai Reddy Comments On Central Govt At Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పవ్యవధి చర్చలో ఆయన మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపై ఉందన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో అటు ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ ఎందుకు విఫలమయ్యాయని ప్రశ్నించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ద్రవ్యోల్బణం 6 శాతానికిపైనే ఉంటుందని ఆర్బీఐ ప్రకటించడం గమనార్హమన్నారు. పరాయి దేశాల్లో ద్రవ్యోల్బణం రేటుతో  పోల్చుకుని మనం మెరుగైనస్థితిలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని పేర్కొన్నారు.

ద్రవ్యోల్బణం అనేది చట్టబద్ధత లేని పన్నుల వడ్డింపు వంటిదన్నారు. ఈ రకమైన వడ్డింపులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 38ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. అన్నింటికీ జీఎస్టీ విధిస్తున్నారని చివరికి తిరుమల వెంకన్నపైనా జీఎస్టీ విధించారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని చాలాసార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చానన్నారు. బీజేపీ సభ్యులు చాలామంది తిరుమల దేవుణ్ని ప్రార్థిస్తారని, కానీ పన్ను వేయడం మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధవర్గాల ప్రజలు, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు రూపుమాపి, సామాజిక అంతరాలు తొలగించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతని, కానీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.

కొందరు సభ్యులు పేర్కొన్నట్లు హోల్‌సేల్‌ ధర సూచికతో పోలుస్తూ ద్రవ్యోల్బణం 15.1 శాతం ఉందనడం సరికాదన్నారు. కొనుగోలు ధర సూచికతో పోల్చడమే సరైన పద్ధతి అని, ఆ విధంగా చూస్తే ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7.1 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఇది ఎక్కువే అయినప్పటికీ యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ద్రవ్యోల్బణం 10.4 శాతం ఉందని గుర్తుచేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల సామాన్యుడిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని చెప్పారు. 2000 సంవత్సరంలో రూ.లక్ష  ఇప్పుడు రూ.27 వేలకు సమానమన్నారు. దేశంలో ప్రజలకు సామాజిక, ఆర్థికభద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నందున తగిన చర్యలు చేపట్టి ధరల పెరుగుదలను అదుపుచేయాలని సూచించారు. 

వలస కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి 
కోవిడ్‌ మహమ్మారి కారణంగా వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారని, వారికి ఉపాధి కల్పించడం, ఉద్యోగ భద్రత ఇవ్వడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచవచ్చని సూచించారు. 2022 జనవరి–మార్చి మధ్యలో 47.3 శాతంగా ఉన్న లేబర్‌ భాగస్వామ్యం ఒక్క మార్చి నెలలోనే 39.5 శాతానికి పడిపోయిందని తెలిపారు. 3.8 లక్షలమంది శ్రామికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. ఆయిల్, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఏడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక ధరలు నమోదయ్యాయని, అదే సమయంలో దేశీయంగా బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని తెలిపారు. 

చిన్న పొదుపు స్కీములపై వడ్డీ రేట్లు పెంచాలి
కేంద్ర ప్రభుత్వ 10 సంవత్సరాల బాండ్లపై వడ్డీ రేట్లు 6.4 శాతం నుంచి 7.46 శాతానికి పెంచినట్లుగానే చిన్న పొదుపు స్కీములు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, వయోవృద్ధుల పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లు పెంచాలని కోరారు. తద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు చేయూతనిచ్చినట్లు అవుతుందని, అదే సమయంలో నగదు లభ్యత పెరుగుతుందని విజయసాయిరెడ్డి చెప్పారు. 

రూ.46 వేల కోట్లు నష్టపోయిన ఏపీ
పన్నుల ద్వారా వచ్చే ఆదాయం (సెంట్రల్‌ గ్రాస్‌ ట్యాక్స్‌ రెవెన్యూ)లో ఆంధ్రప్రదేశ్‌కు నిర్ణయించిన వాటా మేరకు కేంద్రం  చెల్లించనందున గత ఏడేళ్లలో రాష్ట్రం రూ.46 వేల కోట్లు నష్టపోయిందని చెప్పారు. పన్నుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం వలన దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి రూ.11.26 లక్షల కోట్లు నష్టపోయాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆదాయాన్ని లూటీ చేసిందని చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించినట్లు సెంట్రల్‌ గ్రాస్‌ టాక్స్‌ రెవెన్యూలో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వడం లేదని, కేవలం 31 నుంచి 32 శాతం వాటా మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. సెస్, సర్‌చార్జీలను ఎడాపెడా విధిస్తూ కేంద్రం రాష్ట్రాలను లూటీ చేస్తోందని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement