ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలి | Vijayasai Reddy Demand Special status To AP In Modi In All party Meeting | Sakshi
Sakshi News home page

ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలి

Published Sat, Jan 30 2021 5:54 PM | Last Updated on Sat, Jan 30 2021 8:24 PM

Vijayasai Reddy Demand Special status To AP In Modi In All party Meeting - Sakshi

న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, దీనికి కరోనా మహమ్మారి ప్రభావం కూడా తోడు కావడంతో మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన వివరించారు. ప్రత్యేక హోదా కల్పించే అధికారాన్ని 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వం విచక్షణకు వదిలిపెట్టినందున తక్షణమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన కోరారు.

జాతీయ ప్రాజెక్ట్‌గా నదుల అనుసంధానం
కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి నదులలోని నీటి ప్రవాహాన్ని టెలిమెట్రీ సాయంతో పరిశీలిస్తుండాలి. ఆయా రాష్ట్రాల భౌగోళిక విస్తీర్ణత ప్రాతిపదికన నీటి పంపకాలు జరగాలని కోరారు. నదుల అనుసంధానం కోసం పెద్ద ఎత్తున అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలని అన్నారు.

హైకోర్టును కర్నూలుకు తరలించాలి
వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధిని ఆశిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారం కర్నూలును  న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన సంగతిని ఆయన సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని విజయసాయి రెడ్డి కోరారు.

విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు కావలసి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను యధావిధిగా కొనసాగిస్తూనే ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియ మొదలై రెండేళ్ళు కావస్తున్నా ఇంకా అది ఒక కొలిక్కి రాకుండా కాలయాపన జరుగుతుండటాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.

మహిళా రిజర్వేషన్లు
పార్లమెంట్‌ ఉభయ సభలతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలు, కౌన్సిళ్ళలోను, నామినేటెడ్‌ పదవులలోను మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సవరించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని విజయసాయి రెడ్డి కోరారు. ప్రస్తుతం పార్లమెంట్‌లోని మొత్తం సభ్యులలో మహిళలు కేవలం 13 శాతం మాత్రమే ఉన్న విషయాన్ని ఆయన సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమాజంలో మహిళలకు సమప్రాధాన్యత కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంచాయతీలలో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్‌ చేస్తూ చట్టం తీసుకువచ్చినట్లు తెలిపారు.

వ్యవసాయ రంగ సమస్యలు
వ్యవసాయ ఉత్పత్తులన్నింటికీ గిట్టుబాటు ధర చెల్లించాలి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించినా, ప్రైవేట్‌ సంస్థలు సేకరించినా రైతు గిట్టుబాటు ధర పొందే హక్కును చట్టబద్దం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌, జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ కమిషన్‌ మాదిరిగానే రైతుల కోసం జాతీయ రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాంతీయ పార్టీలకు తగినంత సమయం ఇవ్వాలి
ప్రాంతీయ, అంతర్‌ రాష్ట్ర సమస్యలను యావత్‌ దేశం దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా పార్లమెంట్‌ చర్చల్లో ప్రాంతీయ పార్టీలకు మరింత ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు. పార్లమెంట్‌లో నాలుగవ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఉభయసభల్లో  పార్టీ ఎంపీలకు కేటాయిస్తున్న సమయం సంతృప్తికరంగా లేదని అన్నారు.

దేవాలయాలపై దాడుల వెనుక తెలుగుదేశం హస్తం
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరిగిన దేవాలయాలలో విగ్రహాల ధ్వసం వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్‌ సాక్ష్యం ద్వారా వెల్లడైందని అన్నారు. దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలపై దాడులపై ఏమాత్రం ఉపేక్షించడానికి వీలులేకుండా జాతీయ స్థాయిలో ఒక విధానం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ప్రార్ధనా స్థలాల్లో జరిగే నేరాలకు విధించే శిక్షను 2 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళకు పెంచుతూ ఐపీసీని సవరించాలని కోరారు.

రేప్‌ దోషులను శిక్షించేందుకు కఠిన చట్టాలు
మహిళలపై జరిగే అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా ఐపీసీ, సీఆర్‌పీసీలను సవరించాల్సి తక్షణ ఆవశ్యకత ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ఇలాంటి కేసులను 21 రోజుల్లో పరిష్కరించే వీలు కల్పిస్తుందని ఆయన వివరించారు. రేప్‌ కేసులలో శిక్ష పడిన దోషులకు పెరోల్‌ ఇవ్వకుండా చట్టాలను కఠినతరం చేయాలని అన్నారు.

విశాఖపట్నంలో జాతీయ విశ్వవిద్యాలయాలు
విశాఖపట్నం త్వరలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని కాబోతున్న నేపథ్యంలో రాష్ట్రీయ రక్షా యూనివర్శిటీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్శిటీ బిల్లుల కింద జాతీయ ప్రాధాన్యత కలిగిన విశ్వవిద్యాలయాను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement