శునకంతో సాహిత్య వర్థన్ ప్రయాణం
సాక్షి, విశాఖపట్నం: యువతరం.. మార్పు కోరుకుంటోంది. ఆ మార్పు తమ వద్ద నుంచే ప్రారంభం కావాలనీ.. పది మందికీ స్ఫూర్తిగా నిలిచేందుకు ఎంతటి శ్రమనైనా చిరునవ్వుతో అధిగమించాలనీ అభిలషిస్తోంది. సేవాకార్యక్రమాల నుంచి సాహసాల వరకూ ప్రతి విషయంలోనూ యువత ఇదే రీతిలో ఆలోచిస్తోంది. ఈ కోవకు చెందిన వారే సాహిత్యవర్ధన్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశాటన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా..? విశ్వాసానికి ప్రతీకలైన శునకాల కోసం. అదీ ముఖ్యంగా వీధి కుక్కల కోసం. సాహిత్య వర్ధన్ ప్రయాణం. ఇదంతా ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన 777–చార్లీ సినిమా మాదిరిగా ఉంది. మరి ఈ శునకాల కోసం సాగిన ప్రయాణ విశేషాలను ఓసారి చూద్దాం.
చదవండి: అఖండ గోదావరి.. ప్రాజెక్టుల గేట్లు బార్లా!
అనగనగా.. ఓ ఒంటరి యువకుడు. హఠాత్తుగా ఆయన జీవితంలోకి ఓ కుక్క వస్తుంది. ఆ కుక్కకు ఇష్టమైన ప్రాంతాల్ని చూపించేందుకు ఆ యువకుడు చేసిన ప్రయాణమే 777–చార్లీ సినిమా వృత్తాంతం. కుక్కకి.. యువకుడికి మధ్య జరిగిన భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకున్నాయి. సరిగ్గా ఇదే మాదిరి ప్రయాణం సాగింది సాహిత్యవర్ధన్.. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సాహిత్యవర్ధన్ కుటుంబం చిన్నతనం నుంచే విశాఖపట్నంలో నివసిస్తోంది.
ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంలో ప్రయాణం
ఈ యువ టెక్కీకి చిన్నతనం నుంచే కుక్కలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వీధి కుక్కలంటే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. తన పరిసరాల్లోని వీధుల్లో ఆకలితో అలమటించే కుక్కల్ని చూసి చలించిపోయిన సాహిత్యవర్ధన్.. తన దగ్గరున్న పాకెట్ మనీతో వాటి ఆకలి తీర్చేవాడు. అలా వాటితో అనుబంధం బలపడింది. ఆ్రస్టేలియాలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చదివిన సాహిత్యవర్ధన్.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. అయినా తెలియని ఆందోళనతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. వీధి కుక్కల పరిరక్షణకు నడుం బిగించాలని నిర్ణయించుకున్నాడు.
పెంపుడు కుక్కతో దేశాటన
వీధి కుక్కల పట్ల అవగాహన కల్పించేందుకు ‘కన్యాకుమారి టు కాశ్మీర్’యాత్రకు గతేడాది సెప్టెంబర్ 20న శ్రీకారం చుట్టాడు. ఐదు నెలల వయసున్న ఓ వీధికుక్క లెక్సీని దత్తత తీసుకొని.. దానితో కలిసి ఈ యాత్ర మొదలుపెట్టాడు. తన సైకిల్‌కు పక్కనే.. కుక్క కోసం ప్రత్యేకంగా ఓ బెడ్ మాదిరిగా ఏర్పాటు చేసి.. ప్రత్యేక ట్రైలర్ కస్టమ్‌ని రూపొందించాడు. తన ప్రయాణంలో వీధి కుక్కల దత్తతలోని ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వాటికి ఆహారం అందిస్తూ యాత్ర చేపట్టాడు.
తాను తిరిగిన ప్రాంతాలన్నింటినీ లెక్సీకి చూపిస్తూ యాత్ర కొనసాగించాడు. మొత్తం 3,700 కిలోమీటర్ల దూరాన్ని 90 రోజుల్లో పూర్తి చేశాడు. చికెన్, అన్నం, గుడ్లు ఎప్పటికప్పుడు వంట చేసుకుంటూ లెక్సీ కోసం ఆహారం అందించాడు. ఈ ప్రయాణంలో జాతికుక్కల్ని కొనుగోలు చేయకుండా... వీధికుక్కల్ని దత్తత తీసుకోవాలని ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంటిలోనూ ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రచారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 56 వీధికుక్కల్ని దత్తత తీసుకోవడం విశేషం. అంతే కాకుండా వీధి కుక్కలకు ఆహారం అందించే అలవాటు కూడా చాలా మందిలో పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో యాత్ర
వీధి కుక్కల దత్తతకు సంబంధించి.. మరింత విస్తృత ప్రచారం చేసేందుకు మరో యాత్రకు సాహిత్య వర్ధన్ శ్రీకారం చుట్టాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ యాత్రను డ్రాగ్ ట్రావెలర్ సాహిత్యవర్ధన్ ఆగస్ట్ 1 నుంచి మొదలు పెట్టాడు. రోజుకు 50 నుంచి 60 కి.మీ. ప్రయాణం చేస్తూ.. నలుగురు కనిపించిన చోట వీధి కుక్కల గురించి అవగాహన కల్పిస్తున్నాడు. వీధికుక్కల్ని కాపాడాలి.. దత్తత తీసుకోవాలి.. వాటికి ఆహారం అందించాలంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ అవగాహన కల్పిస్తూ ప్రయాణం సాగిస్తున్నాడు. అదే విధంగా కుక్కలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మెడలో రేడియం బెల్ట్‌లు కడుతున్నాడు.
ఏడాదిలో 3 నెలలు వీధికుక్కల కోసం..
వీధికుక్కల పట్ల క్రూరత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులను చేయడమే ఈ యాత్ర వెనుక ఉన్న ప్రధాన లక్ష్యమని డాగ్ ట్రావెలర్ సాహిత్యవర్ధన్ చెబుతున్నాడు. జాతి కుక్కలతో పోలిస్తే వీధికుక్కలు స్నేహపూర్వక జీవులే కాకుండా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే ప్రాణులని తెలిపాడు. అందుకే జాతి కుక్కలకు బదులుగా వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని ప్రతి ఊరిలోనూ ప్రజలను కోరుతున్నానని వివరించాడు.
ఇటీవల బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని పసిగట్టిన ఓ వీధికుక్క మొరుగుతూ 150 మందిని రక్షించిందన్నాడు. వీధికుక్కల ప్రేమను పొందడమే కాకుండా.. వాటికి ప్రేమను పంచేందుకు సమాజంలోకి వాటిని తీసుకురావాలన్న మార్పు కోసం.. ఏడాదిలో 3 నెలలు కేటాయించేందుకు సిద్ధపడినట్లు సాహితీవర్థన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment