సాక్షిప్రతినిధి, విజయనగరం: నిత్యం ప్రజల్లో నానుతున్న ఓ సామాజిక అంశానికి హాస్యాన్ని మేళవించి నవ్వులు పండిస్తూ అనతి కాలంలోనే లక్షలాది మంది వీక్షకుల్ని కట్టిపడేస్తోంది ఉత్తరాంధ్రకు చెందిన ఓ యూట్యూబ్ చానెల్. ఇప్పుడిది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ పెను సంచలనం. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 12.90 లక్షల మంది ఇప్పుడు ఈ చానెల్‌కు ఫిదా అయ్యారు. మిడిల్ క్లాస్ మధు పేరుతో చానెల్ నిర్వాహకులు సృష్టించిన పాత్ర బుల్లితెరలో ఇప్పుడో బంపర్ హిట్ క్యారెక్టర్. యూట్యూబ్ నుంచి ఆ ప్రోగ్రామ్‌కు గోల్డ్‌బటన్ షీల్డ్ వచ్చిందంటే దీనికున్న ఆదరణ ఏంటో చెప్పక్కర్లేదు. ఫిల్మీమోజీ పేరుతో ఎక్కడలేని ఖ్యాతి గడించిన ఈ చానెల్ సృష్టికర్తలకు ఇంతలా గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఐఫోన్ మొమోజీలను ఉపయోగించి వినూత్నంగా పాత్రలను తీర్చిదిద్దడంవల్లే.
ఈ నేపథ్యంలో.. ఫిల్మీమోజీ వీడియోలకు కథ, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అండలూరి సాయికిరణ్ ‘సాక్షి’తో పంచుకున్న చానెల్ విజయగాధ విశేషాలు ఆయన మాటల్లోనే.. మాది ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. అమ్మా, నాన్న, నేను. చిన్న ఫ్యామిలీ. నాన్న సన్యాసి ఆచారీది పౌరోహిత్యం. ఇంటర్ వరకు విజయనగరంలో చదువుకున్నా. డిగ్రీ మొదటి సంవత్సరంతో ఆపేశాను. నన్ను కూడా ఈ వృత్తిలోకి రమ్మన్నారు. కానీ, నిర్ణయం నా ఇష్టానికే వదిలేశారు. నిజానికి నాకు చదువు మీద కంటే సినిమాల మీదే మోజు ఎక్కువగా ఉండేది అప్పట్లో. ఆ రంగంలో ఏదో ఒకటి చేయాలని హైదరాబాద్ వెళ్లా. ఆత్మీయుల సలహాతో వీఎఫ్‌ఎక్స్ కోర్సులో చేరా. నాలుగేళ్లలో డిగ్రీ వచ్చింది. స్నేహితులతో కలిసి ఓ సంస్థ స్థాపించా.
ఇంతలో కరోనా వచ్చిపడింది. మిత్రుడు కార్తీక్ చిర్రా ఫిల్మీమోజీ పేరుతో యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. మొమోజీ కాన్సెప్ట్ కూడా కార్తీక్‌దే. అతనితో కలిసి విజయనగరంలోని ఫిల్మీమోజీ ఆఫీసు ప్రారంభించాం. మరికొందరు విజయనగరం మిత్రులతో కలిసి ఫిల్మీమోజీ కింద జిల్లా వాడుక భాషతో కార్యక్రమాలు రూపొందించాం. ముందుగా బాబీ, తర్వాత మిడిల్ క్లాస్ మధు, ఆ తర్వాత మాదాపూర్ మహేష్ వంటి క్యారెక్టర్లను సృష్టించాం. కొద్దిరోజుల్లోనే మా ప్రోగ్రామ్‌లను లక్షమంది వీక్షకులు చూడడంతో యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ షీల్డ్ వచ్చింది. ఆ తర్వాత 12 లక్షల మంది వీక్షకులు రావడంతో గోల్డ్‌బటన్ షీల్డ్ కూడా పంపించారు. దీంతో డైమండ్ షీల్డ్ కొట్టగలమనే నమ్మకంతో ఉన్నాం.
ఇటీవల రంజాన్ సందర్భంగా విడుదలైన ‘ఇఫ్తార్ విందు’కైతే స్పందన మామూలుగా లేదు. రాత్రి నెట్‌లో పెట్టి తెల్లారి లేచిచూస్తే దుమ్ముదులిపేసింది. ట్రెండింగ్‌లో టాప్ టూలో నిలిచింది. అలాగే, మా వీడియోలను రెగ్యులర్‌గా చూస్తున్నట్లు కొందరు నిర్మాతలు ఫోన్‌చేసి చెప్పడం ఎంతో ఆనందాన్నిచ్చింది. మేం తీసే క్యారెక్టర్లతోనే మంచి కథ రాసి పంపించమన్నారు.
వీరే మా టీమ్..
అసోసియేట్ రైటర్ నవీన్ వర్మ, రైటింగ్ అసిస్టెంట్ రత్నకుమార్, ఎడిటర్ సుస్మిత, అసోసియేట్ ఎడిటర్ ఐశ్వర్య, నిర్మాత కార్తీక్ చిర్రా. మాకు ఇంత సక్సెస్ రావడానికి వీరి సహకారమే కారణం. వీళ్లే ఫిల్మీమోజీకి మూలస్తంభాలు. అనుకరణలూ వచ్చేశాయి.. ఇంత క్రేజ్ సంపాదించిన ఫిల్మీమోజీకి ఇప్పుడు అనుకరణ ఛానెల్స్ దాపురించాయి. పాత్రలను అచ్చుగుద్దినట్లుగా దింపేస్తున్నారు.
అయినా వీటివల్ల మాకేమీ ఇబ్బందిలేదని ఫిల్మీమోజీ చానెల్ స్థాపించిన కార్తీక్ చిర్రా ధీమాగా చెబుతున్నారు. మేం మొదలుపెట్టిన దానివల్ల మరో పదిమంది బతుకుతున్నారని అనుకుంటామని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ఫిల్మీమోజీకి వచ్చిన రెస్పాన్స్‌తో ‘ఓటీటీ’ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నామని.. ఈ నెలలో మరో చానల్ పెడతామని కార్తీక్ తమ భవిష్యత్ ప్రణాళికను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment