సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి పైరవీలు, అవినీతికి తావులేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య నిస్వార్థంగా పనిచేస్తున్న వలంటీర్లను ప్రభుత్వం వరుసగా మూడో ఏడాదీ సత్కరించనుంది. కనీసం ఒక ఏడాది పాటు వలంటీరుగా పనిచేస్తూ ఎలాంటి ఫిర్యాదుల్లేని వలంటీర్లను ప్రభుత్వం సత్కరించి నగదు బహుమతి అందజేయనుంది.
ఈ నెల 19న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి దాదాపు నెలరోజుల పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాల వారీగా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రోజుకు రెండు సచివాలయాల పరిధిలో వలంటీర్ల సత్కారాల కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యాచరణను సిద్ధంచేసింది. ఈ మేరకు సచివాలయాల వారీగా షెడ్యూల్‌లను సిద్ధంచేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని కోరారు.
ఏటా సత్కారాలు..
సీఎం వైఎస్ అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే అంటే 2019 ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విమర్శకులు సైతం మెచ్చుకునేలా గత మూడున్నరేళ్లుగా వీరు ప్రజలతో మమేకమయ్యారు. దీంతో ఈ వ్యవస్థ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కేవలం గౌరవ వేతనంతోనే నిస్వార్థంగా పనిచేస్తున్న వీరి సేవలను గుర్తిస్తూ ఏటా ‘వలంటీర్లకు వందనం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వారికి సత్కారాలు చేస్తోంది. తొలిసారి 2020–21కి గాను 2021 ఏప్రిల్ 14న.. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 7 నుంచి నెల రోజులపాటు ఈ కార్యక్రమాలు కొనసాగాయి.
మూడు రకాల అవార్డులతో పాటు నగదు పురస్కారాలు..
- ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున వలంటీర్లకు ‘సేవావజ్ర’ అవార్డును అందజేస్తారు. ఇది అందుకునే వారిని రూ.30వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సరి్టఫికెట్‌తో సత్కరిస్తారు.
- అలాగే, ప్రతి మండలం, మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున, నగర కార్పొరేషన్‌కు 10 మంది చొప్పున వలంటీర్లకు ‘సేవారత్న’ అవార్డును అందజేస్తారు. ఈ అవార్డు పొందే వారికి రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, బ్యాడ్జి, శాలువా, సరి్టఫికెట్లను ఇస్తారు.
- కనీసం ఏడాది పాటు సరీ్వసు కాలం పూర్తిచేసుకుని ఎలాంటి ఫిర్యాదుల్లేకుండా పనిచేసే మిగిలిన గ్రామ, వార్డు వలంటీర్లకు ‘సేవామిత్ర’ అవార్డు అందజేస్తారు. ఈ అవార్డుతో పాటు రూ.10 వేల బహుమతిని అందజేస్తారు.
- ఇలా 2021లో రాష్ట్రవ్యాప్తంగా 2,20,993 మంది వలంటీర్లను ప్రభుత్వం సత్కరించగా, 2022లో 2,33,333 మందిని సత్కరించింది. ఈ ఏడాది కూడా ప్రస్తుతం పనిచేసే మొత్తం వలంటీర్లలో దాదాపు 90 శాతం మందికి పైగా ఏదో ఒక అవార్డు పొందుతారని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు వెల్లడించారు.
- వలంటీర్ల పనితీరుపై ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తంచేస్తున్న సంతృప్తి.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వలంటీర్ల హాజరు.. ప్రతినెలా మొదటి రోజునే వంద శాతం లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ.. వివిధ సంక్షేమ పథకాల అమలులో వలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు, వివరాల నమోదు తదితర అంశాల ఆధారంగా పనితీరు అంచనావేసి సేవావజ్ర, సేవారత్న అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: పవన్ గాలి తీసేసిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment