
మదనపల్లె : గొడవలో భాగంగా అడ్డుపడిన మహిళపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసి బంగారు నగలు, నగదు లాక్కెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. బాధితురాలు తెలిపిన మేరకు వివరాలు.. మదనపల్లె మండలం కొండామర్రిపల్లె పంచాయతీ సత్యసాయికాలనీకి చెందిన శ్రీనివాసులు భార్య నరసమ్మ (50) కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. ఇటీవల తన పుట్టినిల్లు అయిన కురబలకోట మండలం నల్లగుట్లపల్లె దళితవాడకు వెళ్లింది.
ఈ క్రమంలో ఆమె సోదరుడు శంకర, అదే గ్రామానికి చెందిన యల్లమ్మ కుమారుడు నరసింహులు, వేణుగోపాల్ డ్వాక్రా అప్పు చెల్లించే విషయమై గొడవ పడుతుండగా నరసమ్మ అడ్డుపడుతోంది. దీంతో ఆవేశానికి గురైన నరసింహులు, వేణుగోపాల్, మరికొందరు కలిసి మూకుమ్మడిగా ఆమెపై దాడి చేశారు. చెవి తెగిపోయి తీవ్రంగా గాయపడింది. తన ఎడవ చెవిలో ఉన్న బంగారు కమ్మ, పరుసులోని రూ.20 వేలు నగదు లాక్కెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. ఆమెను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దాడి ఘటనలో ఐదుగురిపై కేసు
నిమ్మనపల్లె : ఓ కుటుంబంపై దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ రమేష్‌బాబు తెలిపారు. గత మార్చి 26వ తేదీన వెంగంవారిపల్లె పంచాయతీ బాలియునిపల్లెలో జరిగిన చౌడేశ్వరీదేవి జాతరకు మదనపల్లెకు చెందిన అమరావతి భర్త వెంకటరమణతో కలిసి బంధువుల ఇంటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో కొమ్మిరెడ్డిగారిపల్లె సమీపంలో మదనపల్లెకు చెందిన చెంగల్రాయుడు అతని భార్య రమాదేవి, కుమారుడు బాలాజీ, నవీన్, కుమార్తె జయంతి కలిసి అమరావతి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన అమరావతి మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందింది. మెరుగైన చికిత్సల కోసం స్విమ్స్ ఆసుపత్రిలో చేరింది. శనివారం దాడి ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.