Yellow Media Drama On Ramoji Rao Margadarsi Chit Fund Fraud Case - Sakshi
Sakshi News home page

చట్టాలకు రామోజీ అతీతుడా! చట్టాన్ని ఇప్పుడే తెచ్చినట్లుగా ఎల్లో మీడియా పెడబొబ్బలు

Published Tue, Apr 11 2023 1:52 AM | Last Updated on Tue, Apr 11 2023 2:40 PM

Yellow Media Drama On Ramoji Rao Margadarsi Chit Funds Issue - Sakshi

సాక్షి, అమరావతి: ఇది నా దేశం... అనుకున్న వాళ్లెవరైనా ఇక్కడి చట్టాలను గౌరవించి తీరాలి. ఆ చట్టాలకు లోబడే పనిచేయాలి. అసలు ఒక వ్యాపారం చేస్తూ... ఆ వ్యాపారాన్ని ఏ చట్టం కింద రిజిస్టర్‌ చేశారో ఆ చట్టం తనకు తెలియనే తెలియదని... దాన్ని తాను పాటించనని నిస్సిగ్గుగా... నిర్భీతిగా చెప్పే మనుషులను ఏం చేయాలి? తమకు ఏ చట్టాలూ వర్తించవని చెప్పే పెద్ద మనుషుల్ని ఏమనాలి?  

ఇక్కడైతే చెరుకూరి రామోజీరావు అనో... చెరుకూరి శైలజా కిరణ్‌ అనో పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే నాటి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ నుంచి నేటి మార్గదర్శి చిట్స్‌ వరకూ... మేం డిపాజిట్లు సేకరించలేదని కానీ, మేం నిధులు మళ్లించలేదని గానీ వాళ్లు చెప్పటం లేదు. చట్టప్రకారం అలా చెయ్యకూడదు కదా? అంటే... ఆ చట్టాలేవీ తమకు వర్తించవంటున్నారు. ఆ చట్టాలు తాము పాటించబోమని చెబుతు­న్నారు.

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో... ఆ కంపెనీ ద్వారా తాము చేసినవన్నీ చట్ట విరుద్ధమైన పనులే అని తేలటంతో... తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఏకంగా ఆ సంస్థనే మూసేశారు. ఇపుడు ఆ సంస్థే లేదు కదా? అని వాదిస్తున్నారు. ఒక బ్యాంకు తన వద్దకు వచ్చిన డిపాజిట్లను ఇష్టం వచ్చినట్లు సొంత అవసరాల కోసం వాడేయొచ్చా? సొంత కంపెనీల్లోకి మళ్లించొచ్చా? అలా మళ్లిస్తే బ్యాంకు కుప్పకూలిపోదా? కృషి, చార్మినార్‌.. ప్రుడెన్షియల్‌ బ్యాంకుల నుంచి బిచాణా ఎత్తేసిన బ్యాంకులన్నీ ఇలా చేసినవే కదా?  

మార్గదర్శి చిట్స్‌లో ప్రస్తుతం వేలకోట్ల రూపాయల మనీ లాండరింగ్, అక్రమ నిధుల మళ్లింపు జరుగుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రబుత్వం విచారణ జరుపుతోంది. నిజాలు బయటికొస్తున్నాయి. కానీ దీన్ని ఈ నిజాలు వెలుగుచూడకుండా 86 ఏళ్ల రామోజీరావు కొత్త నాటకానికి తెరతీశారు. ‘ఈనాడు’ పత్రికను అడ్డంపెట్టుకుని, తటస్థుల ముసుగులో తన వాళ్లను తెరపైకి తెస్తున్నారు.

అడ్డగోలు బుకాయింపులకు దిగుతున్నారు. మార్గదర్శిపై ఏ ఒక్క ఫిర్యాదూ రాలేదు కదా? అలాంటపుడు సీఐడీ విచారణ ఎందుకంటున్నారు. ‘ఈనాడు’ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నందుకే ప్రభుత్వం కక్ష గట్టి ఇలా చేస్తోందని... తన వాళ్లచేత కేంద్రానికి లేఖలు కూడా రాయిస్తున్నారు.  

ఇక్కడ మార్గదర్శిలో చిట్లు వేస్తున్నవారు, డిపాజిటర్లు గమనించాల్సింది ఒక్కటే. యావత్తు దేశాన్ని కుదిపేసి దివాలా తీసిన శారదా చిట్‌ఫండ్స్‌గానీ, వేల మందిని ముంచేసిన సుదర్శన్‌ చిట్స్‌గానీ కూలిపోవటానికి ముందు చాలా బలంగా కనిపించినవే కదా? కూలిపోయేదాకా వాటిపై ఎవ్వరూ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదే!!. ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోబట్టే... చట్టాలు ఉల్లంఘిస్తున్నా అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్లే అవి కుప్పకూలాయి. వేల మంది దాచుకున్న కష్టార్జితాన్ని స్వాహా చేసేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్గదర్శి చిట్స్‌ను... చట్టప్రకారం నడుచుకోవాలని కోరటం తప్పా? చట్టాలను అనుసరించాలని అడగటం నేరమా? ఇదెక్కడి తీరు!!. 

అయినా డిపాజిట్లు సేకరించకూడదన్న ఆర్‌బీఐ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఎన్ని ఎన్‌బీఎఫ్‌సీలు మూతపడలేదు? కనీసం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎన్‌బీఎఫ్‌సీ కూడా కాదు. ఒక 50 మంది చిట్‌ సభ్యులుంటే... ప్రతినెలా ప్రతి ఒక్కరి దగ్గరా సొమ్ములు వసూలు చేసి.. వాటిని చిట్‌ పాడుకున్న ఎవరో ఒక్కరికి ఆ నెల్లోనే ఇవ్వటం దాని పని.

మరి ప్రతినెలా అలా ఎవరి చిట్ల డబ్బులు వాళ్లకు ఇచ్చేస్తున్నపుడు వేల కోట్ల రూపాయల మిగులు మొత్తాలు దానిదగ్గర ఎలా ఉంటాయి? వాటిని తన సొంత సంస్థల్లోకి మళ్లించే అధికారం ఎవరిచ్చారు? వాటిని స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఉల్లంఘనలు కావా?  

పత్రికాధిపతి... వ్యాపారవేత్త అనే రెండు టోపీల్ని రామోజీరావు ధరిస్తుంటారని... వ్యాపారాల్లో అక్రమాలేవైనా బయటపడినపుడి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోబోయినపుడల్లా... అది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ ఎదురుదాడికి దిగుతారని సాక్షాత్తూ ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానమే గతంలో చెప్పింది. గతమంతా రామోజీ చేసింది ఇదే. కాకపోతే ఇపుడలా మాటలు పనిచేయటం లేదు.

నమ్మేవారెవరూ లేరు. దీంతో ఆ మాటలు తాను చెప్పకుండా... తటస్థుల ముసుగులో తనకు కొమ్ముకాసే కొందరితో చెప్పిస్తున్నారు. అయినా అక్రమాలు చేస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై చర్యలు తీసుకుంటుంటే మధ్యలో ఈ తటస్థులెవరు? వీళ్లేమైనా మార్గదర్శిలో చిట్లు వేస్తున్నవారా? వీళ్లకేం సంబంధం? వీళ్లకసలు అక్రమాలకు పాల్పడుతున్న రామోజీని రక్షించే బాధ్యతను ఎవరిచ్చారు? రామోజీరావా... చంద్రబాబు నాయుడా? 

ఈ చట్టాలు చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాదే? 
కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టం–1982, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం–1999లను ఉల్లంఘించి నిధులు మళ్లించినట్టు, అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో ఆధారాలతో సహా వెల్లడైంది. చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆ శాఖ అధికారుల ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

దీన్ని వక్రీకరిస్తూ రామోజీరావు మీడియా, చంద్రబాబు పార్టీ గగ్గోలు పెడుతున్నాయి. నిజానికి ఈ రెండు చట్టాలూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసినవేమీ కావు. చిట్‌ఫండ్‌ చట్టాన్ని కేంద్రం 1982లో రూపొందించింది. ఇక ఏపీ డిపాజిటర్ల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తెచ్చింది 1999లో చంద్రబాబు ప్రభుత్వమే. వాటిని అమలు చేస్తుంటే... దాన్ని రామోజీరావుపై వేధింపులుగా వక్రీకరిస్తున్నారు. 

చిట్‌ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తే ఆ తరవాత దివాలాయే!! 
చిట్‌ఫండ్‌ చట్టాన్ని, డిపాజిటర్ల చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుందన్నట్టుగా రామోజీరావు, ఆయన మనుషులు, టీడీపీ ప్రజల్ని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. సామాన్యుల డబ్బు భద్రంగా ఉండటం కోసం చేసిన ఆ చట్టాలను ఉల్లంఘిస్తే ఏమవుతుందో... దేశంలో బట్టబయలైన ఎన్నో చిట్‌ఫండ్‌ కుంభకోణాలు, ప్రైవేట్‌ బ్యాంకుల ఆర్థిక దోపిడీలు నిరూపించాయి కూడా...  

శారదా చిట్‌ఫండ్‌... 4.90 లక్షల కోట్ల భారీ దోపిడీ 
2013లో బట్టబయలైన శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం దేశంలోనే సంచలనం సృష్టించింది. పశ్చిమబెంగాల్, అసోం, త్రిపురలలో డిపాజిట్‌దారుల నుంచి ఏకంగా 4.90 లక్షల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించింది. అధికవడ్డీల ఆశ చూపించి పోంజీ తరహా మోసానికి పాల్పడింది. 2013లో శారదా చిట్‌ఫండ్‌ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఏకంగా 17 లక్షల మంది ఆ సంస్థ ఖాతాదారులు నిండా మోసపోయారు.  మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కూడా పోంజీ తరహా మోసానికే పాల్పడుతోందని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సోదాల్లో వెల్లడి కావడం గమనార్హం.  

రూ.6,380కోట్ల అగ్రిగోల్డ్‌ కుంభకోణం 
చంద్రబాబు ప్రభుత్వ హయంలోనే రాష్ట్రంలో వెలుగుచూసిన మరో ఆర్థిక మోసం అగ్రిగోల్డ్‌. గొలుసుకట్టు తరహాలో 8 రాష్ట్రాల్లో ఏకంగా రూ.6,380 కోట్ల డిపాజిట్లు సేకరించింది. అందులో రూ.3,996కోట్లు డిపాజిట్లు ఆంధ్ర ప్రదేశ్‌లో సేకరించినవే. ఇష్టం వచ్చినట్లుగా నిధుల్ని మళ్లించి సంస్థ బోర్డు తిప్పేసింది. ఫలితం... కష్టార్జితాన్ని దాచుకున్న 32 లక్షల మంది డిపాజిట్‌దారులు రోడ్డునపడ్డారు.

వారిలో అత్యధికంగా 19.50 లక్షలమంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. అగ్రిగోల్డ్‌ సంస్థ అక్రమాలకు పాల్పడుతోందని గుర్తించినా నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ సంస్థకు చెందిన హాయ్‌లాండ్‌తోపాటు అమరావతిలో భూములను కొల్లగొట్టేందుకే చంద్రబాబు, లోకేశ్‌ ప్రాధాన్యమిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక దశలవారీగా డిపాజిటర్లకు చెల్లింపులు చేస్తూ వస్తోంది. 

పాతికేళ్ల కిందటే... ‘కృషి’ బ్యాంకు 
చంద్రబాబు సీఎంగా ఉండగా 2001లో కృషి బ్యాంకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఖాతాదారులను బురిడీ కొట్టించింది. అత్యధిక వడ్డీల ఆశ చూపించిన ఈ బ్యాంకు ఛైర్మన్‌ కొసరాజు వెంకటేశ్వరరావు... రూ.35కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టారు. అనధికారిక లెక్కల ప్రకారం ఈ డిపాజిట్లు రూ.100 కోట్లకుపైనే ఉంటాయని సమాచారం. కొసరాజు ఆ నిధులను ఇతర సంస్థల్లోకి అక్రమంగా మళ్లించి చివరికి 2001లో చేతులెత్తేసి విదేశాలకు పారిపోయాడు.  

ప్రుడెన్షినల్‌... పాపులర్‌.. ఏదైనా అంతే.. 
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 2003లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో వెలుగు చూసిన మరో భారీ ఆర్థిక మోసం... ప్రుడెన్షియల్‌ బ్యాంకు. ఏకంగా రూ.550 కోట్ల మేర డిపాజిట్‌దారులను మోసం చేసింది ఆ సంస్థ. ఇక కేరళ కేంద్రంగా డిపాజిట్లు సేకరించిన పాపులర్‌ ఫైనాన్స్‌ సంస్థ ఏకంగా రూ.2వేల కోట్లమేర డిపాజిటర్లను మోసం చేసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 274 బ్రాంచులతో కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ 2022లో బోర్డు తిప్పేసి డిపాజిటర్లను ముంచేసింది. 

వీటన్నింటినీ మించిపోయిన మార్గదర్శి... 
పైన పేర్కొన్న సంస్థలను తలదన్నే రీతిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతోందని ఆధారాలతో సహా వెల్లడైంది. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు గత ఏడాది నవంబరు, డిసెంబర్‌లలో మార్గదర్శి చిట్స్‌ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. అనంతరం సీఐడీ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సోదాల్లోనూ ఈ అక్రమాలు ధ్రువపడ్డాయి.
 
రశీదు ముసుగులో అక్రమ డిపాజిట్లు: చందాదారులు పాడిన చిట్‌ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 నుంచి 5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్‌ మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తుస్తోంది. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలకు విరుద్ధం. చిట్‌ఫండ్‌ కంపెనీలు డిపాజిట్లు స్వీకరించడం నేరం. మార్గదర్శి చిట్స్‌ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ‘ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఈ అక్రమ డిపాజిట్లు ఎన్ని వేల కోట్లు అన్నది లెక్కతేలాల్సి ఉంది. 

గతంలో రూ.15వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరణ: మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట అక్రమ డిపాజిట్లు సేకరించిన నేర చరిత్ర మార్గదర్శి గ్రూపునకు ఉంది. గతంలో అక్రమంగా సేకరించిన రూ.15వేల కోట్ల డిపాజిట్లపై ఆదాయపన్ను చెల్లించాలని ఆదాయపన్ను శాఖ నోటీసులు కూడా ఇచ్చింది. దాంతో హడావుడిగా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసేశారు. కేసు దర్యాప్తులో ఉండగా సంస్థను మూసివేయడం అంటే ఆధారాలను ధ్వంసం చేయడమే. అది క్రిమినల్‌ నేరం. 

చందాదారుల సొమ్ము సొంత పెట్టుబడిగా...: మార్గదర్శి చిట్స్‌కు మూడు అనుబంధ కంపెనీలున్నట్టుగా బ్యాలన్స్‌ షీట్లో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌–చెన్నై, మార్గదర్శి చిట్స్‌ (కర్ణాటక) ప్రైవేట్‌ లిమిటెడ్‌–బెంగళూరు, ఉషా కిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌– హైదరాబాద్‌లను అనుబంధ కంపెనీలుగా చూపించారు.

నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లించడానికే ఈ కథ. ఒక్క ఉషా కిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లోనే 88.5 శాతం వాటాకోసం పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది. అంటే రామోజీరావు కుటుంబం రూపాయి పెట్టకుండా...చందాదారుల సొమ్ముతోనే సొంత వ్యాపారాలు చేస్తున్నారు. అసలు చిట్‌ ఫండ్‌ కంపెనీలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం చిట్‌ ఫండ్‌ చట్టం–1982కు విరుద్ధం.  

► మార్గదర్శి చిట్స్‌ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్‌ రిస్క్‌ అత్యధికంగా ఉండే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడుతోంది. ఇది చిట్‌ ఫండ్‌ చట్టానికి విరుద్ధం.  

రికార్డుల కనికట్టు...: చట్ట విరుద్ధంగా చేస్తున్న ఈ మోసాన్ని కప్పిపుచ్చేందుకు మార్గదర్శి చిట్స్‌ రికార్డుల్లో భారీ అవకతవకలకు పాల్పడుతోంది.చందాదారుల సొమ్ము చెక్కుల రూపంలో తమ వద్ద ఉన్నట్టుగా బ్యాలన్స్‌షీట్‌లో చూపిస్తోంది. ఏటా మార్చి 31న వందల కోట్ల రూపాయలు చెక్కులు వచ్చినట్టు చూపిస్తోంది. కానీ ఆ చెక్కులు ఎన్నిరోజులైనా క్యాష్‌ కావు. అంటే... అవి బోగస్‌ చెక్కులన్నమాట. అప్పటికే ఆ సొమ్మును మనీ లాండరింగ్‌ చేసేశారన్నది స్పష్టంగా తెలియకమానదు. 

ఏపీ ప్రజల సొమ్ము... పెత్తనం పక్క రాష్ట్రంలో: రాష్ట్రంలో మార్గదర్శి చిట్స్‌కున్న 37 బ్రాంచీల్లో ఏడు బ్రాంచిల్లో చందాదారులు చెల్లించిన మొత్తం అక్కడి బ్యాంకుల్లో లేదు. ఆ సొమ్మంతా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రానికి తరలించేస్తున్నారు. రాష్ట్రంలోని మార్గదర్శి ఫోర్‌మేన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన చెక్‌ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలూ లేవు.

బ్యాంకు వ్యవహారాలు, చెక్‌ పవర్‌ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి ఎండీ శైలజతో పాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలలయంలోని 11మందికే ఉంది. ఇక్కడి చందాదారుల సొమ్ము భద్రత గురించి అడిగితే తనకు తెలియదని ఫోర్‌మెన్‌ చెబుతున్నారు. హైదరాబాద్‌ వెళ్లి అడిగితే... తెలంగాణలో ఉంది కనక అది ఏపీ అధికారుల పరిధిలోకి రాదని చెబుతున్నారు. మరీ ఏపీ చందాదారుల సొమ్ముకు బాధ్యులెవరని అడిగితే... సమాధానం లేదు. 

ఒక్క బ్యాంకు ఖాతా చాలట...: చిట్‌ఫండ్‌ సంస్థలు తాము నిర్వహించే ప్రతి చిట్టీకీ సంబంధిత బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. మార్గదర్శి దీన్ని పట్టించుకుంటే ఒట్టు. అన్ని చిట్లకూ ఒకే బ్యాంకు ఖాతా. ఏపీకి సంబంధించి ప్రత్యేక ఖాతా కూడా లేదు.  

ఇదో పోంజీ తరహా స్కామ్‌: మార్గదర్శి చిట్స్‌ పోంజీ స్కీమ్‌కు తక్కువేమీ కాదు. చిట్టీల్లో 30 – 40శాతం టికెట్లు(సభ్యత్వాలు) యజమాన్యానివే. వాటికి తన తరఫున చెల్లించాల్సిన చందాలను చెల్లించడం లేదు. కొత్త చిట్లు, ఇతర చిట్ల నుంచి వచ్చిన సొమ్మును తాము చెల్లించినట్టుగా రికార్డుల్లో చూపిస్తోంది. వాటిపై మళ్లీ 5 శాతం కమీషన్‌ తీసుకుంటోంది. అంటే... ఏ రోజైనా కొత్తగా వచ్చే చందాదారులు తగ్గినా, కొత్త చిట్లు ఆగినా మార్గదర్శి తన తరఫున చెల్లించాల్సిన చందాను చెల్లించే పరిస్థితి ఉండదు. అప్పుడు చిట్‌ పాడుకున్నవారికి సొమ్ము చెల్లించే అవకాశమూ ఉండదు. అదేరోజున దివాలా తీసే ప్రమాదం ఉంటుంది.  

ఒక్క రూపాయి చెల్లించకుండా...తమపేరిట చిట్టీలు 
సాధారణంగా ప్రతి చిట్‌కూ నిర్ణీత చందాదారుల సంఖ్య ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో తక్కువ మంది సభ్యులు (టికెట్లు) చేరితే కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. ఆ ఖాళీ టికెట్స్‌ను కంపెనీ తీసుకోవాలి. వాటి చందాను కంపెనీ చెల్లించాలి. తరవాత కొత్త చందాదారులు చేరితే ఆ మేరకు టికెట్స్‌ భర్తీ చేయొచ్చు. చిట్‌ఫండ్‌ చట్టంలోని ఈ నిబంధనలను మార్గదర్శి ఏనాడూ పట్టించుకోలేదు. గరిష్ఠంగా ఒకో గ్రూపులో 50 శాతం వరకూ టికెట్లు కంపెనీవే ఉన్నాయి. వాటికోసం మార్గదర్శి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. చిట్లపై తమకు వచ్చే డిస్కౌంట్ల మొత్తాన్ని డూప్లికేట్‌ చేసి అన్నిచోట్లా రికార్డుల్లో చూపిస్తోంది.  

నిధులు మళ్లించామని అంగీకరించిన రామోజీ 
సీఐడీ దర్యాప్తులో... తాము మార్గదర్శి చిట్స్‌ నిధులను ఇతర సంస్థలకు మళ్లించామని రామోజీరావే అంగీకరించారు. ఆధారాలతోసహా సీఐడీ అధికారులు ప్రశ్నించేసరికి ఆయన నోటమాట రాలేదు. దాంతో నిధులు మళ్లించింది వాస్తవమేనని అంగీకరిస్తూనే అది తమ ఆర్థిక ప్రణాళిక అన్నట్టుగా బుకాయించేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న రామోజీరావే అక్రమాలు నిజమేనని సమ్మతించిన తరువాత ... మళ్లీ వక్రీకరిస్తూ వితండవాదనలెందుకు? 

చట్టాలు తమకు వర్తించవన్న శైలజ... 
మామ కంటే రెండు ఆకులు ఎక్కువ చదివానన్నట్టుగా ఏ–2 చెరుకూరి శైలజ వ్యవహరించారు. అసలు చిట్‌ఫండ్‌ చట్టం తమకు వర్తించదని...తాము పట్టించుకోమని ఆమె సీఐడీ అధికారుల వద్దే వ్యాఖ్యానించడం తీవ్రమైన అంశమని నిపుణులు చెబుతున్నారు. కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నామన్న ఆమె... పోనీ ఆ చట్ట ప్రకారమైనా అనుబంధ కంపెనీలకు నిధుల మళ్లించడం నేరమే కదా అని అంటే మాత్రం సమాధానమివ్వలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement