మీడియాతో మాట్లాడుతున్న సీఐడీ అధికారులు రవికుమార్, శ్రీకాంత్
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించడంలేదని, అయినప్పటికీ తాము చట్టానికి లోబడే విచారణ జరుపుతున్నామని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఈనాడు, ఈటీవీ మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే సీఐడీ విచారణపై నిరాధార ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
ఆయన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఐజీ సీహెచ్ శ్రీకాంత్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము శైలజ కిరణ్‌ను ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని, .ఆమె పట్ల పూర్తి మర్యాదతో వ్యవహరించామని చెప్పారు. ఆమె భోజనం, టీ, మందుల కోసం అవసరమైన ప్రతిసారీ అవకాశం కల్పించామన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు కచ్చితమైన ఆధారాలు లభించాయని రవికుమార్ స్పష్టం చేశారు.
విచారణ కోసం మంగళవారం శైలజ కిరణ్ నివాసానికి వెళ్లినప్పుడు తమ సిబ్బందిలోని 10 మందిని అనుమతించకుండా అభ్యంతరం తెలిపారన్నారు. ఆర్థిక అక్రమాలను సంబంధించి ఆధారాలపై ప్రశ్నించాల్సిన సాంకేతిక అధికారులను అడ్డుకునేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది ప్రయత్నించారని తెలిపారు. తాము చట్టం పరిధిలోనే విచారిస్తున్నప్పటికీ శైలజ కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకుండా పదే పదే ఆటంకాలు కల్పించేందుకు యత్నించారని చెప్పారు.
అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీగా పూర్తి సమాచారాన్ని ఆమె వద్ద ఉంచుకోలేదని, ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారని తెలిపారు. ఎండీ వద్ద పూర్తి సమాచారం ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆమె వ్యాఖ్యానించారని చెప్పారు. చట్టానికి విరుద్ధంగా నిధుల మళ్లింపుపై వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఆమె పదే పదే ప్రయత్నించారన్నారు. విచారించిన ప్రతిసారీ ఏదో సాకుతో తప్పించుకోవాలన్నదే ఆమె ఉద్దేశంగా ఉందన్నారు.
శైలజ కిరణ్ పదే పదే ఆటంకాలు కల్పిస్తుండటంతో తాము అడగాల్సిన ప్రశ్నల్లో 25 శాతం కూడా అడగలేకపోయామని వివరించారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తామని తెలిపారు. ఈ కేసులో రామోజీరావును కూడా మరోసారి విచారిస్తామని చెప్పారు. చందాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిధులు రూ.793.50 కోట్లను ఆటాచ్ చేసేందుకు న్యాయస్థానంలో త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment