Margadarsi Chit Funds MD Sailaja Kiran In CID Investigation - Sakshi
Sakshi News home page

Margadarsi: అవును.. మళ్లించాం

Published Fri, Apr 7 2023 4:17 AM | Last Updated on Fri, Apr 7 2023 11:33 AM

Margadarsi Chit Funds MD Sailaja Kiran In CID investigation - Sakshi

విచారణ అనంతరం శైలజా కిరణ్‌ నివాసం నుంచి బయటకు వస్తున్న సీఐడీ అధికారులు

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా సొంత కంపెనీలకు మళ్లించినట్టు సీఐడీ విచారణలో శైలజా కిరణ్‌ దాదాపుగా అంగీకరించారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు ఇప్పటికే నిధులు మళ్లించామని సీఐడీ విచారణలో పరోక్షంగా అంగీకరించారు. తాజాగా చెరుకూరి శైలజ కూడా నిధులు మళ్లించినట్టు సమ్మతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దేశంలో చట్టాలకు తాము అతీతం అన్నట్టుగా ఆమె సీఐడీ అధికారుల ఎదుటే అడ్డగోలుగా వాదించడం విస్మయపరుస్తోంది.

చిట్‌ఫండ్స్‌ వ్యాపారం చేస్తూ కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం తమకు వర్తించదని దబాయించడం రామోజీరావు, ఆయన కుటుంబం బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఐడీ అధికారులకు రికార్డులు చూపించబోమని శైలజా కిరణ్‌ భీష్మించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజను సీఐడీ అధికారులు గురువారం హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఆమె నివాసంలో విచారించారు.

సీఐడీ ఎస్పీ అమిత్‌ బర్దర్, విచారణ అధికారి రవికుమార్‌లతోపాటు 25 మంది అధికారుల బృందం గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారించింది. శైలజ తరపున ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులతోపాటు తెలంగాణ హైకోర్టు న్యాయవాది కూడా విచారణ ప్రక్రియ సమయంలో ఉన్నారు.

నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిన విచారణ ప్రక్రియను సీఐడీ అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేశారు. దాదాపు 75 ప్రశ్నలకు వివరాలు రాబట్టి వాంగ్మూల పత్రంపై శైలజ సంతకం తీసుకున్నారు. గతంలో తనిఖీల్లో కనుగొన్న ఆధారాలకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా శైలజ నుంచి పలు కీలక విషయాలను సీఐడీ అధికారులు రాబట్టినట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విచారణలో ఆమె వెల్లడించిన విషయాలు ఇలా ఉన్నాయి...

చందాదారుల సొమ్మును మళ్లించాం
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో తనిఖీల్లో సేకరించిన పలు కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ సీఐడీ అధికారులు శైలజను విచారించారు. ప్రధానంగా చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా సొంత పెట్టుబడులుగా పెట్టడం, మ్యూచ్‌వల్‌ ఫండ్స్, షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడంపై ప్రశ్నించినట్లు  సమాచారం.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నిధులను రామోజీ గ్రూపునకు చెందిన ఉషాకిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ (కర్ణాటక)– బెంగళూరు, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌–చెన్నైలలో అక్రమ పెట్టుబడులు పెట్టినట్టు బ్యాలన్స్‌ షీట్‌ నోట్‌ నంబర్‌ 40లో పేర్కొన్న విషయాన్ని ఆమెకు చూపించారు.

ఉషాకిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఏకంగా 88.5 శాతం వాటా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ పేరిటే ఉంది. ‘‘అవును.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నిధులను ఆ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాం..’ అని శైలజ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసులో ప్రధాన అభియోగమైన అక్రమంగా నిధుల మళ్లింపునకు సంబంధించి సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించినట్లైంది.

కంపెనీల చట్టం అనుసరిస్తామంటూ... అంతలోనే తెలీదంటూ
సీఐడీ అధికారులు అదే విషయంపై గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో తాము కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నామని శైలజ పేర్కొనట్లు సమాచారం. చిట్‌ఫండ్స్‌ వ్యాపారానికి కంపెనీల చట్టంతో నిమిత్తం లేదని, అనుసరించాల్సింది కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం–1982 కదా? అని అధికారులు ప్రశ్నించగా ఆమె సమాధానం ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది.

పోనీ కంపెనీల చట్టాన్ని అనుసరిస్తున్నారని భావించినా... ఉషాకిరణ్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 88.5 శాతం వాటాతోపాటు మరో రెండు కంపెనీల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ పెట్టుబడులు పెట్టినట్టు బ్యాలన్స్‌ షీట్‌లో చూపించారు కదా? అని అధికారులు ప్రశ్నించడంతో అవునని ఆమె సమాధానమిచ్చారు.

కంపెనీల చట్టం ప్రకారం 50 శాతానికి మించి వాటా  కలిగి ఉంటే అనుబంధ కంపెనీగానే పరిగణిస్తారు కదా? అని తిరిగి ప్రశ్నించగా అందుకు కూడా ఆమె అవుననే సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది.

అంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నిబంధనలకు విరుద్ధంగా మరో రెండు కంపెనీల్లో 88 శాతం పెట్టుబడులు పెట్టి అనుబంధ కంపెనీగా ఉన్నట్టే కదా? అని సీఐడీ అధికారులు ప్రశ్నించగా ఆమె మౌనం వహించినట్టు సమాచారం. అటు చిట్‌ఫండ్స్‌ చట్టం.. ఇటు కంపెనీల చట్టాన్ని కూడా యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్టు ఆమె సమ్మతించినట్టైంది. 

ఏటా మార్చి 31న రూ.వందల కోట్ల చెక్కులు..
విచారణ సందర్భంగా సీఐడీ మరో కీలక ఆధారాన్ని సేకరించింది. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మళ్లిస్తున్న రామోజీరావు, శైలజ రికార్డుల్లో మాత్రం చట్టాన్ని ఏమార్చేందుకు యత్నించారని నిరూపితమైంది. 2022 మార్చి 31న రూ.255 కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్యాలన్స్‌ షీట్‌లో చూపించారు.

కానీ ఆ చెక్కులేవీ తరువాత నగదుగా మారినట్లు (ఎన్‌క్యాష్‌)గా రికార్డుల్లో లేవని సీఐడీ అధికారులు గుర్తించారు. గరిష్టంగా పది రోజుల్లో చెక్కులను నగదుగా జమ చేస్తామని శైలజ పేర్కొన్నారు. మరి గతేడాది మార్చి 31న వచ్చినట్లు చూపించిన రూ.255 కోట్ల చెక్కులేవీ నగదుగా మారినట్లు రికార్డుల్లో ఎందుకు లేవని సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో శైలజ తెల్లమొహం వేశారని సమాచారం.

కొన్ని దశాబ్దాలుగా ఏటా మార్చి 31న రూ.వందల కోట్ల విలువైన చెక్కులు వచ్చినట్లు రికార్డుల్లో చూపుతున్నా అవి నగదుగా మాత్రం మారడం లేదు. ఎందుకంటే ఏటా  చందాదారులు చెల్లిస్తున్న రూ.వందల కోట్లను మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా సొంత ప్రయోజనాలకు మళ్లిస్తోంది.

ఆర్థిక సంవత్సరం చివరిలో ఆ నిధులు ఉన్నట్లుగా చూపించాల్సి రావడంతో చెక్కులు వచ్చినట్లు చూపించి కనికట్టు చేస్తోంది. ఆ నిధులను రామోజీరావు కుటుంబ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. సీఐడీ అధికారుల దర్యాప్తులో మార్గదర్శి ఆడిటర్‌ శ్రావణ్‌ ఇదే విషయాన్ని అంగీకరించారు. 

ప్రధాన కార్యాలయంలో ఉన్నాయి కానీ.. చూపించను
లేని చెక్కులు ఉన్నట్టుగా చూపించి మోసానికి పాల్పడినట్టు నిరూపితం కావడంతో శైలజ షాక్‌కు గురయ్యారు. దాంతో సీఐడీ అధికారులను పక్కదారి పట్టించేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. ‘ఆ చెక్కుల సమాచారం అంతా ప్రధాన కార్యాలయంలో ఉంటుంది... నాకు తెలీదు’ అని పేర్కొన్నారు. అక్కడకు వెళ్లి పరిశీలిద్దామని సీఐడీ అధికారులు సూచించగా ఆమె నిరాకరించారు.

పోనీ మార్గదర్శి సిబ్బంది ద్వారానైనా ఆ వివరాలు అందించాలని సూచించగా అందుకు కూడా ఆమె ఒప్పుకోలేదు. వీడియో రికార్డింగ్‌ ద్వారా పారదర్శకంగా చెక్కుల రికార్డులు పరిశీలిస్తామని చెప్పినా ఆమె ససేమిరా అన్నారు. అంటే చెక్కుల వివరాలు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రధాన కార్యాలయంలో కూడా లేవా? అని ప్రశ్నించగా ఆమె మౌనం దాల్చినట్లు సమాచారం. 

ఏపీ రికార్డులు ప్రత్యేకంగా లేవు 
చిట్‌ఫండ్స్‌ చట్టం ప్రకారం చిట్‌ఫండ్‌ కంపెనీలు ఏ రాష్ట్రానికి సంబంధించిన రికార్డులు ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిర్వహించాలి. అక్కడి చందాదారులు చెల్లిస్తున్న మొత్తం, చిట్టీల వివరాలు, ఆదాయ– వ్యయాలు, బ్యాలన్స్‌షీట్‌ను ప్రత్యేకంగా రూపొందించాలి. ఈ నిబంధనను మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ చందాదారులు చెల్లిస్తున్న మొత్తం, ఇతర వివరాలను తెలంగాణ, ఇతర రాష్ట్రాల రికార్డులతో పాటు కలిపి నిర్వహిస్తోంది.

మార్గదర్శి చందాదారుల్లో సింహభాగం అంటే 60 శాతం వరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే ఉన్నారు. ఆ నిధులను నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రామోజీరావు కుటుంబానికి చెందిన ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ రికార్డుల నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతోంది. ఇదే విషయాన్ని సీఐడీ అధికారులు ప్రస్తావించగా తాము అలాగే రికార్డులు నిర్వహిస్తామని శైలజ చెప్పినట్టు సమాచారం.  

నీళ్లు నమిలి... నీళ్లు తాగి
సీఐడీ అధికారులు నిబంధనలు పాటిస్తూ శైలజా కిరణ్‌ను విచారించారు. విచారణకు ఆమె ఏమాత్రం సహకరించకపోయినా సరే ఇబ్బంది పెట్టకుండా...ఒత్తిడి చేయకుండా ప్రశ్నలు సంధించారు. గురువారం రోజు మధ్యాహ్నం వరకు సాగిన మొదటి విడతలో చాలా ప్రశ్నలకు నాకు తెలియదు.. గుర్తులేదు...నాకు సంబంధం లేదు అంటూ ఆమె సమాధానాలు దాటవేసేందుకు యత్నించారు. మధ్యాహ్న భోజన విరామం తరువాత సీఐడీ అధికారులు విచారణ జోరు పెంచారు.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను ఆమె ముందు ఉంచుతూ ఒక్కొక్క అంశంపై ప్రశ్నించారు. దీంతో శైలజకు నోట మాట రాలేదు. కాదు అని చెప్పేందుకు అవకాశం లేదు. ఎదురుగా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. దాంతో చాలా ప్రశ్నలకు ఆమె నీళ్లు నమిలినట్లు  సమాచారం. విచారణ సందర్భంగా ఆమె పలుసార్లు తనకు దాహం వేస్తోందంటూ బయటకు వెళ్లి వచ్చారు. తమ ఆడిటర్లు, ఇతరులతో సంప్రదించి వచ్చి నాకు తెలియదు.. గుర్తు లేదు అని సమాధానాలు దాటవేసేందుకు యత్నించారు. 

చూపు సరిగా లేదు.. కనిపించడం లేదు
మార్గదర్శి కార్యాలయాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను ల్యాప్‌టాప్‌లో సీఐడీ అధికారులు శైలజకు చూపించారు. నిధులు మళ్లించినట్టు అందులో ఉన్న వివరాలను చూపిస్తూ అవి వాస్తవమేనా? అని అడిగారు. అయితే ఆ పత్రాలు తనకు కనిపించడం లేదని... అక్షరాలు చిన్నవిగా ఉన్నాయని ఆమె పేర్కొనడంతో సీఐడీ అధికారులు ల్యాప్‌టాప్‌లో ఎన్‌లార్జ్‌ చేసి మరీ చూపించారు.

‘నాకు చూపు సరిగా లేదు... ఆ పత్రాల్లో ఏముందో కనిపించడం లేదు’ అని శైలజ పేర్కొనడంతో సీఐడీ అధికారులు విచారణ ప్రక్రియలో మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిని పిలిచి ఆ పత్రాలు చూపించారు. అవి తనకు కనిపిస్తున్నాయని ఆయన చెప్పడంతో పాటు అందులో ఏముందో చదివి వినిపించారు. దీంతో తనకు ఏమీ కనిపించడంలేదని తప్పించుకునేందుకు శైలజ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

మాకు ఏ చట్టాలు వర్తించవు.. మా చట్టం మాకుంది
చందాదారులు చెల్లించిన నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడం కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టం–1982కు వ్యతిరేకం కదా...! ఆ చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం అందుకు రెండేళ్లు జైలు శిక్ష పడుతుందని తెలుసు కదా..? అని సీఐడీ అధికారులు శైలజను ప్రశ్నించారు. అయితే అసలు చిట్‌ఫండ్స్‌ చట్టమే తనకు తెలియదని ఆమె చెప్పడంతో సీఐడీ అధికారులు విస్తుపోయారు.

చిట్‌ఫండ్స్‌ కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న మీకు అసలు చిట్‌ఫండ్స్‌ చట్టమే తెలియదా? అని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. చిట్‌ఫండ్స్‌ చట్టం– 1982ను తాము అనుసరించబోమని ఆమె సమాధానం ఇవ్వడంతో నివ్వెరపోవడం సీఐడీ అధికారుల వంతైంది.

మరి చిట్‌ఫండ్స్‌ వ్యాపారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించగా.. మా చట్టాలు మాకున్నాయి... వాటి ప్రకారం చేస్తున్నాం అని ఆమె బదులిచ్చినట్లు సమాచారం. చిట్‌ఫండ్స్‌ కంపెనీలు అక్రమాలకు పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వం 1982లోనే చేసిన చట్టం గురించి కూడా తెలుసుకోకుండా... అసలు ఆ చట్టాన్ని పట్టించుకోకుండా చిట్‌ఫండ్స్‌ వ్యాపారం చేస్తున్నామని శైలజ చెప్పడం గమనార్హం. 

రామోజీ, శైలజను అమరావతిలో విచారిస్తాం
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–1 చెరుకూరి రామోజీరావు, ఏ–2 శైలజను త్వరలో అమరావతిలో మరోదఫా విచారిస్తాం. ఈ కేసులో ఇప్పటికే వారిద్దరినీ విచారించి వాంగ్మూలాలు నమోదు చేశాం. వాటిని విశ్లేషించిన అనంతరం మరి కొన్నిసార్లు విచారించాల్సి ఉంటుంది.

ఈసారి వారిద్దరూ విచారణ కోసం అమరావతికి రావాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు విచారణ కొనసాగుతోంది. శైలజ ఈ నెల 13న విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆమెకు ఇప్పటికే సమాచారమిచ్చాం. ఈదఫా ఆమెను అమరావతిలో విచారిస్తాం’
– అమిత్‌ బర్దర్, ఎస్పీ, సీఐడీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement