సాక్షి, అమరావతి/కడప అర్బన్: మహిళలకు ఆపద వస్తే రాష్ట్రంలోనే కాదు.. దేశంలో ఏ మూలనున్నా వారిని క్షణాల్లో సురక్షితంగా కాపాడతానని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘దిశ’ యాప్ చాటిచెప్పింది. రాష్ట్ర పోలీసులు సైతం అదే స్థాయిలో స్పందించడం యాప్ విశిష్టతకు అద్దంపడుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఆ వివరాలు.. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఓ యువతి ఢిల్లీలో ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసేందుకు ఈ నెల 10న విజయవాడ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయల్దేరింది. ఆమె ఢిల్లీలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లాల్సి ఉంది. రైలులో ఆమెకు ఢిల్లీకి చెందిన దంపతులు పరిచయమయ్యారు.
ఈ నెల 11 తెల్లవారుజామున ఢిల్లీలో దిగిన తరువాత ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లేందుకు వీలుగా ఆ దంపతులే ఓ ఆటో డ్రైవర్‌తో మాట్లాడారు. ఆటో ఎక్కాక.. ఆ దంపతులకు ఫోన్‌చేస్తే వారు చెప్పిన చోట దింపుతానని ఆ డ్రైవర్ అన్నాడు. కానీ, ఆ యువతి వద్ద వారి ఫోన్ నంబరులేదు. దాంతో ఢిల్లీలోని తన స్నేహితురాలికి ఫోన్‌చేసి డ్రైవర్‌కు ఇచ్చింది. కానీ, ఆ విషయం తెలీని ఆటో డ్రైవర్ ఆ దంపతులే మాట్లాడుతున్నారని భావించి ఏవేవో విషయాలు మాట్లాడారు. ఏదో కోడ్ భాషలో చేర్చాల్సిన ప్రదేశం గురించి మాట్లాడుతుండటంతో ఆ యువతి స్నేహితురాలికి అనుమానం వచ్చింది.
ఆ దంపతులు, డ్రైవర్ కలిసి ఆ యువతిని ఎక్కడికో దారి మళ్లిస్తున్నారని సందేహించింది. వెంటనే ఆటో దిగిపొమ్మని తన స్నేహితురాలికి చెప్పింది. ఇది పసిగట్టిన ఆటో డ్రైవర్.. యువతి చేతిలోని ఫోన్ లాక్కుని ఆటో స్పీడ్ పెంచాడు. ఆటో ఆపాలని ఆమె ఎంతచెప్పినా వినిపించుకోకుండా వెళ్తున్నాడు. దాంతో ఆమె అతనితో ఘర్షణ పడింది. అదను చూసి ఆమె ఆటో దిగేసింది. దీంతో ఆటోడ్రైవర్ కిరాయి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రైల్వేస్టేషన్‌లో పోలీసుల దగ్గర ఇస్తాను రమ్మంటూ సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ఫోన్‌ను ఆటోవాలా నుంచి లాక్కుని పరుగుతీసింది. వెంటనే అక్కడి నుంచి ఆటో డ్రైవర్ పరారయ్యాడు. రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఆ యువతి ‘దిశ’ యాప్ ద్వారా ఎస్‌ఓఎస్ కాల్ చేసింది. వెంటనే వైఎస్సార్ కడప జిల్లాలోని ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబు అప్రమత్తమై ఆమె నుంచి వివరాలు సేకరించారు.
ఢిల్లీలో స్వచ్ఛంద సంస్థ సహకారం
అదే సమయంలో ‘దిశ’ డీఎస్పీ రవికుమార్ ఢిల్లీలోని ‘మిషన్ ముక్తి ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వీరేంద్రకుమార్‌సింగ్‌తో మాట్లాడారు. ఆయన రైల్వేస్టేషన్‌కు చేరుకుని తన వాహనంలో ఆ యువతిని బుధ్‌పూర్‌లోని ఉపాధ్యాయ నియామక పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లారు. పరీక్ష ముగిసిన తరువాత ఈ నెల 11 రాత్రి ఆమెను తిరిగి నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కించారు. ఆమె ఈ నెల 13 ఉదయం విజయవాడ చేరుకుని అక్కడ నుంచి పోరుమామిళ్లలోని తన గృహానికి క్షేమంగా చేరుకుంది. దిశ యాప్ ద్వారా సంప్రదించినప్పటి నుంచి ఆమె పరీక్ష రాసి క్షేమంగా తన ఇంటికి చేరుకునే వరకు వైఎస్సార్ జిల్లా పోలీసులు అడుగడుగునా ఆమెను పర్యవేక్షించారు. ఆమెకు ప్రయాణ, వసతి సౌకర్యాలన్నీ పోలీసులే స్వచ్ఛంద సంస్థ ద్వారా కల్పించారు.
‘దిశ’ ఓ వజ్రాయుధం
ఈ ఘటనపై వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న మహిళలకు ‘దిశ’ యాప్ ఓ వజ్రాయుధం వంటిదని అభివర్ణించారు. ఢిల్లీలో ఆపదలో ఉన్న రాష్ట్ర యువతికి ‘దిశ ’ యాప్ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. యువతులు, మహిళలు తప్పనిసరిగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. బాధిత యువతికి రక్షణ కల్పించేందుకు పూర్తిస్థాయిలో పర్యవేక్షించిన దిశ పోలీస్‌స్టేషన్ సిబ్బందికి రివార్డు అందిస్తామని ఎస్పీ తెలిపారు.
ఎస్పీ సాయం మరువలేను
జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఢిల్లీలో తనకు చేసిన సాయం ఎప్పటికీ మరువలేనని, జీవితాంతం ఏపీ పోలీసు శాఖకు రుణపడి ఉంటానని బాధితురాలు తెలిపింది. ఆపదలో ఉన్న మహిళలకు ‘దిశ’ యాప్ బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని.. దానిని తన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడంవల్లే క్షణాల్లో ఢిల్లీలో సైతం తాను మన పోలీసుల సాయం పొందగలిగానని ఆమె వివరించింది. తనను క్షేమంగా ఇంటికి చేరుకునేలా కృషిచేసిన పోలీస్ అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
‘దిశ’తో ఢిల్లీలోనూ తక్షణ రక్షణ
Published Wed, Sep 15 2021 2:47 AM | Last Updated on Wed, Sep 15 2021 1:46 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment