సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు ప్రసాదరావు మృతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘పామును పొడిచిన చీమలున్నా’యంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఓ మహాశిఖరంగా ఆయన నిలిచిపోతారు. వంగపండు మృతిపట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత)
ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారు: విజయసాయిరెడ్డి
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వంగపండు ప్రసాదరావు మృతికి సంతాపం ప్రకంటించారు. ‘ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు గారు మృతి తీరని లోటు. ఈ తెల్లవారుజామున మనల్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది. వందలాది జానపద గేయాలతో ఆయన ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ ట్వీట్ చేశారు.
గొప్ప కళాకారుడు వంగపండు: డిప్యూటీ సీఎం
ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతికి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన కళాకారుడు వంగపండు. ఆయన విజయనగరం జిల్లాలో మా ప్రాంత వాసి కావడం మా అందరికి గర్వకారణం. తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం నింపారు. 5 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తన పాటలతో వినిపించిన గొప్ప కళాకారుడు వంగపండు. ఆయన ఉత్తరాంధ్ర గళం. ఆయన మరణం యావత్ ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు. ఆయన కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి: తానేటి వనిత
వంగపండు ప్రసాదరావు మృతికి మంత్రి తానేటి వనిత సంతాపం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వంగపండు తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో ప్రజల్లో ఎంతో చైతన్యం కల్పించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment