ముంపు ప్రాంతాలను హెలికాఫ్టర్ నుంచి పరిశీలిస్తున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి
గోదారి జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటేనే భయం.ఇక్కడ వర్షం పడినా ... ఎగువన వర్షాలు కురిసినా గో‘దారి’వెంబడి గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోవల్సిందే. పంట పొలాలు నీట మునిగి రైతన్న మోమున విషాదం నింపుతుంది. గత టీడీపీ పాలకుల పాపం ఏజెన్సీ ప్రాంతాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. అధికారంలోకి రాగానే గమనించిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలతో ఉపశమనం చేకూరుతోంది. మంగళవారం జిల్లాలో ఏరియల్ వ్యూ ద్వారా వరద పరిస్థితిని పరిశీలించిన సీఎం అండగా నిలిచారు. జిల్లాలోకి వరద రాగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తోపాటు జిల్లా మంత్రులు వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు.
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: జిల్లాలో వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గోదావరికి వచ్చిన వరదలతో జిల్లా ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడం వారికి ఊరటనిస్తోంది. 14 ఏళ్ల తరువాత అత్య««ధికంగా గోదావరికి వరదలు రావడంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గతేడాది వరదలు వచ్చినప్పుడు కూడా ఇదే రకంగా వెనువెంటనే స్పందించి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ జిల్లా ప్రజలు మరిచిపోలేకున్నారు. ఈ క్రమంలోనే గడచిన రెండు రోజులుగా జిల్లాలో వరదల పరిస్థితిని సీఎం స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుతో మాట్లాడుతూ పునరావాస చర్యలపై తగు సూచనలిస్తూ వస్తున్నారు.
చూస్తూండగానే వరదల ఉద్ధృతి పెరిగిపోయి ఉగ్రరూపం దాల్చడంతో ముఖ్యమంత్రి నేరుగా ఇక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు మంగళవారం జిల్లాకు వచ్చారు. ప్రత్యేక చాపర్‌లో సీఎం దేవీపట్నం, కోనసీమలోని లంక గ్రామాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంతో వరద బాధితులకు మంచి జరుగుతుందనే భరోసా లభించింది. విహంగ వీక్షణ అనంతరం మధురపూడి ఎయిర్ పోర్టులో జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, కమిషనర్ అభిషిక్త్ కిశోర్‌తో వరదలు, తీసుకుంటున్న పునరావాస చర్యలపై సీఎంకు వివరించారు.
సీఎం సూచనలతో మనోధైర్యం
జిల్లాలో చేపడుతున్న పునరావాస చర్యలను జిల్లా కలెక్టర్ వివరించగా, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చెప్పిన నాలుగు మాటలు పెద్దలు చెప్పినట్టుగా తమకు చద్దిమూటలుగా కనిపిస్తున్నాయని వరద బాధితులు అభిప్రాయపడుతున్నారు. వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాలు, ప్రజలు తక్షణం కోలుకునేలా ఏర్పాట్లు పక్కా ప్రణాళికాబద్ధంగా జరగాలని సీఎం యంత్రాంగాన్ని ఆదేశించడం జిల్లా ప్రజలలో మనోధైర్యాన్నిచ్చింది. వరదలతో ముంపునకు గురైన రంపచోడవరం ఏజెన్సీలోని దేవీపట్నం, విలీన మండలాలు, అమలాపురం పార్లమెంటు పరి«ధిలోని మండలాల్లో వరదలు బీభత్సంతో దెబ్బతిన్న పరిస్థితులను వరదలు ముగిసిన రోజు నుంచి పది రోజుల్లో పునరుద్ధరించాలని టైంబౌండ్ పెట్టడం ద్వారా పనులు వేగవంతంగా జరిగే ఏర్పాటు చేయడంగా వరద బాధితులు భావిస్తున్నారు. తీసుకోవాల్సిన విపత్తు నివారణ చర్యలపై కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి సీఎం దిశా నిర్దేశం చేయడం గమనార్హం.
ఏ సాయం అందలేదని, అర్హత ఉన్న ఏ ఒక్క బాధితుడూ ఎదురు చూడకూడని రీతిలో సహాయక చర్యలుండాలని పేర్కొనడం సీఎంకు బాధితుల పట్ల ఉన్న కమిట్‌మెంట్‌ను స్పష్టం చేస్తోందంటున్నారు. గడచిన రెండు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయి అంధకారంలో ఉన్న గ్రామాలకు తక్షణం విద్యుత్తు పునరుద్ధరణ, బాధితుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించాలని అధికార యంత్రాంగానికి హితబోధ చేయడం ద్వారా సీఎం జగన్ మనస్సున్న నేతగా అభివర్ణిస్తున్నారు. ముంపులో చిక్కుకున్న వారికి పునరావాస కేంద్రాలకు తరలింపు, సహాయ పడటం, నిత్యావసరాలు సరఫరాను కూడా స్వయంగా ఆయన తెలుసుకోవడం, సహాయక చర్యలకు డబ్బుల కోసం వెనక్కు చూడవద్దని చెప్పడం చూస్తుంటే బాధితులపై ఆయనకున్న కమిట్‌మెంట్‌ను తెలియజేస్తుందంటున్నారు.
జిల్లాలో పరిస్థితులను తాను పర్యవేక్షించడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ సహా జిల్లా మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణులను సీఎం పరుగులు పెట్టించారు. జిల్లాలోనే పర్యటిస్తూ దగ్గరుండి సహాయక చర్యలు చూసుకోవాలని సీఎం ఆదేశించడంతో ముగ్గురు మంత్రులు ఆగమేఘాలపై కోనసీమ లంక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి బాధితులకు మనోధైర్యాన్ని నింపారు. ముంపు ప్రాంతాల్లో పర్యటనను రద్దు చేసుకుని వచ్చేస్తారనే ముందుచూపుతో ఏరియల్ సర్వేకు వస్తున్న సందర్భంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరినీ రావద్దని ముందుగానే చెప్పడం ద్వారా బాధితులతో మమేకం కావాలనే సంకేతాలు పంపించారు. ఈ విషయాన్ని సీఎం ఏరియల్ సర్వేకు ముందు తాడేపల్లి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొనడం విశేషం. ముగ్గురు మంత్రులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కోనసీమలోని పలు గ్రామాల్లోని వరద బాధితులతో మమేకమవుతూ వారికి ధైర్యాన్ని నింపారు. ఎంపీలు అనురాధ, భరత్, కొత్తపేట, ముమ్మిడివరం, రాజానగరం, రాజోలు ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, పొన్నాడ, జక్కంపూడి, రాపాక, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు, మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ, అమలాపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వరద సహాయక చర్యల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment