శభాష్‌ వలంటీర్‌... సేవా సైన్యం.. | YS Jaganmohan Reddy Manasaputrika Volunteers system | Sakshi
Sakshi News home page

శభాష్‌ వలంటీర్‌... సేవా సైన్యం..

Published Sun, May 30 2021 3:56 AM | Last Updated on Sun, May 30 2021 2:09 PM

YS Jaganmohan Reddy Manasaputrika Volunteers system - Sakshi

అది కృష్ణా జిల్లా వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని వరలక్ష్మీపురం, తులసీ నగర్‌ ప్రాంతం. అక్కడ మొత్తం 123 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందులో మెజారిటీ కుటుంబాలు  తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులవే. అక్కడి వలంటీరు ఇంటింటి సర్వేకి వెళితే వలంటీర్ల సేవలు మాకేమీ వద్దంటూ వారి వివరాలు కూడా ఇవ్వలేదు. అయినా వలంటీర్‌ తన పని తాను చేసుకుంటూ పోయారు. ముఖ్యంగా కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా వలంటీర్లు అందిస్తున్న సేవలు చూసి ఆ ప్రాంతంలోని తెలుగుదేశం కుటుంబాలు విస్తుపోయాయి. వారిలో మార్పు వచ్చింది. తమ వివరాలు వారే స్వయంగా వలంటీర్‌కు అందజేశారు. ఇప్పుడు తమకు ఏ సమాచారం కావాలన్నా, ప్రభుత్వానికి సంబంధించి ఏ పని ఉన్నా వలంటీర్‌కు ఫోన్‌ చేస్తున్నారు. వలంటీర్లంటే జన్మభూమి తమ్ముళ్ల మాదిరిగా ఉంటారనుకుని పొరపాటుపడ్డామని ఒకరిద్దరు వ్యాఖ్యానించారు. వ్యవస్థలో వస్తున్న మార్పునకు ఇదో సూచిక..

అది గుంటూరు జిల్లా ఈపూరు మండలం అంగలూరు గ్రామం. ఈ గ్రామంలో నివాసముంటున్న పదర నాగేశ్వరరావు కుటుంబానికి అమ్మ ఒడి డబ్బు రెండుసార్లు అందింది. రైతు భరోసా పథకానికి కూడా అర్హత ఉండడంతో స్థానిక రైతు భరోసా కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాల్సిందిగా వలంటీర్‌ సమాచారమిచ్చారు. నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. ఇటీవలి ఎంపీటీసీ – జెడ్పీటీసీ ఎన్నికలలో ఆయన పోటీ చేశారు కూడా. ఎవరు ఏ పార్టీకి చెందినవారు అనే దానితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రమాణంగా ప్రభుత్వ పథకాలు అందరికీ చేరుతున్నాయనేందుకు ఇదో ఉదాహరణ..

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ల వ్యవస్థ అద్వితీయమైన సేవలందిస్తోంది. అనతికాలంలోనే దేశం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానసపుత్రిక ఇది. బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే 2.66 లక్షల మంది వలంటీర్ల నియామకాన్ని చేపట్టి వారికి నిర్దిష్టమైన బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు.  గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు అనుసంధానంగా వలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారమైనా.. సెలవు రోజైనా..  ఎండైనా, వానైనా లెక్క చేయకుండా వలంటీర్లు పూర్తి సేవా దృక్పథంతో విధి నిర్వహణలో పాల్గొంటున్నారు. కులమతాలు, రాజకీయాలు, ప్రాంతాలు, పార్టీలు, పైరవీలు, లంచాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయి. సంతృప్తస్థాయిలో లబ్ధిదారులకు అందుతున్నాయి. గడచిన రెండేళ్లలో 31 రకాల సంక్షేమ పథకాల ద్వారా రూ.1.25 లక్షల కోట్లు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లబ్ధిదారులకు చేరాయి. ఎక్కడా ఎలాంటి విమర్శలకు తావులేదు. లబ్ధిదారుల ఎంపిక మొదలు, ప్రభుత్వ సహాయం వారికి చేరే వరకు అంతా పారదర్శకమే.  

ప్రభుత్వ సమాచారం.. గంటలోనే అందరికీ..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి వంద ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. 

► వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకున్నా, ప్రకటించినా కేవలం గంట వ్యవధిలోనే రాష్ట్రంలోని ప్రజలందరికీ చేరుతోంది. ప్రతి వలంటీరు తమ  పరిధిలోని కుటుంబాలన్నింటితో వాట్సాప్, టెలిగ్రామ్‌లతో అనుసంధానమై ఉన్నారు.  ప్రభుత్వ నిర్ణయం కేవలం 5 నిమిషాల వ్యవధిలో రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు చేరిపోతోంది. గ్రామ, వార్డు సచివాలయాలు ఆ సమాచారాన్ని వెంటనే వలంటీర్లకు చేరవేస్తున్నాయి. ఆ తర్వాత ఆ సమాచారం రాష్ట్రంలోని 1.48 లక్షల కుటుంబాలకు చేరిపోతుంది. స్మార్ట్‌ ఫోను లేని కుటుంబాలకు వలంటీర్లు నేరుగా వెళ్లి తెలియజేస్తున్నారు. 

► కరోనా విపత్తు నేపథ్యంలో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జ్వరాలతో బాధపడే వ్యక్తులను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, కేవలం మూడు రోజుల వ్యవధిలో జర్వాలతో బాధపడే వారిని గుర్తించడంతో పాటు, వారందరికీ కరోనా టెస్టు చేయించే ప్రక్రియ పూర్తి చేశారు. 

► వలంటీర్ల వ్యవస్థ కారణంగా అందరికీ సమాచారాన్ని తెలియజేసి ఒకే రోజు రాష్ట్రంలో  6.28 లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్‌ జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండాలే గానీ, రాష్ట్రంలోని 5 కోట్ల మందికి కేవలం నెల రోజుల వ్యవధిలో ఒక విడత వ్యాక్సినేషన్‌ పూర్తి చేసే సామర్థ్యం వలంటీర్ల వ్యవస్థకు ఉందని అధికారులు తెలిపారు. 

గడప వద్దకే ప్రభుత్వ సేవలు..
ఒకప్పుడు ప్రభుత్వంతో ఏ చిన్న పని ఉన్నా మండలాఫీసుల చుట్టూనో, జిల్లా కార్యాలయాల చుట్టూనో తిరగాల్సిన పరిస్థితి. వలంటీర్లు వచ్చిన తర్వాత ఆ తిప్పలు తప్పాయి. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేస్తున్నా.. వలంటీరే ఆ వివరాలు ప్రతి ఇంటికి వచ్చి చెప్పి, ఆ కుటుంబంలో ఎవరన్నా ఆ ప్రభుత్వ పథకానికి అర్హులై ఉంటే వారే దరఖాస్తు కూడా పూర్తి చేసి, మంజూరయ్యాక ఆ వివరాలు చెప్పి వెళ్తున్నారు.
► అర్హత ఉంటే, దరఖాస్తు చేసుకున్న 21 రోజుల కల్లా పింఛను, రేషన్‌కార్డు, ఆరోగ్య శ్రీ కార్డును వలంటీరే దగ్గర ఉండి మంజూరు చేయిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా మంజూరు చేస్తున్నారు. 
► ఒకప్పుడు అవ్వాతాతలు ప్రతి నెలా వారి పింఛన్‌ డబ్బులు తీసుకోవడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో.. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే  వెళ్లి పింఛన్‌ డబ్బులిస్తున్నారు. 

జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు..
రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ పనితీరుపై జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
► కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందాలు వేర్వేరుగా మన  రాష్ట్రంలో పర్యటించి వలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి వెళ్లాయి. 

► పంజాబ్, రాజస్థాన్‌ రాష్ట్రాలు కూడా వలంటీర్ల వ్యవస్థ గురించి ఏపీ ప్రభుత్వం నుంచి సమాచారం అడిగి తీసుకున్నాయి. తమ రాష్ట్రాలలోనూ అమలు చేయడానికి అధ్యయనం చేస్తున్నారు. 

► వలంటీర్ల  వ్యవస్థ ద్వారా కరోనా  సమయంలో వేగంగానూ, కచ్చితత్వంతో కూడిన సమాచారాన్ని  సేకరించిన తీరుపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.  

► అంతర్జాతీయంగానూ ఐక్యరాజ్యసమితి అనుబంధంగా పనిచేసే యూఎన్‌ వలంటీర్ల విభాగం రాష్ట్రంలో అమలు చేస్తున్న వలంటీర్ల వ్యవస్థ పనితీరు నచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది.

సేవలకు తగిన గుర్తింపు..
వలంటీర్లు అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట సేవా పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌ 12న ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించారు. మూడు కేటగిరీలలో మొత్తం 2,22,990 మంది గ్రామ, వార్డు వలంటీర్లను ప్రభుత్వం సత్కరించింది. మొత్తం రూ.228.74 కోట్ల నగదు బహుమతితో పాటు అవార్డులు అందించింది. ఈ కార్యక్రమం ప్రతి ఏడాదీ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

వలంటీర్లు అందిస్తున్న సేవలివీ.. 
వలంటీర్లు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 32 రకాల సేవలకు సంబంధించి వలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతీ నెల మొదటి రోజే ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లను పంపిణీ చేయడం, సంక్షేమ పథకాల కోసం నవశకం ద్వారా లబ్ధిదారులను గుర్తించడం, కోవిడ్‌–19 నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే (ఇప్పటికి ఐదుసార్లు పూర్తిచేశారు),  మాస్క్‌లు, మందులు, నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం,  దిశ చట్టంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, గ్రామ, వార్డు సచివాలయాలకు సహాయ సహకారాలు అందించడం, ప్రధానంగా బియ్యం కార్డు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ  కార్డు, పెన్షన్‌ కానుక, ఇళ్ల స్థలాల పట్టాలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం,  జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ బీమా, పారిశుధ్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించడంలాంటి కార్యక్రమాలను గ్రామ, వార్డు వలంటీర్లు నిర్వహిస్తున్నారు.  

రీస్టార్ట్‌తో తప్పిన కష్టాలు 
నేను, నా భర్త నాలుగేళ్ల క్రితం బూదవాడలో హర ఎక్స్‌పోర్ట్స్‌ పేరుతో గ్రానైట్‌ కటింగ్, పాలిషింగ్‌ యూనిట్‌ను రూ.1.50 కోట్లతో ప్రారంభించాం. 14 మంది పని చేస్తున్నారు. రాయితీ కోసం గత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా మంజూరు చేయలేదు.  కరోన  వల్ల పరిస్థితి దారుణంగా మారింది.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్‌ పథకం మమ్మల్ని గట్టెక్కించింది. 2020లో రూ.22.91 లక్షలు,  విద్యుత్‌ రాయితీ రూ.17 లక్షలు విడుదలైంది. దీంతో కష్టాలు తప్పాయి. 
– నుసుం సుజాత, బూదవాడ, ఒంగోలు

ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్‌
కోవిడ్‌–19 లాక్‌డౌన్‌తో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ)పరిశ్రమలను ఆదుకోవడానికి వైఎస్‌ జగన్‌ రూ.1,100 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించారు.  

జగన్‌ పుణ్యమా అని..  
నేను ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణిని. నా భర్త కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.  ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ (ప్రీ ప్రై మరీ) కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు  వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం కింద అందిస్తున్న బలవర్థక ఆహారం  నా లాంటి పేదోళ్లకు ఉపయోగ పడుతోంది.  
– తిరుమలశెట్టి శాంతి, చెన్నూరు హరిజనవాడ–3, గూడూరు రూరల్, నెల్లూరు జిల్లా 

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్థకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలను అమలు చేస్తోంది.  

నిలదొక్కుకుంటున్నాం 
నేను న్యాయవాది కావాలని, మా కుటుంబానికి అండగా ఉండాలని ‘లా’ చదివి 2018 నుంచి న్యాయవాదిగా కాకినాడ కోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నాను. జూనియర్‌ న్యాయవాదిగా ఉండడంతో ‘వైఎస్సార్‌ లా నేస్తం’ పథకం కింద 2019 డిసెంబర్‌ నుంచి ప్రతి నెలా రూ.5 వేల స్టైఫండ్‌ వస్తోంది. సీఎం జగనన్న పాదయాత్రలో మాకు ఇచి్చన హామీని నెరవేర్చినందుకు జూనియర్‌ న్యాయవాదులందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈ స్టైఫండ్‌ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
– సాదే విష్ణు ప్రసన్న కుమారి, వాకలపూడి, కాకినాడ రూరల్‌ మండలం, తూ.గో

వైఎస్సార్‌ లా నేస్తం
న్యాయవాద వృత్తిలోకి కొత్తగా వచ్చి, ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ న్యాయవాదులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 డిసెంబర్‌ 3న ‘వైఎస్సార్‌ లా నేస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మూడేళ్లు, అంతకన్నా తక్కువ ప్రాక్టీస్‌ ఉన్న యువ న్యాయవాదులకు నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ చెల్లిస్తారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం యువ న్యాయవాదులకు నెల నెలా ఇలా స్టైఫెండ్‌ ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి. దాదాపు 1,600 మంది యువ న్యాయవాదులు ఈ పథకం కింద ప్రతి నెలా లబ్ధిపొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.12.24 కోట్లు వెచ్చిందింది. కాగా, న్యాయవాదుల సంక్షేమం కోసం జగన్‌ ప్రభుత్వం ఏకంగా రూ.100 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ.25 కోట్లు బార్‌ కౌన్సిల్‌కు ఇచ్చింది. 

వైద్యం తర్వాతా సాయం 
నేను కూలి పనులు చేసుకుంటూ, వితంతు పింఛన్‌ సాయంతో జీవనం సాగిస్తుండేదానిని. నా భర్త మృతి చెందాడు. ఒక్కగానొక్క కూతురికి వివాహం చేశాను. ఈ నేపథ్యంలో గత ఏడాది జనవరిలో పక్షవాతం వచ్చింది. దీంతో ఏమి చేయాలో తోచలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. మా ఊరికి చెందిన వారు నన్ను విజయవాడ తీసుకెళ్లి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ పది రోజుల పాటు ఉచితంగా చికిత్స అందించారు.  డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వెళ్లాక నేను ఇబ్బంది పడకుండా ప్రతి నెలా రూ.5 వేల చొప్పున ఆరు నెలల పాటు మొత్తంగా రూ.30 వేలు సాయం అందించారు. ఇది నా జీవనానికి ఎంతో భరోసా ఇచ్చింది. సీఎం జగన్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటా. 
– బి.సీతమ్మ, పురిటిగడ్డ, చల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా  

వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా
కుటుంబ పెద్ద ఏదైనా జబ్బుకు ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాక కొంత కాలం పాటు పనులు చేసుకోలేడు. దీంతో ఆ కుటుంబ పోషణ కష్టమవుతుంది. ఈ విషయంలో రోగులకు సహాయంగా ఉండేందుకు 2019 డిసెంబర్‌ 1న ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పథకం ప్రారంభించింది. చికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు వైద్యులు సూచించిన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున, లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు చొప్పున సహాయం చేస్తోంది. 

అర్చకులకు తోడ్పాటు  
ఊళ్లో ఆంజనేయ స్వామి ఆలయ అర్చకునిగా పని చేస్తున్నాను. ఈ ప్రభుత్వం అర్చకులకు తగిన గౌరవం ఇస్తూ.. వారి బాగోగుల పట్ల దృష్టి సారించింది. అర్చకుల వంశ పారంపర్యం హక్కును పునరుద్ధరించింది. కనీస గౌరవ వేతనాల్ని పెంచింది. 
– వైపీ ఆంజనేయులు, బసినేపల్లి, సీకే పల్లి మండలం, అనంతపురం జిల్లా

మాకు మంచి రోజులు 
ఇమామ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో కుటుంబ పోషణ చాలా భారంగా ఉండేది. ప్రస్తుతం ఎంతో హుందాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ వేతనాన్ని పెంచి, ఆర్థిక ఇబ్బందులను  దూరం చేసింది. కరోనా సమయంలోనూ సాయం చేసింది.
 – హాఫిజ్‌ షబ్బీర్‌ అహమ్మద్, ఫిర్‌దోస్‌ మస్‌జిద్, పాతూరు, అనంతపురం 

పాస్టర్లకు భరోసా 
ఎంతో మంది పాస్టర్లు పేదరికంలోనూ సేవలందిస్తున్నారు. మా ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేలు వేతనం ఇస్తుండటం చాలా సంతోషం. దీంతో చర్చిలో మరింత సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం మాకూ భరోసా కల్పించింది. 
– మనుష్యే, రేమా చర్చి పాస్టర్, అనంతపురం 

అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్‌లు, పాస్టర్లకు ఆర్థిక సహాయం
ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ  ఆలయాలు, మసీదులు, చర్చిలో పనిచేసే సిబ్బందికి గౌరవ వేతనాలను పెంచింది. లాక్‌డౌన్‌లో ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33,083 మంది అర్చకులకు, 13,646 మంది ఇమామ్, మౌజన్లకు, 29,841 మంది పాస్టర్లకు మొత్తం రూ.37.71 కోట్లను పంపిణీ చేసింది.

వివక్ష చూపకుండా సాయం
నా భర్త బొబ్బిలి రమణ పామాయిల్‌ తోటలో గెలలు కోస్తుండగా కత్తి జారి తలపై పడి మెదడుకు తీవ్ర గాయం కావడంతో 2020 డిసెంబర్‌ 1న మరణించాడు. దీంతో మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న మమ్మల్ని వైఎస్సార్‌ బీమా పథకం ఎంతో ఆదుకుంది. మా కుటుంబం టీడీపీకి మద్దతుగా ఉంటున్నప్పటికీ ఎటువంటి వివక్ష చూపకుండా రూ.5 లక్షల పరిహారం మంజూరు చేశారు. 
– బొబ్బిలి సన్యాసమ్మ, రైవాడ, దేవరాపల్లి మండలం, విశాఖ జిల్లా 

వైఎస్సార్‌ బీమా
కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులనే ఖర్చు పెట్టి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది.   రాష్ట్రంలో 1.32 లక్షల (బియ్యం కార్డు ఉన్న) కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పథకం అమలు చేస్తోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement