వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు  | YS Viveka Family members teamed up with political rivals | Sakshi
Sakshi News home page

వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు 

Published Tue, Apr 25 2023 4:31 AM | Last Updated on Fri, May 19 2023 1:34 PM

YS Viveka Family members teamed up with political rivals - Sakshi

తండ్రిని హత్య చేసినవానిపై పగ తీర్చుకునే కథతో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. హత్యకు కుట్ర చేసినవారిని జైలుకు పంపించేవరకు చేసిన న్యాయ పోరాటాలూ చూశాం. కానీ తండ్రిని హత్య చేసిన హంతకుడిని ఆప్తుడిగా భావిస్తూ సఖ్యతగా ఉండటం ఏ సినిమా కథలోనూ లేదు. తండ్రి రాజకీయ ప్రత్యర్థులతో జట్టు కట్టడం ఎక్కడా వినలేదు. అందుకే వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిది తీరు విస్మయం కలిగిస్తోంది. వివేకా రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు, ఆది నారాయణ రెడ్డి, బీటెక్‌ రవిలతో ఆయన కుటుంబ సభ్యులు జట్టు కట్టారు.

హతుడైన వివేకా  కుటుంబ సభ్యులు హంతకుడైన దస్తగిరితో చేతులు కలిపారు. ఈ కుట్ర కథలో సూత్రధారులు, పాత్రధారులూ ఒక్కటయ్యారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసం కక్షగట్టిన కుటుంబ సభ్యులు కూడబలుక్కుని వాస్తవాలు దాచిపెడుతున్నారు. రాజకీయ ఆధిపత్యం కోసం కాచుకుని కూచున్న ప్రత్యర్థి పార్టీ నేతలు ఆడించినట్టు ఆడుతున్నారు. వెరసి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిజాలకు పాతరేసేందుకు ఆయన సొంత కుటుంబ సభ్యులే యత్నిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ వారసత్వ విభేదాలతో వివేకా హత్య దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్న ఈ ముఠా పన్నాగం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.  

వివేకా శత్రువులతో జట్టుకట్టిన ఆయన కుటుంబ సభ్యులు 
వైఎస్‌ వివేకానందరెడ్డికి బయట శత్రువులు, ప్రత్యర్థులతో ఆయన కుటుంబ సభ్యులే జట్టు కట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆయనకు రాజకీయంగా శత్రువులు, ప్రత్యర్థులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్‌ రవి కాగా... ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలతో అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌ రెడ్డి ఆయనకు ఇంట్లోనే శత్రువులుగా మారారన్నది బహిరంగ రహస్యం. అలాంటి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌ రెడ్డితో పాటు వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా ప్రస్తుతం ఆ టీడీపీ నేతలతో అత్యంత సన్నిహితంగా ఉంటుండటం విస్మయపరిచేదే.

వాస్తవానికి ఒకప్పుడు వివేకా వద్ద డ్రైవర్‌గా ఉన్న దస్తగిరిని సునీతే పన్లోంచి తొలగించారు. అదే దస్తగిరి వివేకాను నరికి హత్య చేస్తే... అతనితో సునీత, అమె భర్త సఖ్యతగా ఉంటున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఓ కీలకమైన అంశం చర్చించాల్సిన అవసరం ఏర్పడుతోంది. వివేకానందరెడ్డి మరణిస్తే ఎవరికి ప్రయోజనం అన్నది ఈ కేసులో కీలకంగా మారుతోంది. కడప జిల్లాలో కనీసం ఉనికి చాటుకోవాలంటే వివేకానందరెడ్డి ఉండకూడదన్నది టీడీపీకి రాజకీయ అవసరం.

తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నందున వివేకానందరెడ్డి అడ్డుతొలగించుకోవడం అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ప్రయోజనకరం. పులివెందులలో పట్టు సాధించడానికి వివేకానే అడ్డున్నారన్నది బీటెక్‌ రవి ఉద్దేశం. అందుకే 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లోఆయన్ని దొంగదెబ్బతీసిన ఈ ముఠానే 2019లో ఏకంగా భౌతికంగా అడ్డుతొలగించుకునేందుకు కుట్ర పన్నారనటానికే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పాలి. మరి వారితో వివేకా కుమార్తె, అల్లుడు, పెద్ద బావమరిది సఖ్యతగా ఉండటం వెనుక అసలు కోణం ఏమిటన్నదే ఈ కేసులో కీలకం.

అసలు టీడీపీ మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి... వివేకా పెద్ద బావమరిది శివ ప్రకాశ్‌ రెడ్డికి ఎలా సన్నిహితుడయ్యారు? అదీ ఆదినారాయణ రెడ్డిని ఎంపీ ఎన్నికల్లో ఓడించి సిట్టింగ్‌ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో...! దీని వెనుకే అసలు గూడు పుఠాణీ ఉంది. వివేకానందరెడ్డి మరణించిన విషయాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి చెబితే శివ ప్రకాశ్‌ రెడ్డి వెంటనే ఎవరికి సమాచారం ఇవ్వాలి... సాధారణంగా సమీప బంధువులకు ముందు చెప్పాలి.

కానీ వివేకానందరెడ్డి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న అప్పటి టీడీపీ మంత్రి ఆది నారాయణ రెడ్డికి మొదట ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనేమీ వివేకాకు బంధువు కాదు... మిత్రుడు అంతకన్నా కాదు. పైపెచ్చు రాజకీయ ప్రత్యర్థి. ఏదో విషయాన్ని గోప్యంగా ఉంచాలన్న ఉద్దేశంతోనో... విషయాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడతోనో వారిద్దరి మధ్య ఫోన్‌ సంభాషణ జరిగి ఉంటుందన్నది తేలిగ్గానే అర్థమవుతుంది. 

వివేకా ఇంట్లో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు 
వివేకానందరెడ్డి రెండో వివాహం అనంతరం ఆయన కుటుంబంలో తలెత్తిన పరిణామాలు ఈ కేసులో అత్యంత కీలకం. తన రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని... ఆమెతో తనకు పుట్టిన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పడమే ఆ కుటుంబంలో విభేదాలకు ఆజ్యం పోసింది. ఎందుకంటే ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు–చిన బావమరిది నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఆస్తిలో షమీమ్‌కు వాటా ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు.

ఇక రాజకీయంగా వివేకా వారసత్వాన్ని అందుకోవాలని పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డి భావిస్తున్నారు. అందుకు వివేకా సమ్మతించకపోవడంతో పాటు తన రెండో భార్య కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తాననేసరికి కక్ష గట్టారు. అందుకే వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె, అల్లుడు ఆయన్ని విడిచిపెట్టి హైదరాబాద్‌లో ఉంటుండగా... షమీమ్‌తో సునీత ఘర్షణ పడ్డారు. జుగుప్సాకరమైన భాషలో వాట్సప్‌ మెసేజుల ద్వారా దూషించుకున్నారు. షమీమ్‌ను వివేకా బావమరుదులిద్దరూ తీవ్రంగా బెదిరించారు. 

2012లో రోడ్డు ప్రమాదానికి గురైన వివేకాను చూసేందుకు వెళ్లిన షమీమ్‌ను శివప్రకాశ్‌ రెడ్డి ఇంట్లోకి రానివ్వలేదు. ఆయన హెచ్చరించడంతో... ప్రాణభయంతో షమీమ్‌ అన్నయ్య, వదిన కుటుంబం పులివెందుల విడిచిపెట్టి వెళ్లిపోయింది. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్‌ రెడ్డిలతో ముప్పు ఉన్నందునే షమీమ్‌ హైదరాబాద్‌లో తన చిరునామా కూడా గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది.

షమీమ్‌కు ఓ ఇల్లు ఇవ్వాలని... ఆమె కుమారుడిని  హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో చదివించాలని అనుకుంటున్నా గానీ తన కుటుంబ సభ్యులు అడ్డుపడుతుండటంతో సాధ్యం కావడం లేదని వివేకా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా. ఎందుకంటే అప్పటికే కుటుంబ వ్యాపార సంస్థలకు సంబంధించి ఆయనకు ఉన్న చెక్‌ పవర్‌ను ఆయన కుటుంబ సభ్యులు తొలగించారు.

వివేకా ఇద్దరు బావమరుదులు తనను తీవ్రంగా బెదిరించారని వారితో తనకు తన కుమారుడికి ముప్పు ఉందని షమీమ్‌ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూ స్పష్టం చేశారు. వివేకాకు కూడా ఆయన ఇద్దరు బావమరుదుల నుంచే ముప్పు ఉండేదని చెప్పారామె. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలు ఆయన హత్య వెనక ఎంత బలంగా ఉండవచ్చో తెలియకమానదు. 

రక్తపు మరకల లేఖపై గప్‌చుప్‌..!! 
వివేకానందరెడ్డికి ఇంటా, బయటా ఉన్న శత్రువులందరూ అన్ని విషయాలపైనా మాట్లాడుతున్నారు కానీ... రక్తపు మరకలతో ఉన్న లేఖపై మాత్రం మౌనం వహిస్తున్నారు. అదే వివేకా రాసిన లేఖ. వివేకా రక్తపు మరకలతో తడిసిన లేఖపై... అంతా కూడబలుక్కుని నిర్ణయించుకున్నట్టు ఒక్క మాటా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఈ హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు, ఆయన బృందం పన్నిన వ్యూహంలో భాగమే ఆ లేఖపై మౌనం!!.  

విచిత్రమేంటంటే తరచూ టీడీపీ వేదికల మీద ఈ కేసు గురించి మాట్లాడే చంద్రబాబు ఒక్క రోజు కూడా వివేకా రాసిన లేఖ గురించి ప్రస్తావించ లేదు. సునీత, ఆమె భర్త కూడా అసలు అలాంటి లేఖ ఒకటి ఉన్నట్టుగా కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే వివేకా గుండె పోటుతో మరణించారనే కట్టు కథను ప్రచారంలోకి తెచ్చేందుకే ఆ లేఖను ఆ ముఠా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించారు.

వాళ్లు బెదిరించడంతో... డ్రైవర్‌ ప్రసాద్‌ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరచినట్టు ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదట.. అంటే 2019, మార్చి 15న ఉదయం 6.10 గంటలలోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి... ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. తాము వచ్చే వరకు ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను ఎవరికి ఇవ్వకుండా దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. వారు అలా చెప్పకపోయి ఉంటే కృష్ణారెడ్డి ఆ లేఖ విషయాన్ని వెంటనే బయటపెట్టేవారు.

దాంతో వివేకాది హత్యేనని అందరికీ వెంటనే స్పష్టత వచ్చేది. గుండెపోటో మరొకటో కాదని వెంటనే తెలిసిపోయేది. అలా తెలిసి ఉంటే... ఎవ్వరూ మృతదేహాన్ని తాకే ప్రయత్నం చేసి ఉండేవారు కాదు. అప్పుడసలు ‘‘రక్తపు మరకలు కడిగిందెవరు? గాయాలకు కట్లు కట్టిందెవరు?’’ అని పదేపదే ప్రశ్నించే అవకాశం చంద్రబాబు నాయుడికి వచ్చి ఉండేదే కాదు.  

కానీ వారు అలా చేయలేదు. వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే ఆ లేఖను బయటపెట్టకూడదని సునీత, ఆమెభర్త రాజశేఖరరెడ్డి, బావ శివప్రకాశ్‌ రెడ్డి నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. అనంతరం టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ద్వారా గుండె పోటు కథను ప్రచారంలోకి తెచ్చారు. గుండె పోటు కథ ప్రచారంలోకి రావడంతో తమ లక్ష్యం నెరవేరిందని వారు భావించారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పులివెందుల చేరుకోవటంతో ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి వారికి ఇచ్చారు.

ఆ లేఖను చదివాక కూడా వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించనే లేదు. ఆ సెల్‌ఫోన్‌లోని మెస్సేజులు, డేటాను డిలీట్‌ చేశారు. అనంతరం సునీత ఆదేశాలతో సాయంత్రం 5గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ హత్య కేసులో కీలకాంశం. ముందస్తు పన్నాగం ప్రకారమే ఆ లేఖపై మాత్రం ఇటు సునీత, ఆమె భర్త గానీ అటు చంద్రబాబు, టీడీపీ నేతలుగానీ మాట్లాడటం లేదు. 

అవినాశ్‌ను వివేకా ఇంటికి వెళ్లమని చెప్పింది శివప్రకాశ్‌రెడ్డే  
వివేకా హత్య కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు టీమ్‌ పక్కా పన్నాగంతో వ్యవహరించింది. వాస్తవాలు వెలుగులోకి రాకుండా...కేవలం ఊహాగానాలు, అభూతకల్పనల చుట్టూనే దర్యాప్తు కేంద్రీకృతం అయ్యేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే టీడీపీ అనుకూల పచ్చ మీడియాలో రోజుకో కట్టుకథను ప్రచారంలోకి తీసుకువస్తూ అటు సీబీఐ దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తూ... ఇటు ప్రజలనూ తప్పుదారి పట్టిస్తోంది. ఎంపీ అవినాశ్‌ రెడ్డినే లక్ష్యంగా చేసుకుని విషం చిమ్ముతోంది.

ఎంపీ అవినాశ్‌ రెడ్డి వివేకా నివాసానికి ఏ సమయానికి వెళ్లారు... అక్కడ ఏం చూశారు అన్నదే ప్రధానాంశంగా చేసుకుని... వివేకా మృతదేహానికి కుట్లు వేశారని, కట్లు కట్టారనే అవాస్తవాలను ప్రచారంలోకి తీసుకువస్తోంది. వివేకానందరెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డి 2019 మార్చి 15న ఉదయం 6.20 గంటల సమయంలో ఫోన్‌ చేసి చెబితేనే ఎంపీ అవినాశ్‌ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లారు. అప్పటికే ఎన్నికల ప్రచారం కోసం తన అనుచరులతో జమ్మలమడుగు వెళుతున్న ఆయనకు శివ ప్రకాశ్‌రెడ్డి నుంచి ఫోన్‌ వచ్చింది.

ఆ ఫోన్‌ రాకపోయి ఉంటే ఆయన జమ్మలమడుగు వెళ్లి ఉండేవారు. వివేకా మరణించారని చెప్పి... వెంటనే వెళ్లమంటేనే అవినాశ్‌ అక్కడికి వెళ్లారు. ఆయన అక్కడకు వెళ్లినా పీఏ కృష్ణా రెడ్డి మాత్రం వివేకా రాసిన లేఖ గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆ లేఖ విషయం గోప్యంగా ఉంచమని సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయన్ని ఆదేశించారు. ఆ లేఖ విషయాన్ని శివ ప్రకాశ్‌ రెడ్డి ఎంపీ అవినాశ్‌కు ఫోన్‌ చేసినప్పుడు చెప్పినా... లేక ఆయన వివేకా ఇంటికి రాగానే పీఏ కృష్ణా రెడ్డి చెప్పినా ఎవ్వరూ భౌతిక కాయాన్ని తాకే ఉండేవారే కాదు.

ఆ లేఖ విషయాన్ని అవినాశ్‌ వెంటనే పోలీసులకు చెప్పి ఉండేవారు. వివేకా హత్యకు గురయ్యారని అందరికీ వెంటనే తెలిసిపోయేది. అప్పటికే భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు, సాధారణ ప్రజల్ని ఆ మృతదేహం దగ్గరకు ఎవరూ వెళ్లకుండా అవినాశే కట్టడి చేసేవారు. దాంతో ఈ కేసులో కీలక ఆధారాలు పోలీసులకు దొరికేవి.

కానీ అలా జరగడం నర్రెడ్డి శివ ప్రకాశ్‌ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదని వాళ్లు పన్నిన వ్యూహమే చెబుతోంది. అందుకే ఆయన లేఖ విషయాన్ని ఎంపీ అవినాశ్‌కు చెప్పలేదు. నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించి వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించారని చెప్పటానికి ఇంతకన్నా ఆధారాలేం కావాలి? 

‘కట్టు’కథలో ఇరికించడానికేనా? 
వివేకానందరెడ్డిని హత్య చేసి.. గుండెపోటుతో మరణించారన్న కట్టు కథను తెరపైకి తేవడానికే శివప్రకాశ్‌ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఫోన్లో మాట్లాడుకుని ఉంటారన్నది కాస్త లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యే విషయం. వారిద్దరి ఫోన్‌ సంభాషణ అనంతరమే గుండె పోటు కథ తెరపైకి వచ్చింది. వివేకా గుండె పోటుతో మరణించారని శివప్రకాశ్‌ రెడ్డి తనతో చెప్పారని ఆది నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఎక్కువగా సిగరెట్లు తాగడంతోనే అలా అయ్యి ఉంటుందని తాను ఆయనతో చెప్పినట్లు కూడా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఎంత కుట్రపూరితంగా గుండె పోటు కథను తెరపైకి తెచ్చారో తెలియటం లేదా? మరోవైపు వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్‌ రవి, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి సన్నిహితుడయ్యారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు డబ్బులు ఇచ్చి  ప్రలోభాలకు గురిచేసి తాను ఎమ్మెల్సీగా గెలిచానని బీటెక్‌ రవి తాజాగా పచ్చ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం అంగీకరించారు. అదే ఇంటర్వ్యూలో వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, తాను ఇప్పటికీ అత్యంత సన్నిహితులమని కూడా చెప్పడం గమనార్హం. అంటే వివేకా మరణంతో రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధి పొందుతామని భావిస్తున్న వారంతా అప్పుడు ఇప్పుడూ ఒకే జట్టుగా ఉంటున్నారన్నది అర్థం కావటం లేదా? 

అమరావతి నుంచి కథ నడిపిన బాబు..
వైఎస్‌ వివేకా హత్యకు గురైన రోజు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతి నుంచి పెద్ద కథే నడిపారు. అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కడప ఎస్పీతోనూ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డితోను, అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్‌ రవితోను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కేసు దర్యాప్తును ప్రభావితం చేశారు.

వివరాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు అప్‌డేట్‌ చేశారు. కడప ఎస్పీకి సైతం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తును ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేందుకు ఏబీవీ ఎందుకు అంతగా తాపత్రయ పడ్డారన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ... తాను జరిపిన దర్యాప్తులో అసలు లేఖ విషయమే పట్టించుకోలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement